Kakatiya Kalatoranam: కాకతీయ కళాతోరణం తొలగిస్తే మరో ఉద్యమం తప్పదంటున్న బిఆర్‌ఎస్.. సిఎం వ్యాఖ్యలపై ఆగ్రహం
13 February 2024, 9:31 IST
- Kakatiya Kalatoranam: కాకతీయకళాతోరణం తొలగింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
కాకతీయ కళాతోరణం తొలగింపుపై బిఆర్‌ఎస్ నేతల ఆగ్రహం
Kakatiya Kalatoranam: ప్రభుత్వ అధికారిక చిహ్నంలో చార్మినార్ తో పాటు కాకతీయ కళాతోరణాన్ని తొలగించాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని, ప్రభుత్వ చిహ్నం నుంచి కాకతీయుల కళాతోరణాన్ని తొలగిస్తే మరో ఉద్యమం తప్పదని బీఆర్‌ఎస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేశ్‌లు హెచ్చరించారు.
అధికారిక చిహ్నం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, హనుమకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కాకతీయుల తోరణం, చార్మినార్ చిహ్నాన్ని ప్రభుత్వ అధికారిక లోగో నుంచి తీసివేయాలనడం ప్రభుత్వ మూర్ఖత్వమే అని అన్నారు. కేబినెట్ సమావేశంలో దీని ప్రస్తావన వచ్చినప్పుడు కేబినెట్ మొత్తం వ్యతిరేకించాలన్నారు.
పోరుగల్లు లాంటి ఓరుగల్లు నగరంలో మేథావులు,కవులు, కళాకారులు అందరూ ముక్తకంఠంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. కాకతీయ తోరణం లో హంసలు, మొసల్లు కనబడతాయన్నారు. ప్లేగు వ్యాధి అంతమొందిన తర్వాత చార్మినార్ నిర్మించారని, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచనతో నిర్మించిన ఆ నిర్మాణాన్ని కూడా ప్రభుత్వ అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తామని చెప్పడం మంచి పద్ధతి కాదన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆ రెండింటిని ప్రభుత్వ లోగో నుంచి తొలగిస్తామన్నా ఓరుగల్లు మంత్రులు సీతక్క, సురేఖ వ్యతిరేకించపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తే మరో ఉద్యమం లేవనెత్తుతామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నేతలకు కాళేశ్వరంపై క్లారిటీ లేదు
కాంగ్రెస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టుపై క్లారిటీ లేదని, విజిలెన్స్ కమిషన్ వేయాలని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని పూటకో మాట మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనపై అనేక ఆరోపణలతో కాలం వెల్లదీస్తోందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందని, గడచిన పదేళ్లలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కోటి ఎకరాలకు నీటిని అందజేస్తే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కృష్ణా నీటి పరివాహ ప్రాంతాల్లోని వారికి తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు.
ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మెరుగైన పాలనను అందించలేక, సౌకర్యాలను బాగుపరచలేక బీఆర్ఎస్ పాలన మీదనే నిందారోపణలు చేయడం తగదన్నారు.
గత ప్రభుత్వం అమలు చేసిన దళిత బంధు, బీసీ బంధు, మైనారిటీ బంధు, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ పథకాలను పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారెంటీ లను 100 రోజుల్లోగా పూర్తి చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
గేట్ వే ఆఫ్ వరంగల్ కాకతీయ కళాతోరణం
ఓరుగల్లు రాజధానిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దక్షిణ తమిళనాడు ఇతర రాష్ట్రాల్లో కాకతీయ రాజులు పరిపాలించే వారని, కాకతీయ కళాతోరణాన్ని గేట్ వే ఆఫ్ వరంగల్ గా పిలిచేవారని జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ అన్నారు. అలాంటి కాకతీయ కళాతోరణాన్ని ప్రభుత్వ అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు.
Htసీఎం అర్థరహితంగా మాట్లాడితే కేబినెట్ లో ఉన్న మంత్రులకు పౌరుషం, రోషం ఉంటే వ్యతిరేకించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవ రెడ్డి, సుందర్ రాజు యాదవ్, పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, కో–ఆర్డినేటర్ పులి రజనీకాంత్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)