తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr New Party Brs : కేసీఆర్‌ "బిఆర్‌ఎస్" గుర్రం ఎగిరేనా....?

KCR New Party BRS : కేసీఆర్‌ "బిఆర్‌ఎస్" గుర్రం ఎగిరేనా....?

HT Telugu Desk HT Telugu

13 June 2022, 11:26 IST

google News
    • తెలంగాణ ముఖ్యమంత్రి తలపెట్టిన జాతీయ పార్టీ ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రెండోసారి తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పుకుని కేంద్రంలో చక్రం తిప్పాలని భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా దేశంలోని పలు ప్రాంతీయ పార్టీలతో చర్చలు కూడా జరిపారు. బీజేపీకి వ్యతిరేకంగా భావసారూప్య పక్షాలను ఏకం చేసేందుకు పలు పార్టీలను సంప్రదించిన కేసీఆర్‌ చివరకు సొంతంగానే జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారు.
బిఆర్‌ఎస్ ఏర్పాటు వెనుక పీకే మంత్రాంగం ఉందా…?
బిఆర్‌ఎస్ ఏర్పాటు వెనుక పీకే మంత్రాంగం ఉందా…?

బిఆర్‌ఎస్ ఏర్పాటు వెనుక పీకే మంత్రాంగం ఉందా…?

కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు టిఆర్‌ఎస్‌ అధాినేత కేసీఆర్‌ ప్రయత్నాలపై రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ అకాంక్షను రగల్చి సాధించిన స్ఫూర్తితో ఇప్పుడు దేశవ్యాప్తంగా చక్రం తిప్పాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే భారత రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే బిఆర్‌ఎస్‌ జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై దృష్టి పెట్టిన కేసీఆర్‌ ఇతర పార్టీలకు చెందిన మేధావులు, నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు. 

కేసీఆర్‌ బిఆర్‌ఎస్‌తో ఎంతమేరకు విజయం సాధిస్తారనేది పక్కన పెడితే తెలంగాణలో రాజకీయ వారసత్వాన్ని కుమారుడికి అందించాలనే సంకల్పం కూడా నెరవేర్చుకునే అవకాశం లభిస్తుంది. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం ద్వారా తెలంగాణ బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగించే అవకాశాలు కూడా లేకపోలేదు.

దేశంలో బలమైన రాజకీయ పునాదులు ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టులకు పోటీగా జాతీయ రాజకీయ పార్టీని నెలకొల్పడం అషామాషీ వ్యవహారం కాకపోవచ్చు. ఇప్పటికిప్పుడు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి కేసీఆర్‌ ఎదగకపోయినా భవిష్యత్తులో ఆ పార్టీకి ప్రజల మద్దతు లభిస్తుందని విశ్వసిస్తున్నారు. తెలంగాణ సాధన కోసం పార్టీ ఏర్పాటు చేసి విజయం సాధించడానికి సుదీర్ఘ కాలం పట్టినా, టిఆర్‌ఎస్‌ సాధించిన విజయాలు స్ఫూర్తిగా బిఆర్‌ఎస్‌ను నెలకొల్పాలని భావిస్తున్నారు. 

వచ్చే ఏడాది జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయాన్ని దక్కించుకోవడం ద్వారా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలన్నది టిఆర్‌ఎస్‌ అధినేత వ్యూహం కావొచ్చు. అదే సమయంలో కాంగ్రెస్‌, బీజేపీలు బలహీనపడితే ఆ స్థానంలో మరో ప్రత్యామ్నయ కూటమి రావడం కంటే మరో జాతీయ పార్టీని తీసుకురావడమే మేలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఫ్రంట్‌లు, సంకీర్ణాల శకం ముగియడంతో కేసీఆర్‌ ఏర్పాటు చేసే బిఆర్‌ఎస్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు. 

కేసీఆర్‌కు ఉన్న రాజకీయ ఇమేజ్‌ కూడా ఇందుకు ఉపకరిస్తుందనే అంచనాలు ఉన్నాయి. కేసీఆర్‌కు ప్రస్తుతం రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్‌కిషోర్‌ వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్‌ కిషోర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని భావించినా, చివరి నిమిషంలో అది వికటించింది. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న పాతతరం నాయకుల ఆలోచనా ధోరణులకు భిన్నంగా ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహాలు కూడా కేసీఆర్‌ను ప్రభావితం చేసి ఉండొచ్చు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను అధికారానికి చేరువ చేసిన పీకే వ్యూహం కూడా కేసీఆర్‌ తాజా ఆలోచనల వెనుక ఉండొచ్చు.

దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయడం, ప్రత్యామ్నయ రాజకీయ శక్తిని రూపొందించడం అనేది కేసీఆర్‌ ముందుండే ఏకైక సవాలు కావొచ్చు. కేంద్రంతో టిఎంసి, డిఎంకె వంటి పక్షాలు నేరుగానే కొట్లాడుతున్నాయి. కేసీఆర్‌ బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నా, పైకి కనిపించని సఖ్యత ఢిల్లీ పెద్దలతో ఉందనే ప్రచారం కూడా లేకపోలేదు. తాజాగా బిఆర్‌ఎస్‌ ఏర్పాటుతో కొత్త రాజకీయ సమీకరణలు మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్ని కలిసొచ్చి కేసీఆర్‌ బిఆర్‌ఎస్‌ గుర్రం భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో కీలకం అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే దానికి బోలెడు శ్రమ, అదృష్టంతో పాటు దేశ ప్రజలందరి ఉమ్మడి ప్రయోజనాలు కూడా ప్రభావితం చేస్తాయి.

తదుపరి వ్యాసం