TSPSC Group-4 Exam : తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు అలెర్ట్, దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం
06 May 2023, 19:08 IST
- TSPSC Group-4 Exam : తప్పుల సవరణకు గ్రూప్-4 అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో అవకాశం కల్పిస్తుంది. ఈ నెల 9 నుంచి 15 వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.
గ్రూప్ -4
TSPSC Group-4 Exam : తెలంగాణ గ్రూప్-4(Group-4) అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ(TSPSC) మరో అవకాశం కల్పించింది. దరఖాస్తుల్లో సవరణ చేసుకునేందుకు ఈనెల 9వ తేదీ నుంచి 15 వరకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అభ్యర్థులు దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు ఈ అవకాశం కల్పించినట్లు టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. మొత్తం 8180 గ్రూప్-4 ఉద్యోగాలకు గాను 9,51,321 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 పరీక్షను జులై 1న నిర్వహిస్తుంది.
ఎడిట్ ఆప్షన్
టీఎస్పీఎస్సీ గ్రూప్ -4 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే అభ్యర్థులు అప్లికేషన్ పూర్తిచేసినప్పుడు తప్పులు చేశారు. ఈ తప్పుల సవరణకు అభ్యర్థుల నుంచి వినతుల రావడంతో... టీఎస్పీఎస్సీ దరఖాస్తుల్లో తప్పులు సరిచేసుకునేందుకు మరో అవకాశం కల్పించింది. ఈ నెల 9 నుంచి టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో గ్రూప్ 4 అభ్యర్థుల అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.
జులై 1న రాత పరీక్ష
తెలంగాణలో మొత్తం 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జులై 1న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ(TSPSC) ఇప్పటికే ప్రకటించింది. జులై 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్-4లో మొత్తం ఉద్యోగాల సంఖ్య 8180 కాగా.. ఇప్పటివరకు 8039గా ఉన్న ఖాళీల సంఖ్య మహాత్మాజ్యోతిభాపూలే బీసీ సంక్షేమ హాస్టళ్లకు మరో 141 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను జోడించారు. దీంతో 289గా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య 430కు చేరాయి. అదేవిధంగా మొత్తం గ్రూప్-4 ఉద్యోగాల సంఖ్య 8180కు చేరింది.
మొత్తం 300 మార్కులు
గ్రూప్ -4 పరీక్షను రెండు పేపర్లలో నిర్వహిస్తున్నారు. మొత్తం 300 మార్కులకు ఆన్‌లైన్ రాతపరీక్ష లేదా ఓంఎంఆర్ ఆన్సర్ షీట్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో పేపర్-1 (జనరల్ స్టడీస్)-150 ప్రశ్నలకు 150 మార్కులు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్)-150 ప్రశ్నలకు 150 మార్కులు కేటాయిస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది. ప్రశ్నలను ఆబ్జెక్టివ్ విధానంలోనే అడుగుతారు.
ఇటీవల టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం సంచలనం అవ్వడంతో గ్రూప్ -4 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసింది.