Yadamma Recipes : ప్రధాని మోదీకి కరీంనగర్ సర్వపిండి, పచ్చిపులుసు.. అట్లుంటది యాదమ్మ చేతి వంట
30 June 2022, 15:53 IST
- దేశ ప్రధానికి వండిపెట్టాలి అంటే.. కనీసం ఫైవ్ స్టార్ హోటల్ కు తగ్గకుండా ఉంటుంది అనుకుంటున్నారా? అదేం కాదు.. ఓ సామాన్యురాలి వంటల రుచిని చూడనున్నారు ప్రధాని మోదీ.
ప్రతీకాత్మక చిత్రం
దేశ ప్రధానికి వడ్డించాలంటే.. ఎంతో అనుభవంతోపాటు.. స్టార్ హోటల్స్ లో పనిచేస్తూ ఉండాలి. ఇంతేకదా మీరు అనుకునేది. కాని ఓ సామాన్యురాలు చేసే వంటలను మోదీ రుచి చూడనున్నారు. హైదరాబాద్‌లో త్వరలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ప్రధానితోపాటు బీజేపీ ముఖ్య నేతలందరూ హాజరవుతారు. అయితే ఈ కార్యక్రమంలో కరీంనగర్ వంటకాలు రుచి చూపించేలా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏర్పాట్లు చేశారు. కరీంనగర్‌కు చెందిన యాదమ్మతో వంటలు చేయిస్తున్నారు. నోవాటెల్, హెచ్‌ఐసీసీతోపాటు నగరంలోని ప్రముఖ మాస్టర్ షెఫ్‌లను పిలిపించుకుని వారికి యాదమ్మతో వంటకాలపై అవగాహన కల్పిస్తున్నారు.
జులై 2, 3 తేదీల్లో జరిగే సమావేశాల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతోపాటుగా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరవుతారు. ఈ సమావేశాలను తెలంగాణ బీజేపీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తెలంగాణ సంప్రదాయ రుచులు రుచి చూపించాలనుకున్నారు. తెలంగాణ స్పెషల్ వంటకాలను ఏరికోరి మెనూలో పెట్టారు. ఇందుకోసం కరీంనగర్ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను అనే మహిళకు పనులు అప్పజెప్పారు.
ఇక మోదీకి యాదమ్మ.. వండిపెడుతుందన్న విషయం బయటకు తెలియగానే.. హూ ఈజ్ యాదమ్మ, వెరీజ్ యాదమ్మ అంటూ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె పేరు ఇంటర్నేట్ లో మారుమోగిపోతంది. ఎక్కడో కరీంనగర్లో వంటలు చేస్తూ ఉండే.. ఆమెకు దేశ ప్రధానికి వండి పెట్టే అవకాశం ఎలా వచ్చిందని సెర్చ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి గ్రామానికి చెందిన యాదమ్మకు 15వ ఏటనే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. మెట్టినింటికి చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుని.. 29 ఏళ్లుగా వంట వృత్తే చేస్తోంది.
తెలంగాణ వంటకాలు అంటే.. ముక్క లేకుండా ఉండదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే యాదమ్మ మాత్రం.. మాంసంతోపాటుగా.. శాకాహార వంటలు కూడా సూపర్ గా చేస్తోంది. తింటే మాత్రం.. మళ్లీ కావాలంటారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో శాకాహార వంటకాలు చేయించాలనే నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ లోకల్ కావడంతో.. వెంటనే యాదమ్మ పేరు గుర్తొచ్చింది. ఆమెతోనే చేయించేందుకు ఫిక్స్ అయ్యారు. ఒకేసారి వేల మందికి కూడా వంట చేసే సామర్థ్యం యాదమ్మకు ఉంది. ఇప్పుడేకాదు.. అంతకుముందు కూడా.. ఆమె పెద్ద పెద్ద సభలకు వంటలు చేసింది. మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ పాల్గొనే కార్యక్రమాల్లోనూ యాదమ్మే వంటలు చేసేది.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రత్యేకమైన శాఖాహార వంటకాలు పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం, బగార రైస్, గుత్తి వంకాయ, పచ్చిపులుసు, గంగవాయిలి కూర పప్పు, సాంబారు మొదలైన వంటకాలు లాంటి చాలా వెరైటీలు ఉండనున్నాయి. పప్పు గారెలు, సకినాలు, అరిసెలు, పాయసం, సర్వపిండి, భక్షాలు కూడా తయారు చేస్తున్నారు. దేశ ప్రధానికి వండిపెట్టే అవకాశం రావడంతో యాదమ్మకు ఆనందానికి అవధుల్లేవు. మోదీ సారు తన వంట తింటే అంతకంటే భాగ్యం ఏముంటుంది.. అని యాదమ్మ సంబరపడిపోతోంది.