Hyderabad Police | హైదరాబాద్ చరిత్రలో ఇదే తొలిసారి... మహిళా ఎస్‌హెచ్‌వోగా మధులత
08 March 2022, 13:23 IST
- గతంలో ఎన్నడూ లేని విధంగా.. సిటీ పోలీస్ విభాగంలో మహిళకు స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్ హెచ్ ఓ) గా బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కమిషనర్ సీవీ నిర్ణయం తీసుకున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
ఉమెన్స్ డే.. రోజున రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే ఈసారి హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. సిటీ పోలీస్ విభాగంలో మహిళ ఇన్ స్పెక్టర్ ను శాంతిభద్రతల విభాగం పోలీస్ స్టేషన్ కు ఎస్ హెచ్ ఓ నియమించారు. ఇవాళ.. హోంమంత్రి మహమూద్‌అలీ, సీవీ ఆనంద్ సమక్షంలో మధులత బాధ్యతలు తీసుకున్నారు.
లాలాగూడ పీఎస్ ఎస్‌హెచ్‌వోగా మధులత విధులు స్వీకరించారు. 2002 బ్యాచ్‌కు చెందిన మధులత.. పాతబస్తీ మహిళా పోలీస్ స్టేషన్‌లో సీఐగా కూడా పనిచేశారు. మధులత మహిళా పోలీసులకు స్ఫూర్తిగా నిలవాలని సీపీ సీవీ ఆనంద్ సూచించారు. మహిళా పోలీసులు సవాళ్లను స్వీకరించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో అండగా ఉంటుందని.. హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు.
మెుదట మధులత పేరు.. సీల్డ్ కవర్ లో సర్ప్రైజ్ గా ఉంచారు. హోంమంత్రి మహమూద్ అలీ , సీపీ ఆనంద్ సమక్షంలో పేరును తీశారు. అనంతరం సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజ్ ఆడిటోరియంలో మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు .
అప్పట్లో పోలీస్ విభాగంలో మహిళా అధికారుల సంఖ్య తక్కువగా ఉండేది. రాష్ట్రం ఏర్పడ్డాక మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన విషయం తెలిసిందే. అదనపు డీజీ నుంచి కానిస్టేబుళ్ల వరకు కలిపి ప్రస్తుతం 3,803 మంది ఉన్నారు. హోంగార్డులు కూడా ఉన్నారు. ఇన్‌స్పెక్టర్ స్థాయిలో ఉన్న వారి సంఖ్య 31గా ఉంది. ఏ ఒక్కరూ కూడా శాంతిభద్రతల విభాగం ఠాణాకు ఎస్‌హెచ్‌ఓగా లేరు.