TPCC : కాంగ్రెస్ పార్టీలో చేరికలు.. కారు దిగే వారికి కార్పెట్ వేస్తున్నారా?
06 July 2022, 20:55 IST
- టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కాంగ్రెస్ పార్టీని వీలైనంత ఎక్కువగా తొక్కే ప్రయత్నం చేసింది. మళ్లీ రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు వచ్చాక.. పార్టీకి కాస్త వైభవం పెరుగుతూ వస్తోంది. కొన్ని రోజులుగా.. కొద్దికొద్దిగా పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో చేరికలు కూడా ఎక్కువగానే అవుతున్నాయి.
రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టడం కంటే ముందు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒకలా ఉంది. ఆయనకు చేతిలోకి వెళ్లాక.. ఇంకోలా మారింది. పార్టీ అంతర్గాత ప్రజాస్వామ్యంతో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. జనంలోకి కాంగ్రెస్ ను తీసుకెళ్లాలనే.. ఆలోచనలో ఉంది టీపీసీసీ. వరంగల్ లో రాహుల్ గాంధీ సభ ఊపుతో ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తొంది. మరోవైపు చేరికలపైనా.. దృష్టి పెట్టింది. ఈ మధ్యకాలంలో చేరికల పర్వం గట్టిగానే అయింది.
మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య కూడా రానురాను పెరుగుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేరుగానే చెబుతున్నారు. ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కాంగ్రెస్ పార్టీ.. వచ్చే వారికి కండువా కప్పుతొంది. ఇప్పటి వరకూ.. వచ్చిన వారిలో ఎక్కువ మంది కారు దిగినవారే. కాంగ్రెస్ లో చేరేవారి గురించి ముందే తెలుసుకుని.. టీఆర్ఎస్ కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపిస్తోంది టీపీసీసీ.
ఇటీవలే.. బడంగ్పేట్ టీఆర్ఎస్ మేయర్ పారిజాతతో సహా పలువురు టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బడంగపేట్ 20వ డివిజన్ కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డి, 23వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాస రెడ్డిలు హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఆ మధ్య ఖమ్మం జిల్లా నుంచి ఇద్దరు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దివంగత పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ లో అసమ్మతి నేతలతో రేవంత్ రెడ్డి టచ్ లో ఉన్నట్టుగా సమాచారం. ఈ మధ్య కాలంలోనే బెల్లంపల్లి ఏరియాలో కీలక నేత, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డితో మాట్లాడి కాంగ్రెస్ వైపు వచ్చారు. బయటకు రావాలని చూస్తున్న నేతలను ఆకర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరికలపై రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఓ వైపు.. టీఆర్ఎస్ పార్టీలో చాలా చోట్ల అంతర్గతంగా పోరు తీవ్రస్థాయిలో ఉంది. సుమారు 45 స్థానాల్లో టీఆర్‌ఎస్ బలమైన బహుళ నాయకత్వ సమస్య ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను ప్రభావంచూపే నేతలు ఉన్నారు. ఇద్దరు ముఖ్యనేతలు ఉన్న నియోజకవర్గాల్లో టికెట్ తమకే వస్తుందనే ఆశలో ఎవరికి వారే ఉన్నారు. దీంతో ఒకరికి టికెట్ వస్తే.. మరోకరితో టీఆర్ఎస్ పార్టీకి ఎంతోకొంత నష్టమే. కొన్ని నియోజగవర్గాల్లో సిట్టింగ్‌లకు మళ్లీ అవకాశం దొరకక పోవచ్చనే వార్తలతో ఆశావహులు ఇంకా పెరిగిపోతున్నారు. ఇలాంటి నేతలపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. వీరిలో కొంతమంది.. హస్తం చేయి పట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే వారి పేర్లను మాత్రం టీపీసీసీ అస్సలు బయటకు చెప్పట్లేదు
కాంగ్రెస్ కారణంగానే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని పదే పదే చెబుతున్నా.. దాన్ని క్యాష్ చేసుకోవడంలో హస్తం పార్టీ విఫలమవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆ పార్టీలో ఉండే అంతర్గత కలహాలే ఓ కారణంగా చెప్పవచ్చు. ప్రతి పార్టీలో అంతర్గత కలహాలు ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలు కలహాలను మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారు.
అయితే ఇవన్నీ పక్కనపెట్టి.. ఎన్నికల ముందు చేరికలతో పార్టీకి ఊపు తేవాలని రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా కనిపిస్తోంది. ఆ సమయంలో అయితే.. జనాల ఆలోచనల్లోనూ మార్పు వస్తుందని అనుకుంటున్నట్టు ఉన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలను చేపట్టిన తర్వాత కంటే.. నెల రోజుల నుంచి.. వరస చేరికలు జరుగుతున్నాయి. దీంతో రేవంత్ ప్రధానంగా చేరికలపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరికల తుపాను రాబోతోందని ప్రకటించారు. దీంతో అందరిలోనూ చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ లో అసమ్మతి, బీజేపీలో క్షేత్రస్థాయిలో సరైన ఓటు బ్యాంకు లేకపోవడంతో చాలా మంది నేతలు కాంగ్రెస్ వైపే చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
తాజాగా చేరికల మీద టీపీసీసీ సమావేశం నిర్వహించింది. ఇతర పార్టీల నుంచి నేతల చేరికలు, తెలంగాణలో రాహుల్ పర్యటన, పార్టీ బలోపేతంపై మాట్లాడారు. పార్టీలో సమస్యలను చర్చించి పరిష్కరించుకుంటామని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు ఉంటాయని రేవంత్ చెబుతున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన ఓ కీలక కామెంట్ చేశారు. చేరికలపై ముందే తెలిస్తే కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరిన వారికి టికెట్లు ఇస్తామని అప్పుడే హామీ ఇవ్వట్లేదని చెప్పారు. పార్టీ ప్రక్రియలో భాగంగా టికెట్లు కేటాయింపు ఉంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.