Ramagundam tourism: రామగుండం లో జలసవ్వడి, పర్యాటకులను కనువిందు చేస్తున్న రాముని గుండాల జలపాతం
22 July 2024, 13:28 IST
- Ramagundam tourism: రామగుండంలో భారీ వర్షాలతో జలసవ్వడి నెలకొంది. రాముని గుండాల జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తోంది.
రామగుండంలో పర్యాటకులకు కనువిందు చేస్తున్న జలపాతం
Ramagundam tourism: ఎత్తైన కొండలు.. ప్రక్కన గోదావరి.. కొండలపై నుంచి జాలువారే జలపాతాలు పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. రాముడు నడియాడిన నేల రాముని గుండాలతో రామగుండం గా మారిన ప్రాంతంలో జలపాతం చూపరులను ఆకట్టుకుంటుంది.
సిరుల మాగాని సింగరేణి, వెలుగులు విరజిమ్మే ఎన్టీపిసి కొలువైన రామగుండం కు గొప్ప చరిత్రే ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న రామగుండం రాముని గుండాలతో ఏర్పడిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది.
అలాంటి రామగుండం లో రాముని గుండాలు పర్యాటకులను విశేషంగా ఆకర్శిస్తున్నాయి. వర్షాకాలంలో ప్రకృతి అందాలు, పరవళ్లు తొక్కే జలపాతం ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ప్రకృతి రమణీయత వెల్లివిరుస్తుంది. ఎత్తైన రాతి కొండ పై నుండి నీరు వయ్యారంగా జాలువారుతూ, చుట్టూ పచ్చదనం ప్రకృతి మధ్యలో చూడటానికి రెండు కళ్ళు సరిపోవన్న విధంగా జలపాతం కనువిందు చేస్తుంది.
పైనుంచి జాలు వారే నీరు.. కిందనున్న గుండాలలో పడుతుంది. అలా ఒక గుండం నిండిన తరువాత మరొకటి నిండుతూ.. జలధారకు నీటి పూస గుచ్చినట్లుగా కనిపించే దృశ్యం చూపరులను కట్టిపడేస్తుంది. ఇటువంటి గుండాలు ఇక్కడ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో 108 ఉన్నాయని పర్యాటకులు, ప్రజలు ఆహ్లాదంగా, ఆనందంగా గడపడానికి కుటుంబ సమేతంగా వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. భక్తులు ఇక్కడి పలు ఆలయాలను సందర్శించి మొక్కులు తీర్చుకుని అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తుంటారు.
గోదావరి తీరం...రాతి కొండపై రాముని గుండాలు
పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీరామ చంద్రుడు వనవాసానికి రామగుండం మీదుగా వెళ్ళారట. వనవాసంలో ఉన్న వారు పవిత్ర గోదావరినదీ తీరం వెంబడి ప్రయాణిస్తూ ఈప్రాంతానికి చేరుకున్నారట. ఆసమయంలో ఇక్కడ మహర్షి విశ్వామిత్రుడు, మహా మునేశ్వరుడు, గౌతముడు, నారాయణుడు, విఘ్నేశ్వరుడు, ఋషులు, మునులు నివాసముండి తపస్సు చేశారు.
మహా ఋషులతో పాటు శ్రీరామచంద్రుడు కూడా ఇక్కడకు చేరుకొని స్వయంగా శివలింగ ప్రతిష్ఠాపన చేసి నందీశ్వరుడు, కాలభైరవుడు, నాగదేవతలను సప్త మాతృక్రుతులను పూజించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి జలధార నుంచి నీటిని తెస్తూ నిత్య పూజలు జరిపేవారు.
యమకోణం, జీడిగుండం, పాలగుండం, నేతిగుండం, భైరవగుండం, శ్రీరామ చంద్రమూర్తి పేరుతో కలుపుకుని పలు గుండములు ఏర్పడినవి. అందుకే ఈ ప్రదేశానికి రామగుండం పేరు వాడుకలో వచ్చిందని ప్రజలు విశ్వసిస్తారు. గతంలో ఈ నీటి గుండాలు ఎప్పుడు నీటితో నిండి ఉండేవని, కాని కాలక్రమేణ కొన్ని పూడుకుపోగా ప్రస్తుతం కొన్ని గుండాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. సీతమ్మ వారి వస్త్ర స్థావరం, దశరథ మహారాజుని పిండ ప్రధానం స్థావరం, రాముల వారి హల్లు బండ వంటి స్థలాలు ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉన్నాయి. రాముడు నడియాడిన నేల, రాముడు వినియోగించిన గుండాలు ఉండడంతో ఈ ప్రాంతానికి రామగుండం పేరు వచ్చిందని స్థానికులు భావిస్తున్నారు.
పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుతున్న స్థానికులు
ప్రస్తుతానికి రాముని గుండాల వద్ద చెప్పుకోదగ్గ అభివృద్ధి లేదు. భక్తుల పరంగా, పర్యాటకంగాను ఇక్కడికి చేరుకునేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. పాలకుల నిర్లక్ష్యం వల్ల కనుమరుగాయ్యే పరిస్థితి ఉందని, ఇక్కడి ఆలయాల్లో పూజలు జరిపే పుజారులు చెపుతున్నారు. సాక్షాత్తు రాముడు నివసించిన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు.
అయోధ్య మాదిరిగా కాకపోయినా ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి వలే రాముని గుండాలను అభివృద్ధి చేయాలంటున్నారు. పారిశ్రామిక ప్రాంతంలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మనం కోరుకుందాం.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)