TS Governor In Assembly: త్వరలోనే మరో రెండు ఎన్నికల హామీల అమలు.. అసెంబ్లీలో గవర్నర్ ప్రకటన
08 February 2024, 11:58 IST
- TS Governor In Assembly: తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన ఆరుగ్యారంటీల్లో మరో రెండు హామీలను త్వరలోనే అమలు చేయనున్నట్టు గవర్నర్ తమిళ సై అసెంబ్లీలో ప్రకటించారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగంతో ప్రారంభించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించిన గవర్నర్ తమిళ సై
TS Governor In Assembly: అధికారం ఉన్నదని హద్దుపద్దు లేక, అన్యాయ మార్గాలలో అచ్చివచ్చే రోజులు అంతమయ్యాయనే కాళోజీ మాటలతో తెలంగాణ గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగాన్ని ప్రారంభించారు.
తెలంగాణ ప్రజల అకాంక్షలను అర్ధం చేసుకుని ప్రభుత్వం పాలన సాగిస్తుందని చెప్పారు. తెలంగాణలో కులగణన నిర్వహించడం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు, కులాలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
రైతులు, ఉద్యోగులు, విద్యార్ధులు, మైనార్టీలు, అమరవీరులు, బడుగుబలహీన వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా, బిఆర్ అంబేడ్కర్ ప్రేరణతో పాలన సాగిస్తామిన ప్రకటించారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాభవన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల చేత, ప్రజల కొరకు అనే నినాదంతో రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు. ప్రజా సేవకుడిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ పాలన సాగిస్తున్నారని, ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల ఆశలు, అకాంక్షలు నెరవేరుస్తున్నామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో బలిదానాలు చేసిన ప్రజల అకాంక్షలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం సాగుతుందన్నారు. ప్రజల ఆశలు అకాంక్షలను గుర్తించి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు.
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో రెండు హామీలను ఇప్పటికే అమలు చేశామని గవర్నర్ తెలిపారు. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రజాపాలనలో భాగంగా కోటిన్నరకు పైగా దరఖాస్తులు స్వీకరించినట్టు చెప్పారు.
మహాలక్ష్మీలో భాగంగా రూ.500కే ఎల్పీజీ సిలిండర్ తోపాటు గృహజ్యోతిలో భాగంగా 200యూనిట్లను త్వరలోనే అర్హలకు ఉచితంగా అందిస్తామన్నారు.
ఎన్నికల హామీల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి నుంచి 2లక్షల ఉద్యోగాల వరకు అన్ని హామీలు నెరవేరుస్తామన్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు పూర్వవైభవం తీసుకురావడంతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధిని విస్తరిస్తామన్నారు.
గత ప్రభుత్వాల హయంలో జరిగిన ఏకపక్ష, నిరంకుశ పాలనలో రాష్ట్ర ఖజానాను పూర్తిగా ఖాళీ చేసి అప్పగించారని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని బాధ్యతాయుతంగా గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండేలా పాలన సాగిస్తామన్నారు. రాజ్యాంగ సంస్థలకు పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ బాధ్యతాయుతంగా పనిచేసేలా వాటిని తీర్చిదిద్దుతామన్నారు.
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడిఉందని గవర్నర్ ప్రసంగంలో చెప్పారు.
రైతాంగ ప్రయోజాలను కాపాడటంతో పాటు వాతావరణ మార్పులు, పంట నష్టాల నుంచి రైతుల్ని కాపాడటం వంటి విషయాల్లో చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని చెప్పారు.
ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్లలో గణనీయమైన పురోగతి తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.
ప్రపంచ వాణిజ్య సదస్సులో పాల్గొనడం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రూ.40వేల కోట్ల రుపాయల పెట్టుబడులను ఆకర్షించ గలిగినట్టు చెప్పారు.
దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు.
తెలంగాణ ప్రజలను అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో రూ.2వేల కోట్లతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు చెప్పారు.
తెలంగాణలో పర్యాటక రంగానికి ఉన్న విస్తృత అవకాశాలు, పర్యాటక ఆకర్షణలకు గుర్తింపు తీసుకువస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ఠ్రం కొత్త విజయాలను సాధిస్తుందని ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు.