తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి ఉద్యోగం నీకే, దివ్యాంగురాలికి రేవంత్ రెడ్డి గ్యారంటీ రసీదు

Revanth Reddy : కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి ఉద్యోగం నీకే, దివ్యాంగురాలికి రేవంత్ రెడ్డి గ్యారంటీ రసీదు

HT Telugu Desk HT Telugu

17 October 2023, 22:19 IST

google News
    • Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి ఉద్యోగం నీకేనంటూ ఓ దివ్యాంగురాలకి రేవంత్ రెడ్డి హామీఇచ్చారు. ఈ మేరకు ఆమెకు కాంగ్రెస్ గ్యారంటీ రశీదు అందించారు.
దివ్యాంగురాల రజినికి రసీదు అందిస్తున్న రేవంత్ రెడ్డి
దివ్యాంగురాల రజినికి రసీదు అందిస్తున్న రేవంత్ రెడ్డి

దివ్యాంగురాల రజినికి రసీదు అందిస్తున్న రేవంత్ రెడ్డి

Revanth Reddy : తెలంగాణలో డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకార సభ ఉంటుందని ఆ సభకు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ వస్తారని ఆ సభలోనే మొదటి ఉద్యోగం నీకేనంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాంపల్లికి చెందిన ఓ దివ్యాంగురాలికి హామీనిచ్చారు. కాగా నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజిని రెండేళ్ల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వెతుకుతోంది. పీజీ చేసిన తనకు ఇటు ప్రభుత్వంలోనూ అటు ప్రైవేటులోనూ ఉద్యోగం రాలేదని తన బాధను గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డిని కలిసి చెప్పుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి ఉద్యోగం దివ్యాంగురాలైన రజినికే ఇస్తామని ఆయన హామీనిచ్చారు. ఈ మేరకు ఆమె వివరాలు తీసుకుని ఆమెకు కాంగ్రెస్ గ్యారంటీ రశీదును అందచేశారు.

కాంగ్రెస్ ధీమా

ఈసారి ఎన్నికల్లో విజయం తమదేనని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2018తో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత బలపడిందని నేతలు చెపుతున్నారు. పలు సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఉన్నట్లు చెప్పడంతో... నాయకుల నమ్మకం మరింత పెరిగింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ హైకమాండ్ కూడా మిగతా రాష్ట్రాల కన్నా కూడా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం ఇస్తూ ఉంది. ఒకపక్క పలువురు అసంతృప్తి నేతలు పార్టీకి రాజీనామాలు చేస్తున్నా మరోపక్క పార్టీలో చేరికల సంఖ్య కూడా అదే స్థాయిలో కొనసాగుతుందంటున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని నేతలు చెబుతున్నారు.

మునుగోడు ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ రూ.300 కోట్ల మద్యం పంచింది- రేవంత్ రెడ్డి

మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు కాంగ్రెస్ పార్టీపై, తనపై అన్నీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మైక్ అందుకున్న ప్రతీసారి హరీశ్ రావు, కేటీఆర్ లు కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న నిరాధారమైన విమర్శలు తగవని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మందు, డబ్బు పంచి ఎన్నికలో గెలిచేందుకు ప్రయత్నిస్తుందని తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్, మునుగోడు ఉపఎన్నికల్లో ఎవరు మద్యం, డబ్బు లెక్కలేనంత పంచారో ప్రజలకు తెలుసన్నారు. బీజేపీ, బీఅర్ఎస్ పోటీ పడి మరి మద్యం పంచారని రేవంత్ ఆరోపించారు. నెల రోజుల్లో సగటున రూ.60 కోట్ల మద్యం విక్రయం జరుగుతే ఒక్క మునుగోడు ఉపఎన్నికలో 30 రోజుల వ్యవధిలోనే సుమారు రూ.300 కోట్ల మద్యాన్ని పంచరాని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎన్నికల్లో చుక్క మందు, రూపాయి డబ్బు పెంచలేదని అయన స్పష్టం చేశారు. దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నిక హుజూరాబాద్ ఉప ఎన్నిక అని గుర్తు చేశారు.

కేసీఆర్ ఎన్నికల్లో మద్యం, డబ్బును మాత్రమే నమ్ముకున్నాడు

సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చుక్క మందు, రూపాయి డబ్బు పంచకుండా కేసీఆర్ గెలవాలని రేవంత్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చిన ఆరు గ్యారంటీలతోనే తాము ప్రజలను ఓట్లు అడుగుతామని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో చుక్క మందు, రూపాయి డబ్బు పంచనని కేసీఆర్ అమరల విరుల స్థూపం వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమరవీరుల స్థూపం వద్దకు వచ్చిన తనకు కేసీఆర్ భయపడి అరెస్ట్ చేపించారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఎన్నికల్లో కేవలం మద్యం, డబ్బును మాత్రమే నమ్ముకున్నారని ఆరోపించారు.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

తదుపరి వ్యాసం