తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr Letter : ఉద్యమాన్ని రక్తసిక్తం చేసిందే కాంగ్రెస్‌, 'తెలంగాణ' దయాభిక్ష కాదు - సీఎం రేవంత్ కు కేసీఆర్ బహిరంగ లేఖ

KCR Letter : ఉద్యమాన్ని రక్తసిక్తం చేసిందే కాంగ్రెస్‌, 'తెలంగాణ' దయాభిక్ష కాదు - సీఎం రేవంత్ కు కేసీఆర్ బహిరంగ లేఖ

02 June 2024, 6:43 IST

google News
  •  KCR Letter to CM RevanthReddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినేత లేఖ రాశారు. ‘తెలంగాణ’ కాంగ్రెస్‌ దయాభిక్ష కాదన్న ఆయన.. ప్రజా పోరాటాల ఫలితమని చెప్పారు. ప్రభుత్వం నిర్వహించే అవతరణ ఉత్సవాలకు హాజరుకావడం లేదని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ లేఖ
సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ లేఖ

సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ లేఖ

KCR Letter to CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  బీఆర్ఎస్ అధినేత సీఆర్ బహిరంగ లేఖ రాశారు.  ప్రభుత్వం పక్షాన నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు తనకు  ఆహ్వానం పంపిన నేపథ్యంలో ప్రజల పక్షాన  ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాట ఫలితమని,  అమరుల త్యాగాల పర్యవసానమనీ కాకుండా… కాంగ్రెస్‌ దయాభిక్షగా చేస్తున్న ప్రచారాన్ని నిరసిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.  1969 నుంచి ఐదు దశాబ్దాలుగా…. భిన్నదశలలో, భిన్నమార్గాలలో ఉద్యమ ప్రస్థానం సాగిందన్నారు. చరిత్ర పొడుగునా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది మీరు దాచేస్తే దాగని సత్యమని తన లేఖలో ప్రస్తావించారు.

1952 ముల్కీ ఉద్యమంలో సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థుల ప్రాణాలు పొట్టన పెట్టుకుందని…. అక్కడ్నుంచే కాంగ్రెస్ క్రూర చరిత్ర కొనసాగిందని విమర్శించారు. ఫజల్‌అలీ కమిషన్‌ సిఫార్సులను కాలరాచి, తెలంగాణ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఆంద్రప్రదేశ్‌ఏర్పాటు చేసిందన్నారు.  తెలంగాణలో ఐదారు తరాల ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది అని తెలిపారు.

కేసీఆర్ లేఖలోని అంశాలు…

  • తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మంది ముక్కుపచ్చలారని యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్‌ దమననీతికి సాక్ష్యమే గన్‌పార్క్‌అమరవీరుల స్థూపం. ఆ స్థూపాన్ని కూడా ఆవిష్కరించుకోనివ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్‌కర్కశత్వం తెలంగాణ చరిత్ర పుటలలో నిలబడిపోయింది. మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది యువకుల ప్రాణాలను బలిగొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్‌ పార్టీదే.
  • తెలంగాణకు కాంగ్రెస్‌ చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జరిగిన చారిత్రాత్మక ప్రయత్నమే టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం. పార్లమెంటరీ రాజకీయ పంథాలో, శాంతియుత మార్గంలో తెలంగాణ సాధన లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ఏర్పడటం తెలంగాణ ఉద్యమంలో మేలిమలుపు.
  • టిఆర్‌ఎస్‌తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వ్యక్తీకరణ నిచ్చింది, తెలంగాణ వాదాన్ని తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచింది. తెలంగాణ డిమాండ్ కు విస్తృత ఆమోదాన్ని సాధించింది.  కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు ముందుకు రాకపోగా… తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యపరిచే అనైతిక కుట్రలకు పాల్పడింది.
  • పదవులను టీఆర్ఎస్ పార్టీ త్యాగం చేసింది. చివరికి నేను నా ప్రాణాలను పణంగా పెట్టి ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్‌సచ్చుడో’ అని ఆమరణ నిరాహార దీక్షకు దిగవలసి వచ్చింది. యావత్‌ తెలంగాణ నా నిరాహార దీక్షకు మద్దతుగా నిలిచి భూమ్యాకాశాలను ఒక్కటి చేసే విధంగా ఉద్యమిస్తే డిసెంబర్‌9 ప్రకటన వచ్చింది.
  • సమైక్య పాలకుల ఒత్తిడికి తలొగ్గి, చేసిన ప్రకటనపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్‌ మరోసారి ఘోరమైన మోసం చేసింది. కాంగ్రెస్‌పార్టీ చేసిన మోసాల పర్యవసానంగా ఆవేశంతో వందలాదిమంది యువకులు ప్రాణ త్యాగాలకు పాల్పడ్డారు. ఇందుకు గాను, మీరు గానీ మీ పార్టీ గానీ ఏనాడూ పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు. తెలంగాణ ప్రజలను క్షమాపణలు వేడుకోలేదు. పైనుంచీ దయతో మేమే తెలంగాణ ఇచ్చామని ఆధిపత్య, అహంభావ ధోరణిని ప్రదర్శిస్తూ ఉద్యమాన్ని, అమరుల త్యాగాన్ని అవమానిస్తున్నారు. ఈ వైఖరి పూర్తిగా గర్హనీయం. 
  • మీ పార్టీ పరిస్థితి అది అయితే ఇక మీ పరిస్థితి! తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మీరు మీ నోటినుండి ఇప్పటివరకూ జై తెలంగాణ అనే నినాదాన్ని పలక లేదు. తెలంగాణ ప్రజలకు ప్రాణ సమానమైన జై తెలంగాణ నినాదాన్ని నోటినిండా పలకలేని మీ మానసిక వైకల్యాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఇక ముందయినా తెలంగాణ వ్యతిరేక మానసికత నుంచి బయటపడి జై తెలంగాణ అని నినదించే వివేకాన్ని తెలంగాణ సమాజం మీనుంచి కోరుకుంటున్నది.
  • మీరు ముఖ్యమంత్రయి ఆరు నెలలవుతున్నా ఇప్పటివరకూ తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని సందర్శించక, శ్రద్ధాంజలి ఘటించక తెలంగాణ మనోభావాలను తీవ్రంగా గాయ పరిచారు.. మీ ప్రవర్తన, మీ పార్టీ ప్రవర్తనతో స్పష్టమవుతున్నది ఒక్కటే. కాంగ్రెస్‌ఇప్పటికీ మారలేదు. ఇక మారదు. ఇక ముందు మారే అవకాశం లేదు. నాటికీ, నేటికీ ఎన్నటికీ కాంగ్రెస్‌కు తెలంగాణ ఒక రాజకీయ అవకాశమే తప్ప, మనఃపూర్వక ఆమోదం కాదు. తెలంగాణలో గత ఆరు నెలలుగా సాగుతున్న మీ పరిపాలనే ఇందుకు నిదర్శనం.
  • తొమ్మిది సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరాఘాటంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయగలిగిన వ్యవస్థ మీరు అధికారం లోకి రాగానే ఎందుకు సరిగ్గా పని చేయలేకపోతుందో అర్థం కాక నేను నా విస్మయాన్ని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ పరిణామం రాష్ట్ర ప్రతిష్టకు, ప్రగతికి గొడ్డలిపెట్టుగా మారిందనేది నిర్వివాదాంశం.
  • మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు, కరెంటు కోతలకు ఆకాల వర్షాలు తోడయ్యి పంటలు దెబ్బతినిపోయాయి. ఇందిరమ్మ రాజ్యమని గొప్పలు చెప్పిన మీరు ఒక్క రైతును కూడా పరామర్శించలేదు. వారికి భరోసా నిచ్చే చర్యలేవీ చేపట్టలేదు.
  • మీరు అధికారం లోకి వచ్చిన తరువాత రైతుబంధు సహాయం సకాలంలో అందించడంలో దారుణంగా విఫలమయ్యారు.సరైన సమయంలో పంట పెట్టుబడి అందకపోవడంతో పాటూ, డిసెంబర్‌9 లోపు మీరు చేస్తామని చెప్పిన రుణమాఫీ చెయ్యక పోవడంతో రైతులకు అన్ని మార్గాలు మూసుకు పోయాయి. .
  • 10 సంవత్సరాల బి ఆర్‌ఎస్‌పాలన రైతులను తలమీద పెట్టుకొని గౌరవిస్తే, ఆరు నెలల మీ పాలన రైతులను చెప్పుతో కొడతామని దారుణంగా అవమానించింది.
  • ఇక నీటి పారుదల విషయానికి వస్తే గత పదేళ్ళలో స్వర్ణ యుగాన్ని అనుభవించిన రాష్ట్రాన్ని కృత్రిమ కరువు పాలు చేసారు. నదీ జలాలను ఎత్తిపోసే వ్యవస్థ అందుబాటులో ఉన్నా, ఆ పని చేయకుండా నీళ్ళు సముద్రం పాలవుతుంటే మీ క్షుద్ర రాజకీయ ప్రయోజనాల కోసం చోద్యం చూస్తూ కూర్చున్నారు. 
  • ఒక్క రైతులే కాదు , మీ పాలన తీరుతెన్నులతో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 
  • ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ. 12,000 ఇస్తామని వాగ్దానం చేసారు. ఇప్పటివరకూ వారికి ఒక్కపైసా ఇవ్వక పోగా, మీ ముందు చూపు లేని నిర్ణయాల వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. మీ అనాలోచిత విధానాలతో వారి కడుపు మీద దెబ్బకొట్టారు.
  • మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని ఆడబిడ్డలకు నెలకు రూ. 2500 రూపాయలు ఇస్తామని ఊదరగొట్టారు. రాష్ట్రం లోని మహిళలు కళ్ళల్లో వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. 
  • దీన్నిబట్టి, మహాకవి శ్రీశ్రీ అన్నట్టు, ‘ముందు దగా, వెనుక దగా, కుడి ఎడమల దగా దగా” అనే కవితా వాక్యాలు మీ పాలనకు సరిగ్గా సరిపోతాయి.
  • రాష్ట్రంలో పారిశ్రామికరంగం కుదేలవుతున్నది. కరెంటు కోతలు రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. కొత్త పెట్టుబడులు రాకపోగా వచ్చినవి సైతం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఐటీ రంగంలోనూ అదే పరిస్థితి.
  • ప్రజాపాలన పేరిట అధికారం లోకి వచ్చిన మీరు, మిమ్మల్ని ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రంలో బి ఆర్‌ఎస్‌కార్యకర్తలపై దాడులు నిత్యకృత్యంగా మారిపోయాయి. తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష కార్యకర్తలను హత్య చేసే దుష్ట సంస్కృతిని మీ పార్టీ తీసుకొస్తున్నది.
  • తెలంగాణకు గర్వకారణమైన అస్తిత్వ చిహ్నాలపై విషం కక్కుతూ అధికార ముద్ర నుంచి తొలగిస్తామని అవమానిస్తున్నారు. మీ వైఫల్య్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. వెయ్యి సంవత్సరాల కిందనే గొలుసు కట్టు చెరువుల వ్యవస్థను నిర్మించి తెలంగాణకు అన్నం పెట్టిన కాకతీయ రాజులను అవమానిస్తున్న మీ పాపానికి నిష్కృతి లేదు. ప్లేగు వ్యాధి మృతుల స్మృత్యర్థం కుతుబ్‌షాహీల కాలంలో నిర్మించిన హైదరాబాద్‌ఐకాన్‌, చార్మినార్‌కు మలినాన్ని ఆపాదిస్తూ తెలంగాణ ప్రజల, హైదరాబాద్‌ప్రేమికుల, మనోభావాల్ని దారుణంగా గాయపరుస్తున్న మీ సంకుచితత్వం తెలంగాణకు హానికరం, అవమానకరం.
  • సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి కోసం ఉద్దేశించిన స్థలంలో మీ పార్టీ పెద్దల విగ్రహాలను పెట్టే ప్రయత్నం ద్వారా కూడా మీరు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్నారు.
  • ఇక మీరు నన్ను దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించిన తీరు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ పెట్టి, 15 సంవత్సారాల పాటు ప్రజా పోరాటాన్ని నడిపించాను. తెలంగాణ డిమాండుకు మద్దతుగా రాష్ట్రం లోని, దేశం లోని పార్టీల మద్దతు కూడగట్టి, స్వరాష్ట్ర సాధన కోసం కేంద్ర మంత్రి పదవినీ, ఎం పీ పదవినీ తృణప్రాయంగా వదిలివేసి, చివరికి ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఉద్యమాన్ని విజయ తీరం చేర్చిన నావంటి వాడిని మీరు ఆహ్వానించిన తీరు ఎంతో అవమానకరంగా ఉంది.
  • తెలంగాణ ప్రజా పోరాటానికి నాయకత్వ స్థానంలో నిలిచిన నాకు, వేదికపై స్థానం గానీ, రాష్ట్ర సాధనలో నాకున్న అనుభవాలు పంచుకోవడానికి ప్రసంగించే అవకాశం కాని కల్పించక పోవడం మీ అహంకార ఆధిపత్య ధోరణికి పరాకాష్ట . నన్ను ఆహ్వానించినట్టే ఆహ్వానించి, అవమాన పరచదలుచుకున్నమీ దురుద్దేశ్యాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. పోరాట వారసత్వాన్ని దెబ్బతీయడానికి మీరు చేస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉత్సవాలు జరగుతున్న తీరును ఉద్యమకారులు ఇప్పటికే నిరసిస్తున్నారు. రానున్న కష్టాలను తలచుకుని తెలంగాణ తల్లి తల్లడిల్లుతున్నది . ప్రతి క్షణం తెలంగాణ గుండె గాయపడుతున్నది.
  • ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాలలో కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదని బిఆర్ఎస్ పార్టీతో సహా ఉద్యమకారులు, తెలంగాణ వాదుల అభిప్రాయంగా వుంది. అందువల్ల... పైన పేర్కొన్న కారణాల రీత్యా, ప్రజాజీవితాన్ని క్రమ క్రమంగా కల్లోలంలోకి నెట్టుతున్న మీ పాలననూ.. మిమ్మల్ని ప్రశ్నించేవాళ్లను అడుగడుగునా అవమానిస్తూ దాడులు చేస్తున్న మీ వైఖరినీ, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్న మీ వికృత పోకడలనూ నిరసిస్తూ.. మీరు నిర్వహించే దశాబ్ది ఉత్సవాలలో బి ఆర్‌ఎస్‌ పార్టీ పాల్గొనబోవటం లేదని తెలియ జేయటానికి విచారిస్తున్నాను.
  • ఇక ముందైనా ఇటువంటి వైఖరి మానుకొని నిజమైన ప్రగతి కోసం సంక్షేమం కోసం మీరు ప్రయత్నిస్తారనీ , ఎన్నికల వాగ్దానాలన్నీ త్వరలోనే నెరవేరుస్తారనీ ప్రజల మన్ననలు పొందుతారని ఆశిస్తున్నాను"అని కేసీఆర్ సుదీర్ఘమైన లేఖను రాశారు.

తదుపరి వ్యాసం