Kamareddy Crime : కామారెడ్డి జిల్లాలో చోరీలు, అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
22 February 2024, 22:34 IST
- Kamareddy Crime : కామారెడ్డి జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఓ టైల్స్ షాపులో చోరీ చేసిన నిందితుడిని సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకున్నారు.
అంతర్ జిల్లా దొంగ అరెస్ట్
Kamareddy Crime : కామారెడ్డి జిల్లాలోని ఓ టైల్ షాప్ లో రూ.40,000 అపహరించిన అంతర్ జిల్లా నేరస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు. గత నెల 31న అందిన ఫిర్యాదు మేరకు రెండు టీములు ఏర్పాటు చేసి నేరస్థుని అరెస్ట్ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంతో సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన అందొల్ నవీన్ ( 28 )ను అదుపులోకి తీసుకొని జైలుకు పంపించినట్లు కామారెడ్డి ఎస్హెచ్ఓ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం నిందితుడు గత నెల 31న ఇంటర్నేషనల్ హోటల్ పక్కన ఉన్న మహాలక్ష్మి టైల్స్ షాపులో చొరబడి 40,000 నగదును దొంగలించాడు.
కొబ్బరి కొట్టులో చోరీ
సాంకేతిక పరిజ్ఞానంతో పాత నేరస్థులపై నిఘా పెట్టి ఈ కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. రెండు బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు... ఆ దొంగతనాన్ని అందోల్ నవీన్ చేసినట్టుగా గుర్తించి గురువారం అతనిని పట్టుకొని విచారణ చేసినట్టు తెలిపారు. పోలీసుల విచారణలో నిందితుడు... ఈ నేరంతో పాటుగా ములుగు జిల్లా మేడారం గ్రామంలో ఈనెల 16న ఒక కొబ్బరి కొట్టు దుకాణంలో దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నాడు. నేరస్థుని వద్ద నుంచి ఒక మోటార్ సైకిల్ , రూ. 1,96,000 నగదును స్వాధీనపరచుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ కేసులను కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది, సీసీఎస్ కామారెడ్డి సిబ్బంది కలిసి ఛేదించగా, వీరిని ఉన్నతాధికారులు అభినందించారు.
రిపోర్టింగ్ : ఎమ్. భాస్కర్, కామారెడ్డి