Mlc Kavitha : ఎమ్మెల్సీ కవితకు అరుదైన గౌరవం, ప్రతిష్టాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం
24 October 2023, 16:55 IST
- Mlc Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రతిష్టాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందింది. ఈ నెల 30 యూనివర్సిటీలో జరిగే కార్యక్రమంలో ప్రసంగించనున్నారు.
ఎమ్మెల్సీ కవిత
Mlc Kavitha : యూకేలోని ప్రతిష్టాత్మక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆహ్వానం అందింది. ఈ నెల 30న ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో జరుగబోయే కార్యక్రమంలో " డెవలప్మెంట్ ఎకనామిక్స్ " అనే అంశంపై కల్వకుంట్ల కవిత ప్రసంగించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కీలక ఉపన్యాసం ఇవ్వనున్నారు. అయితే ఇటీవలే బ్రిడ్జి ఇండియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత పాల్గొని అనంతరం ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంపై కవిత యూనివర్సిటీలో వివరించాల్సిందిగా యాజమాన్యం ఆహ్వానం పంపింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కీలక పథకాలను కల్వకుంట్ల కవిత వివరించనున్నారు.
మిషన్ భగీరథపై ప్రసంగం
తెలంగాణ వ్యవసాయ రంగం పురోగమించిన తీరు, రైతులకు రైతు బంధు పేరిట సీఎం కేసీఆర్ అందిస్తున్న పెట్టుబడి సాయం, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బీమా పథకాలపై కవిత ప్రసంగిస్తారు. అలాగే గ్రామీణ, ఆర్థిక వ్యవస్థ బలపడేలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వివిధ పథకాల ద్వారా కుల వృత్తులను ప్రోత్సహించిన తీరు అనేక రూపాల్లో గ్రామీణ ప్రాంతాల ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాల గురించి కవిత వివరించనున్నారు. మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ నల్లా కనెక్షన్ ద్వారా తాగు నీళ్లను సరఫరా చేస్తున్న కార్యక్రమంపై కవిత వివరించనున్నారు. వీటితో పాటు వైద్య, విద్య రంగంపై ప్రభుత్వం సాధించిన పురోగతిపై కవిత తెలియజేయనున్నారు. దీంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక్కో పథకం వెనుక ఉన్న ప్రయోజనాల గురించి ఆమె ప్రసంగించనున్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్