Kamareddy Crime : కామారెడ్డిలో విషాదం, అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
24 February 2024, 15:32 IST
- Kamareddy Crime : కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత పొలం వద్దే రైతు ఈ దారుణానికి పాల్పడ్డాడు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
Kamareddy Crime : అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.... మండల కేంద్రానికి చెందిన కుమ్మరి లక్ష్మీపతి (55) బుధవారం ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. బంధువులకు, తెలిసిన వారికి అడిగిన ఆచూకీ తెలియలేదు. దీంతో గ్రామంలో, గ్రామ పరిసర ప్రాంతంలో వెతుకుతున్న సమయంలో సొంత పొలం వద్ద చెట్టుకు నైలాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని కనిపించాడు. లక్ష్మీపతి భార్య లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై కొండ విజయ్ తెలిపారు. రైతు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యపై విచారణ జరిపించాలి
బాసర త్రిపుల్ ఐటీలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని పి.డి.ఎస్. యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో పీడీఎస్.యూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏ యూనివర్సిటీలో లేని ఆత్మహత్యలు ఒక్క త్రిపుల్ ఐటీలోనే ఎందుకు జరుగుతున్నాయని, ప్రతి విద్యా సంవత్సరం పదుల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ప్రతి ఆత్మహత్యను వ్యక్తిగత కారణాలను జోడించి చూపిస్తున్నారని, విద్యార్థులతో మాట్లాడనివ్వకుండా క్యాంపస్ లో విద్యార్థి సంఘాలను అనుమతించడం లేదని ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యల కారణాలు తెలుసుకోవడానికి గత సంవత్సరం స్వయాన రేవంత్ రెడ్డి గోడ దూకి లోపలికి పోయారని అన్నారు. ఆత్మహత్యలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.