Karimnagar TTD Temple : కరీంనగర్ లో కొలువుదీరనున్న తిరుమలేశుడు, టీటీడీ ఆలయానికి శంకుస్థాపన
31 May 2023, 12:10 IST
- Karimnagar TTD Temple : కరీంనగర్ లో శ్రీ వేంకటేశ్వరుని ఆలయం నిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కరీంనగర్ లో టీటీడీ ఆలయానికి శంకుస్థాపన
Karimnagar TTD Temple : కరీంనగర్ పట్టణం గోవింద నామస్మరణలతో మార్మోగుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయ నిర్మాణానికి అంగరంగ వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో విశేషమైన పూజా కార్యక్రమాలు బుధవారం ఉదయం నుండే ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటల 20 నిమిషాలకు శంకుస్థాపన కార్యక్రమంలో విశేష పూజల్ని టీటీడీ వేద పండితులు నిర్వహించారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని కరీంనగర్ లో అత్యంత వైభవంగా శంకుస్థాపన చేశామన్నారు మంత్రి గంగుల కమలాకర్. పద్మనగర్ ప్రాంగణంలో తిరుమల తిరుపతి వేదపండితులచే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ దీవకొండ దామోదర్ రావు, ఎమ్మెల్యేలు రసమయి, సుంకే రవిశంకర్ ఎమ్మెల్సీలు విప్లు భాను ప్రసాద్, కౌశిక్ రెడ్డి, టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ భాస్కర్ రావు తదితర ప్రముఖుల, భక్తుల సమక్షంలో శంకుస్థాపన నిర్వహించారు. బుధవారం ఉదయం విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచన, అగ్ని ప్రణయం, కుంభారాధన, విశేష హోమాలు, ఫిలేష్టికలకు, శంఖువుకు, అభిషేకం అనంతరం వేదమంత్రాలతో శంకుస్థాపన నిర్వహించారు.
ఇద్దరు ముఖ్యమంత్రుల సహకారంతో
ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుని కృపతోనే కరీంనగర్ లో టీటీడీ ఆలయ నిర్మాణం సాకారం అయిందన్నారు. ఆలయ స్థలంలో ఆ దేవదేవుడే కోనేరు లాంటి పురాతన బావిని తనకిష్టమైన చింత చెట్టును ఏర్పాటు చేసుకోవడమే ఈ వైభవానికి నిదర్శనం అన్నారు. కరీంనగర్ ప్రజా ప్రతినిధులు ఆలయ అనుమతి కోసం ప్రతిపాదన చేసిన వెంటనే సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ప్రత్యేకంగా లేఖ రాశారని తెలిపారు. కరీంనగర్ లో పదెకరాల స్థలాన్ని కేటాయించారన్నారు. ఏపీ సీఎం ఆమోదంతో టీటీడీ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరగడం చాలా సంతోషకరమన్నారు. టీటీడీ రూ.20 కోట్ల నిధులతో ఆలయాన్ని నిర్మిస్తుందని మిగతా నిర్మాణ నిధులను భక్తులమే సమకూర్చుకుంటామన్నారు. వెయ్యేళ్ల కాలంలో దొరికే ఈ గొప్ప కార్యంలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతమన్నారు మంత్రి గంగుల. కరీంనగర్ ప్రజలందరికీ ఈ అదృష్టం దొరికినందుకు సంతోషం వ్యక్తం చేశారు. సాయంత్రం అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తామని భక్తులు హాజరవ్వాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు.
టీటీడీ తరఫున రూ.20 కోట్లు
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కరీంనగర్ ఆలయ నిర్మాణం కోసం మంత్రి గంగులతో పాటు వినోద్ కుమార్, భాస్కరరావు, దామోదర్ రావు అభ్యర్థించారన్నారు. సీఎం కేసీఆర్ విజ్ఞాపనతో సీఎం జగన్ నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చారన్నారు. టీటీడీ తరఫున రూ.20 కోట్ల నిధులను కేటాయించడంతోపాటు సంపూర్ణంగా తిరుమల మాదిరే క్రతువులు నిర్వహిస్తామని, తిరుమల వేద పండితులు నిరంతరం ఇక్కడే ఉంటారన్నారు. పోటు ద్వారా ప్రసాదాలను సైతం ఇక్కడే తయారు చేస్తామన్నారు. మంత్రి గంగుల కమలాకర్ స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ నిర్మాణంపై చూపిస్తున్న శ్రద్ధ సంతోషం కలిగిస్తుందన్నారు.