BRS Mla Muthireddy : నా సంతకం ఫోర్జరీ చేశారు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై కేసు పెట్టిన కూతురు
09 May 2023, 15:23 IST
- BRS Mla Muthireddy : జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదరిగి రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై సొంత కూతురే ఫోర్జరీ కేసు పెట్టారు. తన భూమిని ఆక్రమించుకున్నారని ఆరోపణలు చేశారు.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదరిగిరెడ్డి
BRS Mla Muthireddy : జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వివాదాలు కొత్తకాదు. ఓ భూమి విషయంలో గతంలో కలెక్టర్ తో గొడవ పడ్డ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తాజాగా ఓ కేసులో ఇరుక్కున్నారు. ఆయన సొంత కూతురే ముత్తిరెడ్డిపై కేసు పెట్టింది. తన భూమిని ఆక్రమించుకున్నారని తన తండ్రి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఆమె కేసు పెట్టింది. దీంతో ఈ వివాదం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. తండ్రీకూతుళ్లు పోలీస్ స్టేషన్ గడప తొక్కడంతో వివాదం రచ్చకెక్కింది. సిద్దిపేట జిల్లాలో తనకు చెందిన 20 ఎకరాల భూమిని తన తండ్రి ముత్తిరెడ్డి ఆక్రమించుకున్నారని, ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఈ భూమి విషయంలో తన సంతకాన్ని ముత్తిరెడ్డి ఫోర్జరీ చేసి భూమి లాక్కుకున్నారని ఆరోపణలు చేశారు. ఈ వివాదంపై తుల్జా భవానీ రెడ్డి ముత్తిరెడ్డిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భవానీ రెడ్డి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
తండ్రి కూతురు మధ్య ఎప్పటి నుంచో భూవివాదం నడుస్తోంది. అప్పట్లో చెరువును ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కబ్జా చేశారని విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీ రెడ్డి కేసు పెట్టడంతో ఈ భూవివాదం మరోసారి తెరపైకి వచ్చింది. భవానీ రెడ్డి ఫిర్యాదుపై ఉప్పల్ పోలీసులు సెక్షన్ 406, 420, 463, 464, 468, 471 ఆర్/డబ్ల్యూ 34ఐపీసీ, 156(3) సీఆర్పీసీ ప్రకారం కేసులు నమోదు చేశారు.
నా కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
ఈ వివాదంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. సొంత కూతురే తనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంపై కంటతడి పెట్టుకున్నారు. ప్రత్యర్థులు కావాలనే కుట్రతో తన కుటుంబంలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ముత్తిరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. చేర్యాలలోని సర్వే నంబర్ 1402లో 1200 గజాల స్థలం తన కూతురు పేరుపై రిజిస్టర్ అయి ఉందన్నారు. ఇందులో ఎలాంటి ఫోర్జరీ లేదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్పష్టం చేశారు. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తన కూతురు తుల్జా భవానీ రెడ్డి పేరుపై 125 నుంచి 150 గజాల స్థలం ఉందన్నారు. అందులోనూ ఎలాంటి ఫోర్జరీ జరగలేదని చెప్పుకొచ్చారు. దస్తావేజులు తనకు తెలియకుండా తన కుమారుడు మార్చారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు.