తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rajasingh : బండి సంజయ్ వ్యక్తి కాదు శక్తి, గంగుల తప్పుకుంటే బెటర్ -రాజాసింగ్

Rajasingh : బండి సంజయ్ వ్యక్తి కాదు శక్తి, గంగుల తప్పుకుంటే బెటర్ -రాజాసింగ్

HT Telugu Desk HT Telugu

06 November 2023, 21:27 IST

google News
    • Rajasingh : బండి సంజయ్ వ్యక్తి కాదు ఓ శక్తి అని రాజాసింగ్ అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల ఓటమి భయంతో ఓటుకు రూ.20 వేలు ఆశచూపుతున్నారని ఆరోపించారు.
బండి సంజయ్, రాజాసింగ్
బండి సంజయ్, రాజాసింగ్

బండి సంజయ్, రాజాసింగ్

Rajasingh : ధర్మం కోసం, ప్రజల పక్షాన ఉంటూ నిరంతరం పోరాటం చేస్తున్న బండి సంజయ్ పక్షాన ఉంటారా లేక... అవినీతి, అక్రమాలతో వేల కోట్లు సంపాదించి ఓటుకు ఇరవై వేలు పంచేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ అభ్యర్థి పక్షాన ఉంటారో? తేల్చుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. బండి సంజయ్ వ్యక్తి కాదని, ఓ శక్తి అని అభివర్ణించారు. అంతటి శక్తితో దున్నపోతులు పోటీ పడలేవన్నారు. బండి సంజయ్ నామినేషన్ సందర్భంగా సోమవారం ఎన్టీఆర్ చౌరస్తా నుంచి వేలాది మంది యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా బండి సంజయ్ తో కలిసి రాజాసింగ్ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.

గంగుల తప్పుకుంటే బెటర్

కరీంనగర్ లో పెద్దన్న బండి సంజయ్ నామినేషన్ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఇక్కడి నుంచి ఎంపీగా చేసి పార్లమెంట్ కు పంపిన ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ను గద్దె దించేందుకు బండి సంజయ్ కంకణం కట్టుకుని 15 వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశారన్నారు. స్థానిక బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ కు ఏది చేతకాదన్నారు. బండి సంజయన్న పోటీ చేస్తున్నారని తెలియగానే దారుస్సలాం పోయి సలాం చేశారని, బండి నామినేషన్ రోజునే గంగుల కమలాకర్ ఓటమి ఖాయమైందన్నారు. ఇప్పటికైనా కరీంనగర్ నియోజకవర్గం నుంచి గంగుల తప్పుకోవాలని హితవు పలికారు. గంగుల అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతోందని, గుడి, బడి, గ్రానైట్ సహా ఎందులో చూసినా అవినీతే ఉందన్నారు.

బండి సంజయ్ వ్యక్తి కాదని, ఓ శక్తి అని ఆ శక్తిమీద పోటీ చేయాలంటే మీలాంటి దున్నపోతుల వల్లే కాదని రాజాసింగ్ అన్నారు. డబ్బు ఆశచూపుతారని, డబ్బు ముఖ్యమా? ధర్మం ముఖ్యమా? ఆలోచించాలని ప్రజలను దండం పెట్టి వేడుకుంటున్నానన్నారు. ధర్మం వైపు నిలబడ్డ బండి సంజయ్ ని గెలిపించాలని ప్రజలను కోరారు. ఓటుకు 20 వేలు ఇచ్చేందుకు గంగుల సిద్ధమయ్యారని, 5 ఏళ్లు ఆ డబ్బులతో బతకలేరనే విషయాన్ని ఆలోచించాలన్నారు. తెలంగాణ అసెంబ్లీకి బండి సంజయ్ ని తీసుకువెళ్లేందుకు నేను సిద్దంగా ఉన్నానన్నారు. కరీంనగర్ లో ఎంఐఎం అభ్యర్థిని పోటీ చేయించే దమ్ము నీకుందా ఓవైసీ అంటు నిప్పులు చెరిగారు. ఓవైసీకి చేతగాకనే ఇంకో పార్టీకి మద్దతిస్తున్నారని మండిపడ్డారు. ట్రిపుల్ తలాఖ్ తెచ్చి ముస్లిం మహిళలు గర్వపడేలా చేసింది బీజేపీ పార్టీయేనని మైనార్టీలు ఆలోచించాలన్నారు.

నామినేషన్ దాఖలు చేసిన బండిసంజయ్

ధర్మరక్షణ కోసం చివరి శ్వాస దాకా పోరాడుతూనే ఉంటానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీలా, ఝాన్సీ లక్ష్మీబాయిలా కదిలివచ్చి బీజేపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కరీంనగర్ లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిర్వహించిన బైక్ ర్యాలీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, ధర్మపురి అసెంబ్లీ అభ్యర్ధి ఎస్.కుమార్, చీకోటి ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురితో కలిసి బండి సంజయ్ పాల్గొన్నారు. మొదటగా మహశక్తి ఆలయంలో ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం తల్లి దీవెనలు తీసుకుని బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. భారీ ర్యాలీ మధ్య కలెక్టరేట్ కు చేరుకుని బీజేపీ అభ్యర్థిగా తన నామినేషన్ ను పూర్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...ఈ రోజు కరీంనగర్ మొత్తం కాషాయమైందని...దేశం కోసం ధర్మం కోసం అందరం కలిసి కట్టుగా కాషాయ జెండా ఎగరవేయాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా తిరిగానని. హిందూ ఓట్ బ్యాంకును ఏకం చేసి అన్ని ఎన్నికల్లో బీజేపీకి విజయపరంపర కొనసాగించామని ఆనందం వ్యక్తం చేశారు.

రిపోర్టింగ్ : గోపీకృష్ణ, కరీంనగర్

తదుపరి వ్యాసం