Pallavi Prashanth : బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బిగ్ షాక్, కేసు నమోదు చేసిన పోలీసులు
18 December 2023, 18:20 IST
- Pallavi Prashanth : బిగ్ బాస్ 7 విన్నర్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు అయ్యింది. పోలీసులు హెచ్చరించినా పట్టించుకోకుండా ర్యాలీ నిర్వహించి, ఉద్రిక్త వాతావరణానికి కారణమైనందుకు ప్రశాంత్ పై కేసు నమోదు చేశారు.
పల్లవి ప్రశాంత్
Pallavi Prashanth : బిగ్‌బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. బిగ్ బాస్ 7 తెలుగు ఫైనల్ నేపథ్యంలో ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఘర్షణ తలెత్తింది. పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ రాత్రి 12 గంటల టైంలో అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వచ్చారు. ఆ సమయంలో అభిమానులు ప్రశాంత్ కు ఘన స్వాగతం పలికారు. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన అమర్ దీప్ కూడా బయటకు రావడంతో ఇరువురి ఫ్యాన్స్ మధ్య మరోసారి ఘర్షణ తలెత్తింది. దీంతో రెచ్చిపోయిన కొందరు అభిమానులు అమర్ దీప్, మరికొందరు బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లపై దాడికి దిగారు. ఈ దాడిలో అమర్ దీప్, అశ్వినీ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి.
ఆర్టీసీ బస్సులు, పోలీసుల వాహనాలపై దాడి
ఆ తర్వాత ఇంకా రెచ్చిపోయిన బిగ్ బాస్ అభిమానులు ఐదుకు పైగా ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. అక్కడ బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ కారు అద్దంతో పాటు పోలీస్ బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను అక్కడి నుంచి పంపించివేశారు. అనంతరం ఈ ఘటనలపై జూబ్లీహిల్స్ పోలీసులు నమోదుచేశారు. పరిస్థితులపై పోలీసులు హెచ్చరించినా పట్టించుకోకుండా ర్యాలీ నిర్వహించినందుకు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రశాంత్, అమర్ దీప్ అభిమానుల బీభత్సం
బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ లో యూట్యూబర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నారు. రన్నరప్‌గా సీరియల్ నటుడు అమర్ దీప్ నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆదివారం రాత్రి బిగ్ బాస్ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణా స్టూడియోస్‌కు వద్దకు అమర్, ప్రశాంత్ అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పల్లవి ప్రశాంత్ విజయం సాధించగానే అతడి అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్, అమర్ అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఈ గొడవలో అటుగా వెళ్తున్న పలు ఆర్టీసీ బస్సులపై దాడి చేసి, అద్దాన్ని పగలగొట్టారు.
అమర్ దీప్ కారుపై దాడి
ఆదివారం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగించుకొని బయటకు వస్తోన్న అమర్ దీప్‌పై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి తన ఫ్యామిలీతో అమర్దీప్ బయటకు వస్తోన్న క్రమంలో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అతడి కారును చుట్టుముట్టారు. కారు ముందుకు వెళ్లకుండా అడ్డుకోవడమే కాకుండా అద్దాలను పగలగొట్టారు. అమర్‌దీప్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. అమర్‌దీప్‌ను అసభ్య పదజాలంతో దూషించారు. అభిమానుల అత్యుత్సాహంతో అమర్దీప్ కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అమర్‌దీప్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులను అక్కడి నుంచి పంపించేశారు. బిగ్‌బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ కారుపై ఫ్యాన్స్ ఎటాక్ చేశారు. వెనుకవైపు అద్దాలను పగలగొట్టారు. ఆమెతో పాటు అశ్విని కారును కూడా ఫ్యాన్స్ డ్యామేజ్ చేశారు. అభిమానుల తీరు పట్ల ఆమె అసహనానికి లోనయ్యింది.