Mla KV Ramana Reddy : రోడ్డు విస్తరణ కోసం సొంత ఇంటినే కూల్చివేయించిన కామారెడ్డి ఎమ్మెల్యే
27 January 2024, 21:14 IST
- Mla KV Ramana Reddy : కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ రమణారెడ్డి రోడ్డు వెడల్పు కోసం తన సొంత ఇంటిని కూల్చివేస్తున్నారు. రోడ్డు విస్తరణ పనులు ముందు తన ఇంటితో ప్రారంభించానన్న ఎమ్మెల్యే... స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు.
కామారెడ్డి ఎమ్మెల్యే ఇల్లు కూల్చివేత
Mla KV Ramana Reddy : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. కామారెడ్డి పట్టణంలో రోడ్డు వెడల్పు కోసం ఏకంగా తన సొంత ఇంటిని కూల్చివేస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో శనివారం ఉదయం ఇంటిని కూల్చి వేశారు. అయితే ఇప్పుడు పట్టణ ప్రజల దృష్టి కాంగ్రెస్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీపై పడింది. ఈ రోడ్డులోనే ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇల్లు ఉంది. దీనిపై షబ్బీర్ అలీ స్పందన ఎలా ఉంటుందోనని కామారెడ్డి పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత ఏడాది జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్లలో చెప్పినట్టుగానే రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చేసి బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి మాట నిలబెట్టుకున్నారు. రోడ్డు పక్కన ఉన్న ఇంటి యజమానులు రోడ్డు వెడల్పు కోసం ఇండ్లను కూల్చేందుకు సహకరించాలని కోరారు.
వారం రోజుల్లో స్వచ్ఛందంగా తొలగించండి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేటు వరకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. ప్రస్తుతం 30 ఫీట్లు రోడ్డు మాత్రమే ఉంది. రోడ్డు వెడల్పు చేయడానికి వీలు లేకుండా అనేక మంది తమ నివాస గృహాలు నిర్మించుకున్నారు. ఇళ్ల ముందు కుళాయి గుంతలు, షెడ్డులు ఏర్పాటు చేసుకున్నారు. రోడ్డు వెడల్పు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు వెడల్పు కోసం ఇండ్లను తొలగించడం తన ఇంటినుంచే మొదలు పెట్టాలని అడ్డుగా ఉన్న తన ఇంటిని కూల్చేసి ఆ స్థలాన్ని అధికారులకు అప్పగించారు. శనివారం ఉదయం ఆర్ అండ్ బి, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు ఆధ్వర్యంలో జేసీబీలతో దగ్గరుండి ఇంటిని కూల్చేయించారు. అదే రోడ్డులో పంచముఖి హనుమాన్ ఆలయం కూడా ఉండటంతో అలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, వారం రోజుల్లో రోడ్డుపై ఉన్న కుళాయి గుంతలు, షెడ్డులు ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు. నెల రోజుల్లో ఇప్పుడున్న రోడ్డుకు అదనంగా మరొక 24 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు.
రిపోర్టింగ్ : ఎన్.భాస్కర్, కామారెడ్డి