తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Frauds : అప్పు ఇస్తామని ఒకరు… బిట్ కాయిన్ పేరుతో ఇంకరు… జనాలకు టోపీ…

Hyderabad Frauds : అప్పు ఇస్తామని ఒకరు… బిట్ కాయిన్ పేరుతో ఇంకరు… జనాలకు టోపీ…

HT Telugu Desk HT Telugu

16 February 2023, 9:23 IST

google News
    • Hyderabad Frauds  అప్పులిస్తామంటూ వ్యాపారుల్ని మోసం చేయడానికి ప్రయత్నించిన ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.  ట్రంకు పెట్టెల్లో  థర్మాకోల్ షీట్స్‌ పేర్చి నగదుగా మభ్య పెట్టేందుకు ప్రయత్నించిన నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.మరో ఘటనలో బిట్‌ కాయిన్‌లో నాలుగు రెట్ల లాభాలంటూ జనం నుంచి లక్షలాది రుపాయలు దండుకున్న ముఠాపై కేసు నమోదైంది. 
ట్రంకు పెట్టెల్లో నగదు అంటూ మోసాలు
ట్రంకు పెట్టెల్లో నగదు అంటూ మోసాలు

ట్రంకు పెట్టెల్లో నగదు అంటూ మోసాలు

Hyderabad Frauds భారీ మొత్తాలను అప్పుగా ఇస్తామంటూ మోసం చేసేందుకు ప్రయత్నించిన ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు ట్రంకు పెట్టెల్లో థర్మాకోల్‌ షీట్లు పేర్చి పైన నగదు ఉంచి మోసం చేసేందుకు యత్నించడం చూసి పోలీసులు ఖంగుతిన్నారు.

పెద్ద మొత్తంలో అప్పులు ఇస్తామంటూ వ్యాపారుల్ని, అమాయకుల్ని ఆకర్షించి, అప్పు కోసం వచ్చిన వారి దృష్టి మరల్చి మోసాలకు పాల్పడుతున్న ముఠాగా ఎల్బీనగర్‌ పోలీసులు చెబుతున్నారు. నిందితుల నుంచి రూ. 1.23 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని పుణెకు చెందిన వైభవ్‌, రాజేష్‌ ఉత్తమ్‌ చందానీలు వ్యాపారం చేస్తుంటారు. ఇటీవల వీరికి డబ్బు అవసరం రావడంతో హైదరాబాద్‌లో స్థిరపడిన తమ స్నేహితుడు నీలేష్‌ను సంప్రదించారు.

మన్సూరాబాద్‌ సమీపంలోని సాయి సప్తగిరి కాలనీలో 6 శాతం వడ్డీతో అప్పు ఇస్తారని తెలియడంతో, వారు నగరానికి వచ్చారు. అనంతరం ఓ ఇంట్లో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్న వారిని కలిశారు. ఫైనాన్స్‌ వ్యాపారుల్లో మెదక్‌కు చెందిన శ్రీనివాస్‌..పుణెకు చెందిన వ్యక్తులతో హిందీలో మాట్లాడాడు.

రూ.2 కోట్లు అప్పు కావాలని వ్యాపారులు కోరడంతో మొదట రూ.20 లక్షలే ఇస్తామని, నమ్మకం కుదిరేందుకు నెలరోజుల్లో మరో రూ.20 లక్షలు కలిపి ఇవ్వాలని చెప్పారు. డబ్బులు ఇచ్చిన తర్వాతే రూ.2 కోట్లు ఇస్తామని వ్యాపారుల్ని నమ్మించేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో ఇంటి యజమాని శంకరమ్మ ఇంట్లోని రెండు భారీ ట్రంకు పెట్టెలు తెరిచి అందులో పేర్చిన నోట్ల కట్టలను దూరం నుంచే చూపించారు. వందల కోట్లు తమ వద్ద ఉన్నాయని నమ్మబలికారు. వారిప్రవర్తన అనుమానించిన పూణే వ్యాపారులు ఎల్బీనగర్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. వ్యాపారులు ఇచ్చిన సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆ ఇంటిపై దాడిచేశారు.

వ్యాపారులకు చూపించిన ట్రంకుపెట్టెలు తెరిచి చూడటంతో పైన మాత్రమే అసలైన నోట్లు పేర్చి ఉంచి, కిందిభాగంలో థర్మాకోల్‌ షీట్లు పెట్టారు. దీంతో శ్రీనివాస్‌, శంకరమ్మతోపాటు మెదక్‌కు చెందిన రమేష్‌, రాములు, కొంపల్లికి చెందిన నాగయ్య, నిజామాబాద్‌కు చెందిన భోజన్న, మన్సూరాబాద్‌లో వాసులు రవి, సుంకమ్మ, దుర్గప్పలను అరెస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బోర్డు తిప్పేసిన బిట్ కాయిన్ సంస్థ

బిట్‌ కాయిన్ లాభాలంటూ భారీ మోసం…

లక్షకు నాలుగు రెట్లు లాభాలంటూ అమాయకుల్ని నిండా ముంచిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. బాధితుల్ని ఫోన్లు చేసి ఉద్యోగం ఇస్తామని పిలిచారని, ఫీల్డ్‌ వర్క్‌ ఉండదు ఆఫీస్‌లో కూర్చునే ఉద్యోగమని నమ్మించి నిండా ముంచారని వాపోతున్నారు.

మొదట ఉద్యోగాలని ఆహ్వానించి తర్వాత పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ అమాయక ప్రజల్న నిలువున దోచేశారు. ఉద్యోగం పేరుతో సంస్థలో చేరిన తర్వాత పెట్టుబడులు పెడితే నాలుగింతలు లాభం ఇస్తామని బుట్టలో వేసుకున్నారని లబోదిబో మంటున్నారు. చివరకు లక్షల్లో నొక్కేసి జనాలకు కుచ్చుటోపీ పెట్టారు.

హైదరాబాద్‌ కేపీహెచ్‌బీలో మంజీరా ట్రినిటి కార్పొరేట్‌ భవనంలోని 11వ అంతస్తులో ఎక్స్‌సీఎస్‌పీఎల్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ పేరిట పలువురు కలిసి కంపెనీ పెట్టారు. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఫోన్లు చేసి తమ కంపెనీలో ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో పాటు ఏడాదికి రూ.3.75లక్షల ప్యాకేజీ ఇస్తామని పలువురిని నమ్మించారు.

ఉద్యోగంలో చేరిన తర్వాత శిక్షణ ఇస్తామని ఆకర్షించారు. కంపెనీలో బిట్ కాయిన్లలో పెట్టుబడి పెడితే అంతకు నాలుగింతలు లాభం ఇస్తామని నమ్మబలికారు. 9 ప్రాజెక్టులలో పెట్టుబడి పెడితే భారీ లాభం ఇస్తామని ఆకర్షించారు. ఉద్యోగాల్లో చేర్చుకున్న వారితోనే పెట్టుబడులు పెట్టించారు. రూ.లక్షకు .. నాలుగు లక్షలు ఇస్తామని ఆశ చూపారు.

పెట్టిన పెట్టుబడులతో పాటు లాభం గురించి ఉద్యోగంలో చేరిన వారు అడుతున్నా సమాధానం ఇవ్వట్లేదు. దీంతో ఓ యువతి గతేడాది నవంబరులో పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది. భారీగా ఆదాయం వస్తుందనే నమ్మకంతో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన వారంతా సంస్థ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

తదుపరి వ్యాసం