Kamareddy Crime : కామారెడ్డి జిల్లాలో దారుణ హత్య, రోడ్డు ప్రమాదంగా చిత్రించే యత్నం!
22 January 2024, 20:07 IST
- Kamareddy Crime : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండంలో ఓ వ్యక్తిని హత్య చేసిన దుండగులు... రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో వ్యక్తి హత్య
Kamareddy Crime : కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలంలో దారుణ హత్య కలకలం రేపింది. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు నమ్మించే ప్రయత్నం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... హంతకుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన ముదాం శంకర్ (42) అనే వ్యక్తి ఆదివారం రాత్రి హత్యకు గురయ్యాడు. హత్య చేసి సోలార్ ప్లాంట్ సమీపంలో మృతదేహాన్ని వదిలి వెళ్లారు. మృతదేహంపై బైకును పెట్టారు. పథకం ప్రకారమే దుండగులు శంకర్ ను బలమైన రాడుతో తలపై బాధి హత్య చేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రక్తపు మరకలను పసిగట్టి గమనిస్తూ వెళ్లగా బ్రహ్మాజీ వాడి శివారులోని సోమారం తండావాసి జత్య నాయక్ పొలంలో హత్య చేసి మృతదేహాన్ని రోడ్డుపై పడేసినట్లుగా గుర్తించారు. ముదాం శంకర్ భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి కుమార్తె రాధిక ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఇన్ ఛార్జ్ సీఐ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. శంకర్ ను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని తాడ్వాయి గ్రామస్థులు డిమాండ్ చేశారు. ముదాం శంకర్ మృదుస్వభావి అని, వివాదాలకు దూరంగా ఉండేవాడని గ్రామస్థులు చెబుతున్నారు.
రిపోర్టింగ్ : ఎమ్.భాస్కర్, కామారెడ్డి