తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Governor Tamilisai : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎన్నిక, తమిళి సై సంచలన నిర్ణయం

Governor Tamilisai : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల ఎన్నిక, తమిళి సై సంచలన నిర్ణయం

17 January 2024, 21:38 IST

google News
    • Governor Tamilisai : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై తమిళి సై సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో వివాదం తేలే వరకు ప్రభుత్వ ప్రతిపాదనలు తీసుకోవద్దని నిర్ణయించుకున్నారు.
గవర్నర్ తమిళి సై
గవర్నర్ తమిళి సై

గవర్నర్ తమిళి సై

Governor Tamilisai : తెలంగాణ గవర్నర్‌ తమిళిి సై కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికపై హైకోర్టులో వివాదం తేలే వరకు రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని తమిళి సై నిర్ణయించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ పేర్లను ప్రతిపాదించింది. ఆ ఇద్దరికీ గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేసేందుకు తగిన అర్హతలు లేవని అప్పట్లో తమిళి సై తిరస్కరించారు. దీంతో ఆ ఇద్దరు అభ్యర్థులు గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై ఈ నెల 24న హైకోర్టు విచారించనుంది.

ఎలాంటి ప్రతిపాదనను తీసుకోవద్దు

అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్... గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంది. గవర్నర్‌ సూచించిన అర్హతలకు అనుగుణంగా ఇద్దరి పేర్లను కేబినెట్‌ ద్వారా ప్రతిపాదించాలని భావిస్తుంది. ఈ సమయంలో గవర్నర్‌ తమిళి సై సంచలన నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనను తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి. హైకోర్టు తీర్పును బట్టి నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గవర్నర్ కు తిరస్కరించే హక్కులేదు

గవర్నర్‌ తన పరిధి దాటి వ్యవహరించారని, కేబినెట్ కు ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌పై ఇటీవల జరిగిన విచారణలో శ్రవణ్, సత్యనారాయణ తరుపు న్యాయవాదులు వాద‌న‌లు వినిపిస్తూ... ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ తిరస్కరించేందుకు వీలు లేదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ అడ్డుకోలేరంటూ వాదించారు. ఆర్టికల్ 361 ప్రకారం పిటిషనర్ల పిటిషన్‌కు అర్హత లేదంటూ గవర్నర్ తరఫున కౌన్సిల్ కోర్టుకు తెలిపింది. ఇరుపక్షాల వాద‌న‌లు విన్న హైకోర్టు ఈ పిటిషన్ల అర్హత‌పై వాద‌న‌లు వింటామంటూ తదుపరి విచారణ జనవరి 24కు వాయిదా వేసింది.

ఏడాదిగా ఖాళీ

గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ప్రొ.కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేయాలని భావిస్తుంది. గవర్నర్ సూచించిన అర్హతలకు తగిన విధంగా వీరిద్దరి పేర్లను ఎంపిక చేసినట్లు తెలిసింది. అయితే హైకోర్టులో ఈ వివాదం తేలే వరకూ ఎలాంటి సిఫార్సులు అంగీకరించేది లేదని గవర్నర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పరోక్షంగా తేల్చిచెప్పారు. దీంతో ఆ రెండు ఎమ్మెల్సీల భర్తీ ఇప్పట్లో ఉండదని స్పష్టం అవుతోంది. కోర్టులో కేసు తేలేవరకు భర్తీ చేసే అవకాశం లేదు. ఇప్పటికే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఏడాది నుంచీ ఖాళీగా ఉన్నాయి.

గవర్నర్ తమిళిసై నిర్ణయంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. హైకోర్టు తీర్పు వచ్చే వరకు ఆగుతుందా? లేదా మార్గం అనుసరిస్తుందా? తెలియాల్సి ఉంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి నేతలు సిద్దమవుతున్న సమయంలో గవర్నర్ బ్రేక్ వేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

తదుపరి వ్యాసం