BRS Chief KCR : నో డౌట్.. 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తున్నాం - గజ్వేల్ కార్యకర్తల సమావేశంలో కేసీఆర్
20 October 2023, 18:14 IST
- KCR Meets Gajwel Leaders : కావాల్సింది మిగిలే ఉంది...జరగాల్సింది చాలా ఉందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. గజ్వేల్ పార్టీ నేతలతో సమావేశమైన ఆయన... సాధించిన దానికే సంతృప్తి చెంది నిమ్మలపడొద్దని దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అభివృద్ధి ఆగవద్దంటే మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తేనే సాధ్యమన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
KCR Meets Gajwel leaders: వచ్చే ఎన్నికల్లో 95 నుండి 105 స్థానాల్లో గెలువబోతున్నామన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పారు. శుక్రవారం గజ్వేల్ సమావేశమైన కేసీఆర్... గజ్వేల్ ను మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నోకష్టాలకోర్చి త్యాగాలు చేస్తూ సాధించుకున్న ప్రగతి ప్రస్థానం కీలకదశకు చేరుకున్నదని... రాష్ట్రంలో కొనసాగుతున్న సంక్షేమం అభివృద్ధి ఆగిపోవద్దంటే మళ్లీ బీఆర్ఎస్ గెలువాలని అన్నారు. ఈ దిశగా ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులై బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలని కేసీఆర్ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
శుక్రవారం శామీర్ పేట్ సమీపంలోని ప్రవేట్ ఫంక్షన్ హాల్ లో గజ్వేల్ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... 24 ఏండ్ల క్రితం తాను ఒక్కడినే బయల్దేరి ఉద్యమంలోకి వెళ్ళానని, ఆనాడు నిస్పృహ, నిస్సహాయత ఉండేదని.. ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉండేదని వెల్లడించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి జాడలు లేక, ఎక్కడ చూసినా చిమ్మని చీకటి, ఎవరిని కదిలించినా మనోవేదనే ఉండేదన్నారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలోని మెదక్ జిల్లా తెలంగాణ పరిస్థితులను సిఎం గుర్తుకుచేసుకున్నారు.
ఉమ్మడి పాలనలో మంజీరా నది ఎండిపోయి 800 ఫీట్ల లోతుకు బోర్ వేసిన నీళ్లు రాకపోయేవని, అప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతే ఒక్కో బాయికి రూ. 2 వేలు, మూడు వేలు వేసుకొని బాగుచేయించే పరిస్థితి ఉండేదని చెప్పారు కేసీఆర్. కరెంటు బిల్లులు పెంచం అని చెప్పి ఆనాడు చంద్రబాబు మోసం చేశారని అన్నారు. ఇక లాభం లేదని చూస్తూ చూస్తూ ఊరుకునేది లేదని తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టానని కేసీఆర్ గారు గుర్తు చేశారు. కొంతమంది తో కలిసి ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి పోరాడి చివరకు తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. తెచ్చుకున్న తెలంగాణను ఎన్ని అడ్డంకులు సృష్టించినా పట్టుదలతో అభివృద్ధి చేసుకున్నామన్న ముఖ్యమంత్రి..., సాధించిన దానికే సంతృప్తిని చెంది ఆగిపోవద్దన్నారు. శ్రేష్టత కోసం తపన పడడం అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగిన నాడే గుణాత్మక జీవన విధానం ప్రజలకు అందించగలమని సిఎం తెలిపారు. ఈ పదేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో మనందరం గమనించాల్సింది అదేనని సిఎం వివరించారు.
గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి చాలా జరిగిందని, ఇంకా కావాల్సింది చాలా ఉందని, లీడర్లు జరిగిన అభివృద్ధి చాలు అని ఉరుకోవద్దని, ఇంకా తమ కృషి కొనసాగించాలని సీఎం అన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు సిద్దిపేట లో భయంకరమైన కరువు ఉండేదని, అప్పుడు ఆలోచన చేసి మిడ్ మానేరు నుండి ఎత్తైన గుట్టపైకి నీళ్లు సప్లై చేసి ఇంటింటికి నీళ్లు ఇచ్చామన్నారు. ఇదే స్ఫూర్తిగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తున్నామని వెల్లడించారు.
ఆనాడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఖాళీ బిందెలతో ప్రదర్శనలు ఉండే, ఇప్పుడు ఎక్కడా అలాంటి పరిస్థితి లేదని కేసీఆర్ స్పష్టం చేవారు. తెలంగాణ వచ్చిన రోజున బతుకు దెరువు కోసం వలసలు వెళ్లి చెట్టుకు ఒక్కరూ గుట్టకు ఒక్కరు అయ్యామన్నారు. మహబూబ్ నగర్ తోపాటు మెదక్ జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. కానీ నేడు వలసలు మాయమై మన రాష్ట్రానికే వలసలు వచ్చే పరిస్థితి వచ్చిందని సిఎం అన్నారు.రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ ద్వారా ఇది సాధ్యమైందన్నారు. అద్భుతమైన వ్యవసాయ రంగం పురోగమించిందన్నారు. ఎంతో మంది ఆర్థిక, వ్యవసాయ రంగం నిపుణులతో మాట్లాడి అనేక సంస్కరణలు చేపట్టి పథకాలు అందుబాటులోకి తేవడంతో వ్యవసాయ స్థిరీకరణ జరిగిందని వెల్లడించారు. , అన్నపూర్ణ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సిఎం సంతోషం వ్యక్తం చేశారు.
గజ్వేల్ కు ఇంకా చేయాల్సిది ఉంది - కేసీఆర్
గజ్వేల్ బిడ్డలు తనను కడుపులో పెట్టుకొని రెండు సార్లు గెలిపించారన్నారు. అవకాశమిచ్చాక అభివృద్ధి చేశానని , గజ్వెల్ కు ఇంకా చేయాల్సి ఉందన్నారు. నోట్ల రద్దు దాంతో పాటు కరోనా ఈ రెండింటి వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగించి అనుకున్నంత చేసుకోలేకపోయామని, ఆర్థిక ఇబ్బందులు రావడంతో రాష్ట్రంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదించాయని సిఎం అన్నారు. భూములు పోయిన భాధ చాలా పెద్దదని కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కింద భూములు కోల్పోయిన రైతులకు చేతులెక్కి మొక్కుతానని సిఎం అన్నారు. వారందరికీ తెలంగాణ యావత్ రైతాంగం రుణపడి ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని, ఎన్నికల తరువాత నెలకు ఒకరోజు మొత్తం గజ్వేల్ నియోజకవర్గం ప్రజలతో గడుపుతానని స్పష్టం చేశారు.
ఇండియా లోని అన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు తగ్గిపోతే తెలంగాణ లో మాత్రం భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ తోనే సాధ్యమైందని వెల్లడించారు. మొదటి దశలో ప్రాజెక్టు కట్టుకున్నాం. కాంగ్రెస్ వాళ్లు, మరికొందరు వీటిని అడ్డుకున్నారని విమర్శించారు. రెండో దశలో మరింత అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని రెండో దశలో ప్రతి గ్రామానికి నీళ్లు ఇచ్చుకుందామని అన్నారు. గజ్వెల్ లో 65 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టు లు నిర్మాణం చేసుకున్నామని, ఉజ్వల భవిష్యత్తుకు ఈ ప్రాజెక్టులు ఎంతగానో ఉపకరిస్తాయని అన్నారు. గజ్వెల్ లో మనం గెలువడం కాకుండా పక్కన ఉన్న 3 నియోజకవర్గాలను భారీ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. అభివృద్ధి అగవద్దు అంటే మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలనే అవగాహన ప్రజల్లో వుందని.. ప్రజల ఆశీర్వాదంతో బిఆర్ఎస్ గెలుస్తుందని సీఎం అని సిఎం కేసీఆర్ అన్నారు.