Karimnagar : హైడ్రా తరహాలో కరీంనగర్ లో కాడ్రా ఏర్పాటు, సీఎంను విజ్ఞప్తి చేస్తామంటున్న కాంగ్రెస్ నేతలు
25 August 2024, 22:45 IST
- Karimnagar : హైదరాబాద్ లో హైడ్రా కబ్జాదారులను హడలెత్తిస్తుంది. హైడ్రా తరహాలో కరీంనగర్ లో కాడ్రా ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలు కూల్చివేసి చెరువులను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులను కలిసి ఈ విషయంపై విజ్ఞప్తి చేయాలని కాంగ్రెస్ నేతలు సైతం సన్నాహాలు చేస్తున్నారు.
హైడ్రా లాగా కరీంనగర్ లో కాడ్రా ఏర్పాటు, సీఎంను విజ్ఞప్తి చేస్తామంటున్న కాంగ్రెస్
Karimnagar :హైడ్రా హైదరాబాద్ లో భూ కబ్జాదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. అక్రమంగా కబ్జా చేసిన భూముల్లో నిర్మాణాలను కూలగొడుతుంటే ఆక్రమణదారులు భయాందోళన చెందుతున్నారు. నిలువ నీడలేని నిరుపేదలు, ఆక్రమణలను వ్యతిరేకించే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో హైడ్రా మాదిరిగానే కరీంనగర్ లో కాడ్రా ఏర్పాటు చేసి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులను కలిసి కాడ్రా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
కరీంనగర్ శివారులో చెరువులు మాయం
కరీంనగర్ శివారులో పాతికేళ్ల క్రితం పదుల సంఖ్యలో చెరువులు కుంటలు ఉండేవి. ఎల్ఎండీ రిజర్వాయర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున జరిగాయి. రిజర్వాయర్లు అక్రమణకు గురయ్యాయి. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఏమాత్రం పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన గత పాలకులు, నాయకులే దగ్గరుండి ప్రభుత్వ భూముల కబ్జాలో ప్రధాన పోషించారనే విమర్శలు ఉన్నాయి. పేదల భూములను సైతం కబ్జా చేసి జలగల్లాగా పట్టిపీడించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న నేపథ్యంలో హైడ్రా లాగా కరీంనగర్లో ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నేతలతో పాటు ఆక్రమణలను వ్యతిరేకించే వారు కోరుతున్నారు.
కాడ్రా కోసం సీఎం ను కలుస్తా-వెలిచాల
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల సహకారంతో కరీంనగర్ లో ప్రభుత్వ ప్రైవేటు భూముల పరిరక్షణకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. కరీంనగర్ తోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో బీఆర్ఎస్ పాలనలో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ, పేదల భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు. హైదరాబాద్ లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా లాగా కరీంనగర్లో ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులను కోరుతామని స్పష్టం చేశారు.
కరీంనగర్, చుట్టుపక్కల గ్రామాల్లో గత పదేళ్ల కాలంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జా అయ్యాయని తెలిపారు. భూ కబ్జాదారులు, అక్రమ కట్టడాల నిర్మాణదారులు, ఇందుకు సహకరించిన ప్రజాప్రతినిధులు, అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చేలా చేస్తామని పేర్కొన్నారు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచన చేసే వారి ఆట కట్టిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలతో కరీంనగర్ సీపీ అభిషేక్ మోహంతి పేదల భూములను కబ్జా చేసిన కొంతమంది కార్పొరేటర్లు, నాయకులను అరెస్టు చేసి జైలుకు పంపించారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో సీపీ అభిషేక్ మోహంతి నిజాయితీగా పని చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని పేర్కొన్నారు.
పేదల న్యాయం కోసం
పేదలకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తామని వెలిచాల రాజేందర్ రావు తెలిపారు. హైడ్రా లాగా కరీంనగర్ లో కాడ్రా వ్యవస్థను వివిధ శాఖల అధికారులతో పాటు పోలీసు అధికారులతో కలిసి ఒక అథారిటీని ఏర్పాటు చేసేలా చూస్తామని చెప్పారు. ప్రభుత్వ భూములు కబ్జా చేయాలంటే అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టేలా చేస్తామని స్పష్టం చేశారు. కరీంనగర్ లో పేదల భూములను లాక్కున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని, పేదలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. చెరువులు, కుంటలు, కాలువల కబ్జాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని చెప్పారు. అక్రమ నిర్మాణాలు భూముల కబ్జాపై ఉక్కు పాదం మోపుతూ ఇకముందు కబ్జాలు కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని తెలిపారు. పేదలు ఎలాంటి ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని వెలిచాల రాజేందర్ రావు స్పష్టం చేశారు.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు