ED IT Raids : తెలుగు రాష్ట్రాల్లో ఈడీ, ఐటీ నజర్- రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీల్లో సోదాలు
24 May 2023, 21:11 IST
- ED IT Raids : తెలుగు రాష్ట్రాల్లోని పలు రియల్ ఎస్టేట్, ఫార్మా కంపెనీల్లో అవకతవకల ఆరోపణలతో ఈడీ, ఐటీ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈడీ, ఐటీ సోదాలు
ED IT Raids : తెలుగు రాష్ట్రాలలో ఈడీ, ఐటీ వరుస దాడులు చేస్తుంది. హైదరాబాద్, విశాఖ సహా పలు ప్రాంతాల్లో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల సుమారు 20 బృందాలు తనిఖీల్లో పాల్గొన్నాయి. ఓ స్థిరాస్తి సంస్థకు చెందిన డైరెక్టర్ల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. మరోవైపు విశాఖలో 10కి పైగా ప్రాంతాల్లో 15 ఐటీ బృందాలు తనిఖీలు చేశారు. పలు ఫార్మా సంస్థలతో పాటు ఆయా కంపెనీల డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు అధికారులు సోదాలు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ, ఈడీ దాడులు
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేపట్టాయి. హైదరాబాద్‌లోని పలు స్థిరాస్తి సంస్థలపై ఆదాయపన్ను శాఖ భారీ ఎత్తున తనిఖీలు చేస్తోంది. కె.ఎం.కోహినూర్ గ్రూపు స్థిరాస్తి సంస్థతోపాటు, ఏడు రియల్ఎస్టేట్ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఏకకాలంలో 50కి పైగా ఐటీ బృందాలు తనిఖీలు చేస్తున్నట్లు ఆదాయపన్ను శాఖ వర్గాలు వెల్లడించాయి. పూర్తిగా కేంద్ర బలగాల బందోబస్తుల సోదాలు చేస్తున్నారు. కె.ఎం. కోహినూర్ గ్రూపు స్థిరాస్తి సంస్థతో అనుబంధం ఉన్న ఏడు రియల్ఎస్టేట్ సంస్థల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
పన్నులు, వ్యాపారాలకు వ్యత్యాసం
ఫలక్‌నుమాలోని కింగ్స్ గ్రూప్ యజమాని షా నవాజ్ ఇంటిపై, పాతబస్తీ, బండ్లగూడ, మొయిన్‌బాగ్ ప్రాంతాల్లోని ఆర్ఆర్‌గ్రూప్ కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఏజే ప్రాజెక్టు ఇన్‌ఫ్రా, క్రిస్టల్ మెన్షన్, కాకతీయ మెన్షన్, శిల్పా ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ తదితర సంస్థలకు చెందిన ఆఫీసులు, మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈవోల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఆయా సంస్థలు చెల్లిస్తున్న పన్నులకు ఆ వ్యాపారాలకు భారీగా వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ అధికారులు దాడుల్లో గుర్తించారు. ఈ మేరకు కేసులు నమోదు చేశారు. ఈ దాడుల్లో విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు వివరించారు. మాదన్నపేట్, శాస్త్రిపురం, బంజారాహిల్స్‌లో తనిఖీలు చేస్తున్నారు.
విశాఖలో
విశాఖలోని పలు ఫార్మా సంస్థలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. నగరంలోని పదికి పైగా ప్రాంతాల్లో నిర్వహిస్తున్న 15 ఐటీ బృందాలు పాల్గొన్నాయి. పలు ఫార్మా సంస్థలతో పాటు, కంపెనీల డైరెక్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆదాయపన్ను చెల్లింపుల అవకతవకల అనుమానంతో అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ గేమింగ్ కంపెనీలపై
విదేశాల్లో నమోదై భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న కంపెనీలపై దిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లోని 25 చోట్ల ఈడీ దాడులు నిర్వహించింది. రూ. 4 వేల కోట్లు భారత్ నుంచి ఇతర దేశాలకు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫెమా(FEMA) నిబంధనలు ఉల్లంఘించిన ఏజెన్సీల నుంచి రూ.19.55 లక్షలు స్వాధీనం చేసుకుని, 55 బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు.