తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy: బంగారు బాతులాంటి ఓఆర్ఆర్ ను తెగనమ్మారు- ఈ స్కామ్ వెనుక కేసీఆర్, కేటీఆర్ : రేవంత్ రెడ్డి

Revanth Reddy: బంగారు బాతులాంటి ఓఆర్ఆర్ ను తెగనమ్మారు- ఈ స్కామ్ వెనుక కేసీఆర్, కేటీఆర్ : రేవంత్ రెడ్డి

HT Telugu Desk HT Telugu

01 May 2023, 18:12 IST

google News
    • Revanth Reddy: బంగారు బాతులాంటి హైదరాబాద్ ఓఆర్ఆర్ ను కేటీఆర్, కేసీఆర్ అమ్మేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓఆర్ఆర్ విషయంలో ఫిర్యాదు చేసేందుకు కొత్త సచివాలయానికి వెళ్లేందుకు రేవంత్ ప్రయత్నించగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)
రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో) (HT_PRINT)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) లీజు విషయంలో రూ. 1000 కోట్ల అవినీతి జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి హెచ్ఎండీఏ కమిషనర్ కు ఫిర్యాదు చేసేందుకు కొత్త సెక్రటేరియట్ వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఈ విషయం ముందుగా తెలుసుకున్న పోలీసులు సచివాలయం వద్ద భారీగా బలగాలను మోహరించారు. టెలిఫోన్ భవన్ వద్దే రేవంత్ రెడ్డి కారును నిలిపివేశారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. నూతన సచివాలయానికి ఎందుకు వెళ్లకూడదో చెప్పాలని రేవంత్ రెడ్డి పోలీసులు ప్రశ్నించారు.

హెచ్ఎండీఏ కమిషనర్ అపాయింట్ మెంట్ లేదంటూ పోలీసులు చెప్పడంతో రేవంత్ రెడ్డి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అయిన తనకు సచివాలయంలోకి వెళ్లడానికి అనుమతి ఏంటని ప్రశ్నించారు. తనకు అనుమతి ఇవ్వకపోతే రోడ్డుపై బైఠాయిస్తానని ఆయన ఆగ్రహంతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి సచివాలయానికి వెళ్తానని చెప్పడంతో పోలీసులు అందుకు అంగీకరించలేదు. రేవంత్ రెడ్డి నూతన సచివాలయానికి వస్తున్నారనే సమాచారంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. సెక్రటేరియట్ విజిటర్స్ గేటును పోలీసులు మూసివేశారు.

బంగారు బాతు లాంటి ఓఆర్ఆర్ ను అమ్మేశారు

హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ ను నిర్మించిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్ తరాలకు వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చాలని, అభివృద్ధిని అందించాలని ఓఆర్ఆర్ నిర్మించారన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ కోసం రూ. 6696 కోట్లు ఖర్చు చేసిందన్నారు.

ఖర్చు చేసిన డబ్బులను తిరిగి రాబట్టుకోవడానికి టోల్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసి టోల్ వసూలు చేసే ఏర్పాటు చేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతీ ఏటా ప్రభుత్వానికి రూ. 750 కోట్ల టోల్ ఆదాయం వస్తుందని, అలాంటి ఆదాయం ఉన్న ఓఆర్ఆర్ ను ముంబయి సంస్థకు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిందని రేవంత్ ఆరోపించారు.

రూ. 7388 కోట్లకు ఐఆర్బీ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం కట్టబెట్టిందన్నారు. ఏడాదికి రూ. 750 కోట్లు వస్తుంటే రూ. 246 కోట్లకే ముంబై కంపెనీకి కట్టబెట్టిందని ఆరోపించారు. బంగారు బాతు లాంటి ఓఆర్ఆర్ ను కేటీఆర్ 30 ఏళ్లకు తెగనమ్మారని మండిపడ్డారు.

ఓఆర్ఆర్ స్కామ్ వెనుక కేటీఆర్, కేసీఆర్

"ఆరునెలల్లో దిగిపోయే ముందు ప్రభుత్వం ఓఆర్ఆర్ ను అమ్ముకున్నారు. నిన్నటి నుంచే సెక్రటేరియట్ నుంచి పరిపాలన సాగుతుందని కేసీఆర్ చెప్పారు. అంబేడ్కర్ సిద్ధాంతాల గురించి ఉపన్యాసం ఇచ్చి.. 24గంటలు తిరక్కముందే మరిచారు. 20 ఏళ్లలో ఎప్పుడూ ఎమ్మెల్యేలు, ఎంపీలను సచివాలయానికి రాకుండా అడ్డుకోలేదు. టోల్ కు సంబంధించి టెండర్ ప్రక్రియ లో పాల్గొన్న కంపెనీల వివరాలు ఆర్టీఐ ద్వారా అడిగేందుకు వెళ్లాను. కానీ పోలీసులు చుట్టుముట్టి నన్ను అడ్డుకున్నారు. హెచ్ఎండీఏ కార్యాలయం ఇంకా షిఫ్ట్ కాలేదని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి వచ్చి దరఖాస్తు ఇస్తే అక్ నాలెడ్జి పై రబ్బరు స్టాంప్ కూడా వేయలేదు. సెక్రటేరియట్ కు షిఫ్ట్ అయ్యిందని సమాధానం ఇచ్చారు. అరవింద్ కుమార్ ఇక్కడ లేడు, అక్కడ లేడు... మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడా? లక్ష కోట్ల విలువైన ఓఆర్ఆర్ ను అమ్ముకున్నారు. ఇది వేల కోట్ల కుంభకోణం.... ఇది ప్రభుత్వ ఆస్తిని తెగనమ్మడమే. ఈ దోపీడీ వెనక కేటీఆర్, కేసీఆర్ ఉన్నారు. పోలీసులతో రాజ్యాన్ని నడుపుతున్నారు." - రేవంత్ రెడ్డి

కేటీఆర్ ను జైల్లో పెట్టే వరకూ పోరాటం

రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు జరగడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఓఆర్ఆర్ కుంభకోణంపై విచారణ సంస్థలకు ఫిర్యాదు చేస్తామన్నారు. న్యాయస్థానాల తలుపు తడతామన్నారు. కేటీఆర్ ను జైల్లో పెట్టే వరకు పోరాడతామన్నారు. బీఆర్ఎస్ ను ప్రజలు బొంద పెట్టే రోజు దగ్గర్లోనే ఉందని రేవంత్ అన్నారు. పరిపాలన భవనంలోకి ఎంపీకి అనుమతి ఎందుకని ప్రశ్నించారు. కిలోమీటర్ దూరంలోనే నన్ను అడ్డుకున్నారని, కనీసం గేటు వరకు కూడా రానివ్వలేదన్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మొత్తం టెండర్లపై విచారణ చేయిస్తామన్నారు.

తదుపరి వ్యాసం