తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bandi Sanjay : కాంగ్రెస్ మోసాలకు కేరాఫ్ అడ్రస్, ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్ కుటుంబమే కారణం- బండి సంజయ్

Bandi Sanjay : కాంగ్రెస్ మోసాలకు కేరాఫ్ అడ్రస్, ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్ కుటుంబమే కారణం- బండి సంజయ్

HT Telugu Desk HT Telugu

06 April 2024, 19:07 IST

    • Bandi Sanjay : కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్ కుటుంబమే కారణమని ఆరోపించారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
బండి సంజయ్
బండి సంజయ్

బండి సంజయ్

Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీ(Congress) అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని, ఆ పార్టీది ‘ఆపన్న హస్తం కాదు..భస్మాసుర హస్తమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ‘పాంచ్ న్యాయ్’(Paanch Nyay) పేరుతో కాంగ్రెస్ సరికొత్త హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు. తెలంగాణను 10 ఏళ్ల పాటు పాలించిన కేసీఆర్, రాష్ట్రంలో రైతుల దుస్థితికి ప్రధాన కారణమని విమర్శించారు. 30 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ఏనాడూ సాయమందించని కేసీఆర్ సిగ్గు లేకుండా రైతులపట్ల ప్రేమను ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ మోసపూరిత పార్టీలేనని, రైతులు, నేతన్నల దుస్థితికి రెండు పార్టీలే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని నేతన్నల దుస్థితికి నిరసనగా వారిని ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్ తో ఈనెల 10న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సిరిసిల్లలో ‘దీక్ష’ చేస్తున్నట్లు ప్రకటించారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన బండి సంజయ్(Bandi Sanjay) కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. 2 సీట్లతో మొదలైన ప్రస్తానం మోదీ, నడ్డా నాయకత్వంలో 400 సీట్ల దిశగా పయనిస్తోందని తెలిపారు. 2 సీట్లతో ఏం సాధిస్తారని వెక్కిరించిన పార్టీలే బీజేపీ దెబ్బకు కాలగర్భంలో కలిశాయని చెప్పారు. కాంగ్రెస్ సింగిల్ డిజిట్ దిశగా పతనమవుతోందని తెలిపారు. నయీం ఆస్తులపై విచారణ జరపడంతోపాటు ఆస్తులను దోచుకున్న కేసీఆర్ కుటుంబంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్ సెంటిమెంట్ రెచ్చగొట్టి లబ్డిపొందాలని చూస్తుండు

పొలంబాటలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్(KCR) ఎండిపోయిన పంటలను పరిశీలించడం సంతోషకరమే అయినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డ రైతులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ మళ్లీ తన భాషను స్టార్ట్ చేసిండు.. తెలంగాణ ఇయాళ అథోగతి పాలుకావడానికి ఆ భాషే కారణమని ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి లబ్డి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు.. రైతులెందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. 10 ఏళ్ల పాలనలో 30 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతే ఏ ఒక్క రైతును ఆదుకో లేదన్నారు. 10 ఏళ్లలో 11 లక్షల మందికి పైగా రైతులు చచ్చిపోతే ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించలే... లక్ష రుణమాఫీ అమలు చేస్తానని చేయలే... కౌలు రైతులకు నయాపైసా సాయం చేయలే... వ్యవసాయ కూలీల ఉసే ఎత్తలేదని విమర్శించారు. ముగ్దుంపూర్ బోయినిపల్లిలో ఎండిపోయిన పంటలను చూసిన కేసిఆర్ పోయినసారి వడగండ్ల వానలతో రామడుగు మండలం లక్ష్మీపూర్ వచ్చి ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇస్తానని హామీ ఇచ్చి ఎందుకు మాట తప్పావని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే రైతులకు బేడీలు వేసి జైలుకు పంపించారని, వరి వేస్తే ఉరే గతి అని రైతుల బతుకులు బర్బాద్ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఫసల్ బీమా పథకం(Fasal Beema Scheme) పనికిరాదంటివి… మరి సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎందుకు అమలు చేయలేకపోయారని ప్రశ్నించారు. లక్ష రుణమాఫీ చేస్తానని మాట తప్పడంవల్ల రైతులను డిఫాల్టర్లుగా మార్చిన చరిత్ర కేసీఆర్ దేనని ఆరోపించారు.

ఆపన్న హస్తం కాదు.. భస్మాసుర హస్తం

కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం… అది ఆపన్న హస్తం కాదు.. భస్మాసుర హస్తమని బండి సంజయ్(Bandi Sanjay) విమర్శించారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేయకుండానే చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. ‘‘రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు 15 వేలిస్తాం... వ్యవసాయ కూలీలకు 12 వేలిస్తాం... వడ్లకు క్వింటాలుకు 5 వందల రూపాయల చొప్పున బోనస్ ఇస్తాం. తాలు, తరుగు, తేమతో పనిలేకుండా వడ్లన్నీ మేమే కొంటాం. సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొస్తాం.. రైతు కమిషన్ ను ఏర్పాటు చేస్తాం’’అని హామీలిచ్చారు కదా? ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఆసరా పెన్షన్ ను రూ.4 వేలకు పెంచుతామన్నారు. మహిళలకు నెలనెలా రూ.2వేల 500 ఇస్తామన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ (Farmers Loan Wavier)అమలు చేస్తామన్నారు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్నారు.. మరి వందరోజులు పూరైనా ఎందుకు వాటిని అమలు చేయలేదో సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు

ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్ కుటుంబమే కారణం

కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress BRS) రెండు పార్టీలు అవగాహనతో వెళుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. అందుకే బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకోదు... కాళేశ్వరం అక్రమాలపై కేసీఆర్ కుటుంబంపై కేసులు పెట్టదని విమర్శించారు. అందుకు ప్రతిఫలంగా 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని అసెంబ్లీలో బీఆర్ఎస్ నిలదీయదని తెలిపారు‌. రెండు పార్టీలు లోపల కుమ్కక్కై పైన డ్రామాలాడుతున్నాయని, ప్రజలు గమనించాలని కోరారు. వాళ్లకు చిత్తుశుద్ధి ఉంటే కాళేశ్వరంపై(Kaleshwaram Project) సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నయీం ఆస్తులను కేసీఆర్ కుటుంబం దోచుకుందని అందరికీ తెలుసు… దమ్ముంటే నయీం ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై సిట్ విచారణను కొనసాగించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్, మియాపూర్ భూముల కుంభకోణంపై విచారణ జరపాలన్నారు. వీటిపై విచారణ జరపకుండా ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ దోషులను వదిలేది లేదని చెబుతున్నా, కేసీఆర్ కుటుంబమే ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహరంలో ఉందన్నారు. మరి ఎందుకు వాళ్లను అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. నా ఫోన్ ను కూడా ట్యాపింగ్ చేశారని, అందుకే ఆనాడు నేను ఈ విషయాన్ని పదేపదే చెప్పినా ఎవరు పట్టించుకోలేదన్నారు. అంతర్గత విషయాలను, పార్టీ కోర్ కమిటీలో చర్చించిన విషయాలను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ లాంటి చిల్లర పార్టీ ఇంకోటి లేదని, అందుకే సీబీఐ విచారణ జరపాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. కేసీఆర్ కుటుంబం (KCR Family)ఫోన్ ట్యాపింగ్ తో రాజకీయ లబ్ది పొందాలనుకుంటే… ట్యాపింగ్ చేసిన అధికారులు దానిని ఆసరాగా చేసుకుని ట్యాపింగ్ ద్వారా బెదిరించి డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు వంటి దుర్మార్గులు మా పార్టీ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయడంతోపాటు కార్యకర్తలను రాచిరంపాన పెట్టారని తెలిపారు.

కాంగ్రెస్ కు ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించే దమ్ముందా?

కాంగ్రెస్ పార్టీ(Congress) ఇచ్చిన హామీలను అమలు చేయలేదు.. కానీ మళ్లీ ‘పాంచ్ న్యాయ్’ పేరుతో మేనిఫెస్టోను(Congress Manifesto) విడుదల చేసి మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందన్నారు బండి సంజయ్. జనజాతర సభ(Congress Jana Jatara) నిర్వహిస్తున్న కాంగ్రెస్ కు ప్రధాని అభ్యర్థిని ప్రకటించే దమ్ముందా? అని ప్రశ్నించారు. ఐఎన్డీఐఏ కూటమి కుక్కలు చింపిన విస్తరిలా మారిందని, నితీష్ కుమార్, మమతా బెనర్జీ వంటి వారంతా కూటమిని వీడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు నిజంగా దమ్ముంటే తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో ఇచ్చిన మేనిఫెస్టోలోని ఎన్ని హామీలను అమలు చేశారో చెప్పే దమ్ముందా? తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయలేకపోయారో... సమాధానం చెప్పాలి? వాటిని అమలు చేయలేకపోయినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తదుపరి వ్యాసం