తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg New Dgp: తెలంగాణ డీజీపీగా జితేందర్, ముఖ్యమంత్రి అమోదంతో నేడు వెలువడనున్న ఉత్తర్వులు

TG New DGP: తెలంగాణ డీజీపీగా జితేందర్, ముఖ్యమంత్రి అమోదంతో నేడు వెలువడనున్న ఉత్తర్వులు

Sarath chandra.B HT Telugu

10 July 2024, 7:58 IST

google News
    • TG New DGP: తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్‌ నియామకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమోద ముద్ర వేశారు. డీజీపీ నియామక ఉత్తర్వులు నేడు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 
తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్
తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్

తెలంగాణ నూతన డీజీపీగా జితేందర్

TG New DGP: తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి డీజీపీపై ఈసీ వేటు వేసింది. ఎన్నికల ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడక ముందే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి డీజీపీ అంజనీ కుమార్‌ వెళ్లి పుష్పగుచ్చం ఇవ్వడం, శుభాకాంక్షలు చెప్పడంపై ఈసీ తీవ్రంగా పరిగణించింది. అది అధికార దుర్వినియోగమేనని భావించి ఆయనపై వేటు వేసింది. ఏపీ క్యాడర్‌కు కేటాయించిన అంజనీకుమార్ క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణలొ కొనసాగారు.

ఈసీ ఆదేశాలతో తెలంగాణడీజీపీగా రవిగుప్తాకు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఆయన్నే కొనసాగిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ పాలనపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి డీజీపీ నియామకంపై కసరత్తు చేశారు. చివరకు జితేందర్‌ వైపు మొగ్గు చూపారు.

బుధవారం జితేందర్‌ నియామక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. మంగళవారమే ఈ ఉత్త ర్వులు వెలువడాల్సి ఉన్నా.. ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనతో వాయిదా పడ్డాయి తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వత తొలి డీజీపీ జితేందర్ అవుతారు. డీజీపీ హోదా లోనే ఆయన హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

పంజాబ్‌కు చెందిన జితేందర్‌ 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. జలంధర్‌లో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు ఎంపికయ్యారు. ఉమ్మడి ఏపీలో నిర్మల్ ఏఎస్పీగా పనిచేసిన తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహబూబ్ నగర్, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. ఢిల్లీలో సీబీఐలో కొంత కాలం పనిచేశారు. 2004-06 మధ్య గ్రేహౌండ్స్ బాధ్యతలుచేపట్టారు. విశాఖపట్నం రేంజ్ డిఐజిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో వరం గల్ రేంజ్ డీఐజీగా పనిచేశారు.

ఆంధ్రప్రదేశ్ సీఐడీ, ఎంక్వయిరీ కమిషన్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్‌లలో బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో అదనపు ట్రాఫిక్‌ కమిషనర్‌గా పనిచేశారు. తెలంగాణ శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా, జైళ్లశాఖ డీజీగా పనిచేశారు. ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. 2025 సెప్టెంబరులో పదవీ విరమణ చేస్తారు. తాజా నియామకంతో 14 నెలలపాటు డీజీపీగా కొనసాగుతారు.

రాజధానిలో ఒక కమిషనర్కు స్థానచలనం!

కొత్త డీజీపీ నియామకంతో పాటు మరికొందరు ఐపీఎస్ అధికారులకు స్థానచలనం ఉండవచ్చని తెలుస్తోంది. రాజధాని కమిషనరేట్లకు సంబం దించి ఒక కమిషనర్ను మార్చే అవకాశముంది. గతంలో అదే కమిషన రేట్ యూనిట్ అధికారిగా పనిచేసిన ఐపీఎస్ను అక్కడ తిరిగి నియమిం చనున్నట్లు సమాచారం. అక్కడి నుంచి మారనున్న ఐపీఎస్కు మల్టీజోన్ బాధ్యతలు అప్పగించే అవకాశముంది. అలాగే మరో మల్టీజోన్కు హైదరా బాద్లోనే పనిచేస్తున్న ఓ ఐజీని నియమించి.. ఇటీవల మారిన మరో ఐపీ ఎస్ను అక్కడ భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది.

తదుపరి వ్యాసం