Telangana Elections 2023 : ఆ పార్టీల పోటీ ... నామ మాత్రమేనా!
22 October 2023, 7:18 IST
- Nalgonda Politics : ఎన్నికల వేళ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో చూస్తే… ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్నట్లు కనిపిస్తోంది. మిగతా పార్టీల పోటీ నామ మాత్రమేనా అన్నట్లు ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - 2023
Telangana Elections 2023 : ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రధానంగా రెండు పార్టీల మధ్యనేపోటీ కనిపిస్తోంది. ఒకటీ రెండు నియోజకవర్గాల్లో బీజేపీ ప్రచారం కనిపిస్తున్నా మొత్తంగా 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ అన్న నియోజకవర్గాలో తమ అభ్యర్థులను ప్రకటించి అడ్వాన్సుగా ఉంది. కాంగ్రెస్ పన్నెండులో ఆరు చోట్ల మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ ఇంత వరకు ఒక్క స్థానంలో కూడా తమ గెలుపు గుర్రాల పేర్లను బయట పెట్టలేదు.
పేరుకు డజనుకు పైగా పార్టీలు..
ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న పార్టీలు పేరుకు డజను దాకా ఉన్నాయి. కానీ, వాటిలో మెజారిటీ పార్టీల ఉనికి కూడా కనిపించడం లేదు. ఇపుడు జిల్లాలో జరుగుతున్నదంతా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ రాజకీయాలే. ముఖ్యంగా ప్రతీ నియోజకవర్గంలో చేరిక రాజకీయాలు బాగా ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని బీఆర్ఎస్ తమ పార్టీలోకి తీసుకువస్తుంటే.. బీఆర్ఎస్ కు చెందిన వారిని, సిట్టింగ్ అభ్యర్థులపై అసమ్మతితో ఉన్నవారిని, గతంలో తమ పార్టీలో ఉండి బీఆర్ఎస్ లో చేరిన వారికి కాంగ్రెస్ గాలం వేస్తోంది. దీంతో మండలాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడ ఎన్నికల రాజకీయ వాతావరణం వేడెక్కినట్లు కనిపిస్తోంది. జిల్లాలో ఈ సారి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, టీడీపీతో పాటు బీఎస్పీ, బీఎల్ఎఫ్, ఫార్వర్డ్ బ్లాక్, వైఎస్సార్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్టీపీ), తెలంగాణ జన సమితి, జనసేన పోటీ చేస్తామని ప్రకటించాయి. తెలంగాణ శాసన సభకు ఎన్నికల షెడ్యూలు విడుదలై పది రోజులు గడిచిపోయింది. పోలింగ్ తేదీకి మరో నలభై రోజులు మాత్రమే మిగిలి ఉండగా అత్యధిక పార్టీల్లో కదలిక కూడా కనిపించక పోవడం ప్రస్తావనార్హం.
నామమాత్రంగా మొదలైన కొన్ని పార్టీల ప్రచారం…
ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారం జోరుగా సాగిస్తుండగా, బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించకున్నా టికెట్ తమకే వస్తుందన్న విశ్వాసంతో సూర్యాపేటలో మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, నల్గొండలో మాదగోని శ్రీనివాస్ గౌడ్ వంటి వారు మాత్రమే జనంలో తిరుగుతున్నారు. అయిదారు నెలల కిందటి దాకా జిల్లాలో జోరుగా కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ఆర్టీపీ ఇపుడు చల్లబడింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని, తుంగుతుర్తిలో తమ అభ్యర్థిగా ఏపూరి సోమన్నను ఆ పార్టీ నాయకులు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఇపుడాయన బీఆర్ఎస్ లో చేరగా, ఏ నియోజకవర్గంలో కదలిక కనిపించడం లేదు. బీఎస్పీ కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నా ప్రస్తుతానికి నకిరేకల్ లో మేడి ప్రియదర్శిని, సూర్యాపేటలో వట్టె జానయ్య యాదవ్ లు మాత్రమే ప్రచారంలో ఉన్నారు. కోదాడలో పిల్లుట్ల శ్రీనివాస్ టికెట్ ఇచ్చినా ఇద్దరు మాత్రమే ప్రచారంలో ఉన్నారు. నల్లగొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన మున్సిపల్ కౌన్సిలర్ పిల్లి రామరాజు యాదవ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆయనకు బి ఫారం కూడా అందజేసింది. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఓజో ఫౌండేషన్ పేర సేవా కార్యక్రమాలు చేపట్టి పిల్లుట్ల రఘు ఏదో ఒక ప్రధాన పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోతుందా అని ప్రయత్నాలు చేశారు. కానీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లు తమ అభ్యర్థులను ప్రకటించడంలో పిల్లుట్ల రఘు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీలోకి దిగుతున్నారు. నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలు పెట్టారు. బీఎల్ఎఫ్ తరపున నకిరేకల్ పోటీ చేస్తున్న నూనె వెంకటస్వామి ప్రచారంలో ఉన్నారు.
పొత్తులు తేలక.. ఎదురు చూపులు…
మిగిలిన పార్టీల ఎన్నికల కార్యకలాపాలు పొత్తులతో ముడి పడి ఉన్నాయి. కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తుల్లో భాగంగా సీపీఎం మిర్యాలగూడెం, సీపీఐ మునుగోడు స్థానాలను ఆశిస్తున్నాయి. కానీ, ఈ అంశం ఇంకా తేలలేదు. మరో వైపు ఈ రెండు నియోజకవర్గాల కాంగ్రెస్ శ్రేణులు ఆ పార్టీలకు అవకాశం ఇవ్వొద్దని, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. మరో వైపు తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం సారథ్యం వహిస్తున్న తెలంగాణ జనమితి (టీజేఎస్) కూడా జిల్లాలో పోటీ చేయాలని భావించినా, కాంగ్రెస్ తో పొత్తు చర్చలు ఇంకా కొనసాగిస్తుండడంలో సీట్ల లెక్క తేలలేదు. ప్రధానంగా ఆ పార్టీ సూర్యాపేట స్థానాన్ని ఆశిస్తోంది. మరో వైపు సినీ హీరో పవన్ కళ్యాణ్ అధ్యక్షుడిగా ఉన్న జనసేన పార్టీ జిల్లాలో నాలుగు స్థానాల్లో పోటీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించుకుని ఆ మేరకు ప్రకటన చేసింది. కానీ, తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీ టీడీపీతో, బీజేపీతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించడంతో జన సేన పోటీ చేసే స్థానాల విషయంలో స్పష్టత రాలేదు. దీంతో ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. మరో వైపు జిల్లాలో అత్యధిక కాలం, అత్యధిక నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ తెలుగు దేశం పార్టీ (టీటీడీపీ) ఈ సారి ఒక్క స్థానం నుంచైనా పోటీ చేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి దాకా ఆ పార్టీ కార్యాచరణ శూన్యం కావడం గమనార్హం.