Kamareddy News : సేవలాల్ జయంతి వేడుకల్లో రసాభాస, వెనుదిరిగిన మాజీ స్పీకర్ పోచారం
28 February 2024, 18:06 IST
- Kamareddy News : బాన్సువాడలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుక రసాభాసగా జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వాగ్వాదంతో సభ నుంచి మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వెళ్లిపోయారు.
సేవలాల్ జయంతి వేడుకల్లో రసాభాస
Kamareddy News : గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి (Sevalal Maharaj Jayanti)వేడుక సభలో రసాభాస నెలకొంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బంజారా భవనంలో గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య రభస పెరగడంతో మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి సభ నుంచి వెనుదిరిగారు. పార్టీలకు అతీతంగా సంత సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు నియోజకవర్గస్థాయి బంజారా నాయకులను వివిధ పార్టీల నాయకులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Mla Pocharam Srinivas Reddy), కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
ఈ సభలో ఇరు పార్టలకు చెందిన కొందరు నేతలు వాగ్వివాదం పెట్టుకోవడంతో సభ రసభసగా సాగింది. దీనితో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభ వేదిక నుంచి వెళ్లిపోయారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు కొందరు మాట్లాడుతూ... మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంత్ సేవాలాల్ మహరాజ్ ను అవమానించారంటూ కొందరు ఆరోపించారు. అలాగే బీఆర్ఎస్(BRS) బంజారా నాయకులు మాట్లాడుతూ.... అన్ని నియోజకవర్గాల కన్నా బాన్సువాడ నియోజకవర్గంలో సంత సేవాలాల్ మహారాజ్ ఆలయ, మందిరాల నిర్మాణం కోసం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎంతో కృషి చేశారని బంజారాల అభివృద్ధికై ఆయన ఎంతో పాటు పడ్డారని అన్నారు. సంత్ సేవలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.