Ayodhya Ram Mandir : అయోధ్య శ్రీరాముడికి హైదరాబాద్ నుంచి బంగారు పాదుకలు
01 January 2024, 21:41 IST
- Ayodhya Ram Mandir : అయోధ్య శ్రీ రాముడికి హైదరాబాద్ నుంచి అపురూపమైన కానుకలు అందనున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఓ దాత అయోధ్య రాముడికి రెండు జతల బంగారు పాదుకలను అందజేయనున్నారు.
బంగారు పాదుకలు
Ayodhya Ram Mandir : శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మరి కొన్ని రోజుల్లో రామమందిరాన్ని భక్తుల దర్శనానికి అందుబాటులోకి రానుంది. అయితే ఆ అయోధ్య రాముడికి హైదరాబాద్ నగరం అపురూపమైన కానుకలు అందిస్తుంది. రామ మందిరం దర్శించుకునే భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా హైదరాబాద్ శిల్పులు తమ వంతు కృషి చేస్తున్నారు. ఇప్పటికే అయోధ్య రామాలయానికి 118 దర్వాజాలు హైదరాబాద్ బోయిన్ పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకుంటున్నాయి. తాజాగా రాముడికి రెండు జతల బంగారు పాదుకలు కూడా హైదరాబాద్ నుంచే వెళ్తున్నాయి.
సీఎం యోగికి పాదుకలు అందజేత
శ్రీరాముడికి సుమారు రూ 1.03 కోట్ల విలువైన బంగారు పాదుకలను హైదరాబాద్ నగరానికి చెందిన అయోధ్య భాగ్య నగర సీతారామ ఫౌండేషన్ అందిస్తుంది. కాగా ఇప్పటికే ఒక జత పాదుకలను భక్తులు పాదయాత్రగా తీసుకెళుతున్నారు. వెండి పైన బంగారం తాపడంతో 13 కేజీల బరువుతో రూపుదిద్దుకున్న ఈ రెండో జత పాదుకలను పాత బోయిన్ పల్లి లోని మద్విరాట్ కలకుటిర్ లో తయారు చేశామని ఫౌండేషన్ డైరెక్టర్ చల్ల శ్రీనివాస్ శాస్త్రి పేర్కొన్నారు. ఇక ఈ పాదుకలను 25 రోజుల పాటు శ్రమించి శిల్పులు ఎంతో వైవిధ్యంగా రూపొందించారు. ఈనెల 10 నుంచి 15 మధ్యలో రెండు జతల పాదకులను ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అందించనున్నారు.
10 వేల మందికి అన్నదానం చేస్తా- చల్ల శ్రీనివాస్ శాస్త్రి
రాముడి పాదుకల దాత చల్ల శ్రీనివాస్ శాస్త్రి మాట్లాడుతూ...." నేను సినిమాలో సౌండ్ ఇంజినీర్ గా చేశాను. శ్రీ రాముడికి ఈ రూపంలో సేవ చేసే అదృష్టం నాకు దక్కింది. రామ మందిరం నిర్మాణం ప్రారంభం రోజు నుంచి నేను నా పూర్తి సమయం రాముడికే అంకితం ఇచ్చాను. నేను అయోధ్య రాముడి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం కిలో మీటర్ల దూరంలో సుమారు 10 వేల మందికి అన్నదానం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నా. అన్నీ రకాల తెలంగాణ వంటకాలు అక్కడ ఉంటాయి" అని ఆయన తెలిపారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా