Mahashakti temple: ముగ్గురు అమ్మలు కొలువుదీరిన మహాశక్తి ఆలయం..వరలక్ష్మీ వ్రతాల కోసం ముస్తాబు
16 August 2024, 12:34 IST
- Mahashakti temple: కొలిచిన భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్న కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతానికి ముస్తాబయింది. మహాదుర్గా, మహాలక్ష్మి, మహా సరస్వతి అమ్మవార్ల మహిమాన్విత దివ్య క్షేత్రంగా గుర్తింపు పొందింది.
కరీంనగర్ మహాశక్తి ఆలయం
Mahashakti temple: శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతం వేడుకలకు ఆలయ ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో, పూల అలంకరణలతో దేవాలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ముగ్గురు అమ్మవార్లు భక్తుల పాలిట కొంగు బంగారంగా మారిన నేపథ్యంలో ఆలయంలో శ్రీ వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
శుక్రవారం రోజున శ్రీ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా దేవాలయంలో ప్రాతః కాలం 5 గంటలకు శ్రీ మహదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లకు అభిషేక పూజలు, సాయంత్రం 7 గంటలకు సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతం, కుంకుమ పూజలు నిర్వహించనున్నారు. శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి దివ్య ఆశీస్సులతో వేద పండితుల ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం వేడుకలు, ఇతర పూజ కార్యక్రమాలు జరగనున్నాయి. ముఖ్యంగా శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా జరుపుకోవడం ఆచారంగా వస్తుంది.
వరలక్ష్మీ వ్రతానికి రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు...
ఎంతో విశిష్టత కలిగిన శ్రావణ శుక్రవారం రోజున మహాశక్తి దేవాలయంలోని మహాలక్ష్మీ అమ్మవారనీ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా కొలిస్తే అనుగ్రహిస్తుందని మహిళా భక్తుల్లో ప్రగాఢ విశ్వాసం ఉంది. ఈ దేవాలయంలో ఒకే చోట శక్తివంతమైన ముగ్గురు అమ్మవార్లు కొలువై ఉండడంతో ఒడి బియ్యం అమ్మవార్లకు సమర్పించడానికి రాష్ట్రం నలుమూలల నుండి ఎంతో మంది మహిళలు ఇక్కడికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వేడుకలకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సుహాసినులు అందరూ ఇట్టి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవార్ల కరుణాకటక్షాలకు పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)