YS Sharmila : తెలంగాణ ఎన్నికల బరిలో వైఎస్ విజయమ్మ, రెండు స్థానాల్లో షర్మిల పోటీ!
11 October 2023, 21:22 IST
- YS Sharmila : కాంగ్రెస్ పొత్తు సక్సెస్ కాకపోవడంతో వైఎస్ఆర్టీపీ ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. వైఎస్ షర్మిల రెండు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో వైఎస్ విజయమ్మ కూడా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం.
వైఎస్ షర్మిల, విజయమ్మ
YS Sharmila : కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోవడంతో తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల డిసైడ్ అయ్యారు. అయితే ఎన్నికల బరిలో తన తల్లి విజయమ్మను నిలపాలని షర్మిల భావిస్తున్నారని సమాచారం. దీంతో పాటు 100 సీట్లలో వైఎస్ఆర్టీపీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. పాలేరు, మిర్యాలగూడ 2 స్థానాలలో షర్మిల పోటీ చేయనున్నారని, సికింద్రాబాద్ నుంచి వైఎస్ విజయమ్మ బరిలో నిలిచే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
కీలక స్థానాల్లో అభ్యర్థులు ఖరారు!
ముఖ్యనేతలతో సమావేశం అవుతున్న షర్మిల... నియోజక వర్గాల వారీగా పలువురు అభ్యర్థుల పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సూర్యాపేట నుంచి పిట్ట రాంరెడ్డి, సత్తుపల్లి నుంచి కవిత, బోధన్ నుంచి సత్యవతి, కల్వకుర్తి నుంచి అర్జున్ రెడ్డి, వనపర్తి నుంచి వెంకటేశ్వర రెడ్డి, నర్సంపేట నుంచి శాంతికుమార్, అదిలాబాద్ నుంచి బెజ్జంకి అనిల్, చేవెళ్ల నుంచి దయానంద్, గజ్వేల్ నుంచి రామలింగారెడ్డి, సిద్దిపేటలో నర్సింహారెడ్డి, సిరిసిల్లలో చొక్కాల రాము, కామారెడ్డి నుంచి నీలం రమేశ్, అంబర్ పేట నుంచి గట్టు రామచంద్రరావును ఎన్నికల బరిలో నిలిపేందుకు వైఎస్ఆర్టీపీ సన్నాహాలు చేస్తుంది.
రేపు కీలక సమావేశం
వైఎస్ షర్మిల అధ్యక్షతన వైఎస్ఆర్టీపీ రాష్ట్ర కార్యవర్గం గురువారం సమావేశం కానుంది. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో జరుగబోయే ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికపై క్లారిటీ ఇస్తారని తెలుస్తోంది. గత కొంత కాలంగా యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉన్న షర్మిల... సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ లో విలీనం అనగానే వైఎస్ఆర్టీపీ కేడర్ కూడా అయోమయానికి లోనై పక్క పార్టీల బాటపట్టారు. ఎన్నికల వేళ షర్మిల తీరుపై వైఎస్ఆర్టీపీ నేతలు కాస్త ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌తో విలీనం ప్రయత్నాలు విఫలం కావడంతో ఒంటరిగానే ముందుకు సాగాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ముందు నుంచీ పాలేరు పోటీ సిద్ధం చేసుకున్న షర్మిల... తుమ్మల, పొంగులేటి లాంటి సీనియర్లను ఢీకొట్టి విజయం సాధించగలరా? అనే చర్చ మొదలైంది. ఈ తరుణంలో ఆమె అనూహ్యంగా రెండు స్థానాల్లో పోటీకి దిగాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మిర్యాలగూడ నుంచి బరిలో దిగేందుకు షర్మిల ప్రయత్నాలు చేస్తున్నారు.