తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc : కొత్త ఉద్యోగాల భర్తీకి సహకారం, టీఎస్పీఎస్సీకి రూ.40 కోట్ల నిధులు విడుదల

TSPSC : కొత్త ఉద్యోగాల భర్తీకి సహకారం, టీఎస్పీఎస్సీకి రూ.40 కోట్ల నిధులు విడుదల

HT Telugu Desk HT Telugu

07 February 2024, 21:44 IST

google News
    • TSPSC : టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేపట్టిన ప్రభుత్వం..ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేయాలని సూచించింది. ఉద్యోగాల భర్తీ, ఇతర అవసరాల నేపథ్యంలో టీఎస్పీఎస్సీకి రూ.40 కోట్ల నిధులు విడుదల చేసింది.
టీఎస్పీఎస్సీకి రూ.40 కోట్ల నిధులు విడుదల
టీఎస్పీఎస్సీకి రూ.40 కోట్ల నిధులు విడుదల

టీఎస్పీఎస్సీకి రూ.40 కోట్ల నిధులు విడుదల

TSPSC : గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) లో జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకొని మరోసారి అలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టీస్పీఎస్సీలోని లోపాలను సరిదిద్దుకునేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన సమర్థవంతంగా చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే కొత్తగా కమిటీనీ ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్, సభ్యులను ప్రభుత్వం ఇటీవలే నియమించింది. కాగా ప్రస్తుతం కొత్తగా ఏర్పడ్డ టీఎస్పీఎస్సీ కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలను సేకరించే పనిలో పడింది.

టీఎస్పీఎస్సీకి రూ.40 కోట్ల నిధులు

రాష్ట్రంలోని ఖాళీల పూర్తి వివరాలు అందాక కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగానే టీఎస్పీఎస్సీకి తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బడ్జెట్ కేటాయింపుల నుంచి రూ. 40 కోట్లు నిధులు టిఎస్పీఎస్సీకు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నిధులు టీఎస్పీఎస్సీ అవసరాలతో పాటు కొత్త ఉద్యోగాల భర్తీకి సహకారం కానున్నాయి. నిధులు ఇవ్వాలని టీఎస్పీఎస్సీ గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నా..... సంస్థ పూర్తి ప్రక్షాళన అనంతరం నిధులు విడుదల చేయాలని భావించి ప్రక్షాళన అనంతరం నిధులను విడుదల చేసింది ప్రభుత్వం.

గ్రూప్ -2,3 పోస్టులు కూడా పెంపు?

గత ప్రభుత్వ హయాంలో టీఎస్పీఎస్సీలో జరిగిన అవకతవకల వల్ల నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురై ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపడంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మళ్లీ ఆ పొరపాట్లు జరగకుండా నిరుద్యోగులకు తమ ప్రభుత్వంపై నమ్మకం కుదిరెలా కొత్త ఉద్యోగుల భర్తీకి అంతా సిద్ధం చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. అది కూడా లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విలువడే లోపే జరగాలని సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే గతంలో రద్దైన గ్రూప్ -1 నోటిఫికేషన్ కొత్తగా చేర్చిన 60 పోస్టులతో కలిపి రీ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటు గత ప్రభుత్వం హయంలో వెలువడిన గ్రూప్ 2 , గ్రూప్ 3 నోటిఫికేషన్ కూడా రద్దు చేసి వాటికి కొన్ని కొత్త పోస్టులు కలిపి రీ-నోటిఫికేషన్ విడుదల చేసే యోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే గత ఏడాది గ్రూప్ -4 నోటిఫికేషన్ కు సంబంధించి ఫింగర్ ప్రింట్ తీసుకోకపోవడం, పరీక్ష నిర్వహించడంలో లోపాలు సహా కొన్ని వివాదాలు నేపథ్యంలో..... నోటిఫికేషన్ రద్దు చేయాలా లేక ఫలితాలు వెల్లడించాలనే సందిగ్ధంలో టీఎస్పీఎస్సీ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఏదో ఒక రూపంలో శుభవార్త చెప్పాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుంది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం