Gaddar : కలం పట్టి గళం విప్పి, ప్రజల వేదనలను పాటలుగా మార్చిన గద్దర్
06 August 2023, 17:27 IST
- Gaddar : శరీరంలో బుల్లెట్ ఉన్నా ఏనాడూ ప్రజాఉద్యమంలో వెనకడుగు వేయలేదు గద్దర్. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన గళంతో వేలాది గుండెలను చైతన్యంచేశారు.
గద్దర్
Gaddar : ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరు వింటే నరాలు ఉప్పొంగుతాయి. ఆయన పాటలతో రోమాలు నిక్కపొడుస్తాయి. సమ సమాజ స్థాపన కోసం ఆయుధాలు పట్టినా, ప్రజా ఉద్యమంలో కలం పట్టి గళం విప్పినా ఆయనకే చెందుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బండెన్క బండి గట్టి కట్టి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలంలా పోరు బాట పట్టారు. తన పాటలతో ప్రజలను చైతన్యం చేసి పోరు తెలంగాణలో సైనికులను చేశారు.
తుపాకీ తూటాల్లాంటి పాటలు
తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధించాలన్న లక్ష్యంతో పీపుల్స్ వార్ లో పనిచేసిన గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్... తుపాకీ తూటాల్లాంటి మాటలతో, ప్రవాహం లాంటి పాటలతో తెలంగాణ యువతను ఉద్యమబాట పట్టించారు. అనంతరం సాయుధ విప్లవానికి స్వస్తి చెప్పి ప్రజా ఉద్యమంలో దూకారు గద్దర్. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటలతో యువతను చైతన్యవంతులు చేసి ఉద్యమంలో చేరేలా చేశారు. తెలంగాణ ఉద్యమానికి మావోయిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో... గద్దర్ కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. టీఆర్ఎస్ రాజకీయ పోరాటాలకు గద్దర్ ప్రత్యామ్నాయ రాజకీయ పోరాటాలు చేసి ఉద్యమ వేడి చల్లారకుండా పనిచేశారు.
వేలాది గుండెల్లో చైతన్యం
గద్దర్ పాట పాడితే వేలాది గుండెలు చైతన్యవంతమవుతాయి. నేను సైతం అంటూ ప్రజాయుద్ధక్షేత్రంలోకి వచ్చిన ఆయనను ‘ప్రజాయుద్ధనౌక’ అని పిలుస్తారు. గద్దర్ గాయకుడు, రచయిత. ప్రజల వేదనలను పాటలుగా మార్చి గళం విప్పుతారు. ఆయన పాటలు ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటాయి. పాలకుల దోపిడీని ప్రశ్నించాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు పీడిత ప్రజల వేదనను కళ్లకు కట్టాయి. 1997లో గద్దర్‌పై కాల్పులు జరిగాయి. ఆయన వెన్నులో బుల్లెట్ ఇరుక్కుపోయింది. ఈ బుల్లెట్ ను తన శరీరంలో ఉన్నా ఆయన వెనుకంజ వేయలేదు. తుదిశ్వాస వరకు గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలపై పోరు సాగించారు. తెలంగాణ ఆవిర్భావంతో గద్దర్ తన మార్గాన్ని మార్చుకున్నారు. విప్లవ రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన గద్దర్... ప్రజాస్వామ్య పంథాలోకి అడుగుపెట్టారు. గద్దర్ కొడుకు సూర్య కిరణ్ రాజకీయాల్లో ఉన్నారు. ఇటీవలె సూర్య కిరణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
గద్దర్ పై కాల్పులు
1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా గద్దర్ పోరాడారు. జన నాట్య మండలిలో చేరి.... ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథలతో గ్రామీణ ప్రజల్లో చైతన్యం కలిగించారు. గద్దర్ పాడే పాటల్లో దళిత పేదలు అనుభవిస్తున్న కష్ట, నష్టాలు కళ్లకు కట్టినట్టుగా ఉంటాయి. పాటలు, నాటకాల రూపంలో ప్రజా సమస్యలపై పోరుసాగించారు. మర్రి చెన్నారెడ్డి రెండవసారి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నక్సలైట్స్ పై నిషేధం ఎత్తివేశారు. 1990 ఫిబ్రవరి 18న జన నాట్య మండలి ఆధ్వర్యంలో గద్దర్ హైదరాబాద్ లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు 2 లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యారు. 1997 ఏప్రిల్ 6న గద్దర్ పై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన శరీరంలోకి అనేక బుల్లెట్లు దూసుకెళ్లాయి. అన్ని బులెట్లు తొలగించినా... ఒక్క బుల్లెట్ ను మాత్రం డాక్టర్ లు తొలగించలేదు. అది తొలగిస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదమని దానిని వదిలేశారు. 2002లో ప్రభుత్వంతో చర్చల సమయంలో నక్సలైట్స్... గద్దర్, వరవరరావులను తమ తరఫున పంపారు. నకిలీ ఎన్ కౌంటర్లను గద్దర్ తీవ్రంగా నిరసించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో గద్దర్ మరోసారి వెనుకబడిన కులాలు, నిమ్న కులాల ఉద్ధరణ ఉద్దేశంతో ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన మద్దతును తెలిపారు. బలమైన కమ్యూనిస్ట్ భావజాలం ఉన్నప్పటికీ, అతను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించే కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలను వ్యతిరేకించారు.