Monkey Pox : కామారెడ్డిలో కలకలం.. వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు
24 July 2022, 21:07 IST
- Monkey Pox In India : దేశంలో మంకీపాక్స్ కలకలం రేపుతోంది. అయితే తాజాగా తెలంగాణలో ఓ వ్యక్తికి లక్షణాలను గుర్తించారు. అతడి శాంపిల్స్ తీసుకుని.. పరీక్షల కోసం పంపారు.
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో మంకీపాక్స్ కలకలం రేపుతోంది. కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు గుర్తించారు. అతడి శాంపిల్స్ సేకరించి నిర్థారణ పరీక్షలకు పంపినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 6న కువైట్ నుంచి కామారెడ్డికి ఓ వ్యక్తి వచ్చాడు. అయితే అతడిలో మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అతడికి జ్వరం, శరీరంపై దద్దుర్లతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమానిత వ్యక్తిని హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు దేశంలో మొత్తం మంకీపాక్స్‌ల కేసుల సంఖ్య 4కు చేరింది. ఢిల్లీలో మొదటి మంకీపాక్స్ కేసు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ధారించింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తి ప్రస్తుతం మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. ఆ వ్యక్తి వయసు 31 ఏళ్లు కాగా.. అతడికి ఎటువంటి విదేశీ ట్రావెల్ హిస్టరీ లేదని ఆరోగ్యశాఖ తెలిపింది. బాధితుడు జ్వరం, చర్మ గాయాలతో బాధపడుతున్నాడని... చికిత్స కొనసాగుతోందని పేర్కొంది.
కేరళలో ఇప్పటికే 3 మాంకీపాక్స్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. మూడో కేసు జూలై 22న యూఏఈ నుంచి కేరళకు వచ్చిన 35 ఏళ్ల వ్యక్తి వ్యాధి నిర్ధారణ అయింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలను కూడా కేరళ సర్కార్ విడుదల చేసింది. బాధితులకు ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తోంది.
Telangana Govt Alert On Monkeypox Cases: దేశంలోకి మంకీపాక్స్ కేసు నమోదు కావటంతో తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. వ్యాధి వ్యాప్తిని నివారించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ఆయన వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను అన్ని జిల్లాల వైద్యాధికారులకు పంపారు.
మార్గదర్శకాల్లో పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా వ్యాధి లక్షణాలను వివరించారు. శరీరంపై దద్దుర్లు రావడం మంకీపాక్స్ ప్రధాన లక్షణమని పేర్కొన్నారు. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం, చలి వంటి తదితర లక్షణాలున్న వారి నుంచి నమూనాలను సేకరించాల్సి ఉంటుందని వెల్లడించారు. మంకీపాక్స్ అనుమానిత నమూనాలను పరీక్షించడానికి దేశం మొత్తమ్మీద 15 ప్రయోగశాలలకు అనుమతివ్వగా.. రాష్ట్రంలో గాంధీలోని ప్రయోగశాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. మరో రెండు రోజుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించున్నారు.
మంకీపాక్స్‌పై ఏవైనా అనుమానాలుంటే 90302 27324 నంబరుకు వాట్సప్ ద్వారా సమాచారాన్ని పంపించవచ్చు. నేరుగా కాల్ చేయాలనుకుంటే 040 24651119 నంబరుకు ఫోన్ చేయాలని వైద్యారోగ్యశాఖ స్పష్టం చేసింది.