Gold ATM in Hyd: మన హైదరాబాద్‌లో గోల్డ్ ATMలు... ఇకపై బంగారం డ్రా చేసుకోవచ్చు…
04 December 2022, 11:30 IST
- India's First Gold ATM: ఏటీఎం( automated teller machine)...అనగానే డబ్బు డ్రా చేయడం గుర్తుకువస్తుంది. కానీ ఇకపై గోల్డ్ కూడా డ్రా చేసుకోవచ్చు. అదేంటని పరేషాన్ అవుతున్నారా..? మీరు విన్నది నిజమే...దేశంలోనే తొలిసారిగా మన హైదరాబాద్ లో గోల్డ్ ఏటీఎం ఏర్పాటైంది. అంతేకాదండోయ్ త్వరలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఏర్పాటు కానున్నాయి.
హైదరాబాద్ లో తొలి గోల్డ్ ఏటీఎం
India's First Gold ATM in Hyderabad: ఏటీఎమ్ వెళ్తున్నామంటే ఆర్థిక లావాదేవీల గురించే అని చెప్పొచ్చు..! ఇకపై మరో అర్థం కూడా రాబోతుంది. డబ్బుల మ్యాటరే కాదు... గోల్డ్ కు సంబంధించి కూడా ATMలకు వెళ్లొచ్చు. డైరెక్ట్ గా వీటి ద్వారానే బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి అద్భుతమైన సర్వీస్ కు వేదికైంది మన హైదరాబాద్ నగరం. దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎంను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. గోల్డ్ సిక్కా ఆధ్వర్యంలో బేగంపేటలోని అశోకా రఘుపతి చాంబర్స్‌లో ఉన్న సంస్థ కార్యాలయంలో ఈ ఏటీఎంను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏటీఎంల ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డు సహాయంతో బంగారం విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఈ గోల్ట్ ఏటీఎం ద్వారా 99.99శాతం క్వాలిటీ కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలు విత్ డ్రా చేసుకోవచ్చని గోల్డ్ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్ తరుజ్ వెల్లడించారు. నాణేల నాణ్యత, గ్యారెంటీ తెలిపే పత్రాలు కూడా జారీ అవుతాయని వివరించారు. త్వరలోనే నగరంలోని మరిన్ని ప్రాంతాలతో పాటు.... వరంగల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లా కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి ఈ గోల్డ్ ఏటీఎం లే నిదర్శనమని చెప్పారు. దేశంలోనే తొలిసారి గోల్డ్ ఏటీఎంను హైదరాబాద్ నగరంలో ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. మరిన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.