తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vande Bharat Express : ఒకే రోజు 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం, రైల్వే శాఖలో నవశకానికి మోదీ శ్రీకారం- కిషన్ రెడ్డి

Vande Bharat Express : ఒకే రోజు 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం, రైల్వే శాఖలో నవశకానికి మోదీ శ్రీకారం- కిషన్ రెడ్డి

HT Telugu Desk HT Telugu

24 September 2023, 15:17 IST

google News
    • Vande Bharat Express : నేడు దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందులో కాచిగూడ-యశ్వంత్ పూర్ వందే భారత్ రైలు ఒకటి. దీంతో తెలంగాణలో మూడు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Vande Bharat Express : నేడు ఏకకాలంలో 9 వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో కాచిగూడ – యశ్వంత్ పూర్ వందే భారత్ రైలును ప్రధాని మోడీ వర్చువల్ గా పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తరువాత భారత రైల్వే వ్యవస్థలో ఒక నూతనశకం ప్రారంభం అయ్యిందన్నారు. ఒక నూతన అధ్యాయానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన కొనియాడారు. దేశంలో అన్ని రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చెయ్యాలని, అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఆధునిక వసుతులు కల్పించాలనేదే మోదీ ఆలోచనా అన్నారు. అందుకే వేలాది కోట్ల రూపాయలు రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేటాయిస్తున్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. స్వదేశంలోనే అభివృద్ధి చేసిన అత్యంత ఆధునిక వసతులతో 9 వందే భారత్ రైళ్లను ఏకకాలంలో ప్రారంభించిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందన్నారు. తెలంగాణలో ప్రస్తుతం రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, ఈరోజు ప్రారంభించే దానితో కలిపి తెలంగాణలో మూడు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయన్నారు. ఇందకు ప్రధాని మోదీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నానన్నారు.

పట్టాలెక్కే 9 వందే భారత్ రైళ్లు ఇవే

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ (కాచిగూడ)- (యశ్వంత్ పూర్ ) బెంగళూరు, విజయవాడ - చెన్నై రైళ్లు ఉండగా వీటితోపాటు జైపూర్‌-ఉదయపూర్‌, పాట్నా-హౌరా, రాంచీ-హౌరా, చెన్నై-తిరునెల్వెలి, పూరీ-రూర్కెలా, కాసర్‌గోడ్‌-తిరువనంతపురం, జమ్నానగర్‌-అహ్మదాబాద్‌ మధ్య వందేభారత్‌ రైళ్లను ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

హైదరాబాద్ -బెంగళూరు రైలు ప్రత్యేకతలు

హైదరాబాద్-బెంగళూరు వందేభారత్ రైలు ఏపీ మీదుగా కర్ణాటకకు వెళ్లనుంది. కాచిగూడ-యశ్వంత్‌పూర్‌ వందే భారత్‌ రైలులో మొత్తం 8 కోచ్‌లు ఉంటాయి. రైలులో 530 మంది ప్రయాణించేందుకు సీట్లు ఉంటాయి. ఒక ప్రయాణికుడికి క్యాటరింగ్‌ ఛార్జీలతో కలిపి- ఏసీ ఛైర్‌కార్‌ ధర రూ.1,600గా, ఎగ్జిక్యూటివ్‌ టికెట్‌ ధర రూ.2,915 గా ఉండనుంది. క్యాటరింగ్‌ వద్దనుకుంటే ఏసీ ఛైర్‌ కార్‌ టికెట్‌ రూ.1,255, ఎగ్జిక్యూటివ్‌ టికెట్‌ రూ.2,515గా ఉండనుంది. ఈ రెండు నగరాల మధ్య దూరం 610 కి.మీ దూరం కాగా ప్రయాణానికి 8.30 గంటల సమయం పడుతుంది. కాచిగూడ-యశ్వంత్‌పుర్‌ వందే భారత్‌ రూటులో మొత్తం నాలుగు స్టేషన్లలో ఆగుతుంది. కాచిగూడలో ఉదయం 5.30కి ట్రైన్ బయల్దేరగా మహబూబ్‌నగర్‌ 6.49 గంటలకు, కర్నూలు 8.24 గంటలకు, అనంతపురం 10.44 గంటలకు, ధర్మవరం 11.14 గంటలకు, యశ్వంత్‌పూర్‌కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. ఒక్క బుధవారం మినహా వారంలో మిగతా రోజులు ఈ వందే భారత్ రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయి.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

తదుపరి వ్యాసం