Hyderabad Crime : బైక్ పై లిఫ్ట్ ఇచ్చి యువతిపై లైంగికదాడి, తప్పించుకొనే క్రమంలో లారీ కింద పడి!
03 July 2023, 19:54 IST
- Hyderabad Crime : తన చిన్నారికి పాలడబ్బా కోసం బయటకు వచ్చిన యువతిపై ఓ రాక్షసుడు కన్నేశాడు. బైక్ పై లిఫ్ట్ ఇస్తానని నమ్మించి బలాత్కారం చేయబోయాడు. అతడి నుంచి తప్పించుకునే క్రమంలో టిప్పర్ కింద పడింది యువతి.
యువతిపై లైంగిక దాడి
Hyderabad Crime : మహిళలు, చిన్నారులపై కామాంధుల దాడులు ఆగడంలేదు. హైదరాబాద్ లో మరో దారుణ ఘటన జరిగింది. లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఓ యువతి బైక్ పై ఎక్కించుకున్న ఓ నీచుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ రాక్షసుడి నుంచి తప్పించుకునే క్రమంలో యువతి లారీ కింద పడింది. ప్రస్తుతం ఆ యువతి ప్రాణాల కోసం పోరాడుతోంది. హైదరాబాద్ తార్నాకలో ఓ యువతి తన చిన్నారికి పాలడబ్బా కోసం బయటకు వెళ్లింది. అయితే మెడికల్ షాప్ మూసి ఉండటంతో ఆటో కోసం రోడ్డుపై ఎదురుచూస్తుంది. ఇంతలో శ్రీధర్ అనే యువకుడు బైక్ పై ఆమె వద్దకు వచ్చి... మెడికల్ షాపు ముందే ఉందని చెప్పి నమ్మించి...అక్కడి వరకూ లిఫ్ట్ ఇస్తానని బైక్ ఎక్కించుకున్నాడు. అతడి మాయమాటలు నమ్మిన యువతి బైక్ పై ఎక్కింది. తార్నాక సల్మాన్ హోటల్ సమీపంలో శ్రీధర్ యువతిపై లైంగిక దాడికి యత్నించాడు. అతడి నుంచి తప్పించుకునే క్రమంలో యువతి కింద పడింది. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఆమెపై నుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువతిని ఆసుపత్రికి తరలించారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు శ్రీధర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని బాధిత యువతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం
కరీంనగర్ పట్టణంలో ఇటీవల పదో తరగతి విద్యార్థినిపై సహ విద్యార్ధులు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం వెలుగుచూసింది. మొదట ఓ విద్యార్థితో సన్నిహితంగా ఉన్న వీడియోలను రికార్డు చేసిన సహ విద్యా్ర్థులు, వాటితో ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అవే వీడియోలు చూపించి ఆమె లొంగ దీసుకునేందుకు మరో ముగ్గురు ప్రయత్నించారు. ఈ ఘటనలో ఆరుగురిపై పోక్సో కేసు నమోదు చేశారు. ప్రియుడితో పదో తరగతి చదివే బాలిక సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసిన అతని స్నేహితులు, ఆపై వాటిని చూపి ఆమెను బెదిరించి వేర్వేరు సందర్భాల్లో అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకే కాలనీలో నివసించే బాలికతో అదే ప్రాంతంలో ఇంటర్ చదువుతున్న బాలుడు సన్నిహితంగా ఉంటున్నాడు. ఇద్దరూ ప్రేమ పేరుతో దగ్గరయ్యారు.
ఏడాది కిందట ఓ సందర్భంలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో, ఫొటోలను బాలుడి స్నేహితులు ఇద్దరు రహస్యంగా చిత్రీకరించారు. వాటిని ఆమెకు చూపించి, తల్లిదండ్రులకు చెబుతామని బెదిరించి బాలికను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ వీడియోలను షేర్ చేయడంతో వారి స్నేహితులైన మరో ముగ్గురు కూడా బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. మూడు రోజుల కిందట ఈ విషయం షీటీమ్ దృష్టికి వెళ్లడంతో వారు. అఘాయిత్యానికి పాల్పడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలి పెట్టారు. కేసు నమోదు చేయకుండా విషయాన్ని రహస్యంగా ఉంచారు. సోమవారం బాలిక తల్లిదండ్రులతో కలిసి నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆమె ప్రేమికుడితో కలిపి ఆరుగురిపై పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదు చేశారు.