BRS Mla Attacked BJP Leader : బీజేపీ అభ్యర్థి గొంతు పట్టుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే, చర్చా కార్యక్రమంలో రసాభాస!
25 October 2023, 21:41 IST
- BRS Mla Attacked BJP Leader : తెలంగాణ ఎన్నికల ప్రచారాలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయి. ఓ చర్చా కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ అభ్యర్థి గొంతు పట్టుకున్నారు.
కూన శ్రీశైలం గౌడ్ గొంతు పట్టుకున్న కేపీ వివేకానంద
BRS Mla Attacked BJP Leader : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు వాడీవేడిగా సాగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేస్తున్నారు. తాజాగా కుత్బుల్లాపూర్ లో ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన సభలో అభ్యర్థుల మధ్య మాటల యుద్ధం ఘర్షణకు దారితీసింది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులతో న్యూస్ ఛానల్ చర్చా కార్యక్రమం ఏర్పాటుచేసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ భూకబ్జా ఆరోపణలు చేసుకున్నారు. ఈ ఆరోపణలు తీవ్రమై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద సహనం కోల్పోయి శ్రీశైలంగౌడ్ మీదకు దూసుకెళ్లారు. శ్రీశైలంగౌడ్ గొంతు పట్టుకున్నారు. దీంతో అక్కడున్న పోలీసులు వారిని వారించారు. దీంతో చర్చా కార్యక్రమం రసాభాసగా మారింది. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలు కూర్చీలు విసురుకున్నారు. పోలీసులు వారిని నిలువరించారు.
దాడిని ఖండించిన బీజేపీ
కూన శ్రీశైలం గౌడ్ పై దాడిని బీజేపీ ఖండించింది. బీఆర్ఎస్ నేతలకు ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు. ఓటమి భయంతో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రత్యక్షదాడులకు దిగుతున్నారని ఆరోపిస్తూ కేవీ వివేకానంద, శ్రీశైలం గౌడ్ పై దాడి చేసిన వీడియోను ట్వీట్ చేసింది. కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గొంతు నొక్కుతూ భౌతికదాడి చేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదన్నారు. బీఆర్ఎస్ నాయకుల అహంకారానికి ఇది పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.