తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Trs Plenary: బీఆర్ఎస్ గా టీఆర్ఎస్.. కేసీఆర్ అసలు విషయం చెప్పేశారా…

TRS Plenary: బీఆర్ఎస్ గా టీఆర్ఎస్.. కేసీఆర్ అసలు విషయం చెప్పేశారా…

HT Telugu Desk HT Telugu

27 April 2022, 13:17 IST

google News
    • టీఆర్ఎస్ ను ‘భారత రాష్ట్ర సమితి’గా మార్చాలని కొందరు ఎమ్మెల్యేలు కోరుతున్నారని కేసీఆర్ అన్నారు. ప్లీనరీలో ప్రసంగించిన కేసీఆర్.. దేశ విధానాలపై గళమెత్తారు. మార్పు కోసం హైదరాబాద్ వేదికగానే అడుగులు పడితే మనందరికీ గర్వకారణమని వ్యాఖ్యానించారు.
ప్లీనరీలో కేసీఆర్
ప్లీనరీలో కేసీఆర్ (HT PRINT)

ప్లీనరీలో కేసీఆర్

దేశంలో సమూల మార్పులు రావాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. భారత్‌ వద్ద తగినంత ఆర్థిక వనరులు ఉన్నాయన్న ఆయన.. అభివృద్ధి చేయాలనే సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే జరిగి తీరుతుందని వ్యాఖ్యానించారు. దేశం బాగు కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి అడుగులు పడితే మనకే గర్వకారణమన్నారు. దేశ గతి, స్థితి మార్చడానికి కొత్త అజెండా అవసరమని.. దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా కావాలని వ్యాఖ్యానించారు.

‘నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానం కోసం వేదికలు రావాలి. సరైన ప్రగతి పంథాలో నడిపించేందుకు కొత్త సిద్ధాంతం రావాలి. దేశానికి గర్వకారణంగా నిలిచే కొత్త అజెండా, సిద్ధాంతం రావాలి... అది మన హైదరాబాద్‌ వేదికగా ఆ అజెండా వస్తే అది మనకే గర్వకారణం. ‘భారత రాష్ట్ర సమితి’ రావాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి. కొత్త రాజకీయ అజెండా కోసం దారులు వెతకాలి’                         - కేసీఆర్, టీఆర్ఎస్ అధినేత

సాగుకు అందుబాటులో ఉండే భూమి పరంగా చైనా కంటే భారత్‌ ముందుందని కేసీఆర్ గుర్తు చేశారు. అయినా ఇవాళ భారత్‌ను మించి చైనా ఏస్థాయిలో ఉందో అందరికీ తెలుసన్నారు. మన రాష్ట్రంలోని ఒక జిల్లా అంత లేని ఇజ్రాయెల్‌ నుంచి ఆయుధాలు కొంటున్నామని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటిపై దృష్టి పెట్టకుండా.. పుల్వామా, కశ్మీర్ ఫైల్స్ అంటూ లేని భేషాలను తెరపైకి తీసుకువస్తున్నారని దుయ్యబట్టారు. మానిపోయిన గాయాలపై మళ్లీ కారం చల్లటం అంటే ఇదే అంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గవర్నర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా గవర్నర్ల వ్యవస్థపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక కామెంట్లు చేశారు. మహారాష్ట్రంలో ఎమ్మెల్సీ నియామకాలకు సంబంధించి ఫైల్ పంపిస్తే ఏడాదిగా పక్కనపెట్టారని గుర్తు చేశారు. ఇక తమిళనాడులో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. నాడు తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీ ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూడా గవర్నర్ వ్యవస్థతో కుప్పకూల్చారని కేసీఆర్ ప్రస్తావించారు. ఇలాంటి చర్యలను తిప్పికొట్టేలా.. మరోసారి ఎన్టీఆర్ ను గెలిపించి.. కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. ఇలాంటి వాటి నుంచి దేశం నేర్చుకోవాలని కానీ.. అలా చేయకుండా వక్రమార్గంలో నడిచేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వాటన్నింటిని సమూలంగా మార్పు చేసేలా కొత్త రాజకీయ అజెండాతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

అయితే జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై సూటిగా చెప్పని కేసీఆర్.. బీఆర్ఎస్ టాపిక్ ను ప్రస్తావించటంపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. చెప్పాలనుకున్న అసలు విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారని అంటున్నారు. 

సంబంధిత కథనం

టాపిక్

తదుపరి వ్యాసం