TS Liquor Rates : మందుబాబులకు ఊరట, మద్యం ధరలపై మంత్రి జూపల్లి కీలక ప్రకటన
23 January 2024, 14:47 IST
- TS Liquor Rates : మద్యం ధరలను పెంచి ప్రజలపై భారం వేయాలన్న ప్రభుత్వానికి లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ధరలు పెంచకుండానే ఆదాయాన్ని పెంచే మార్గాలను ఆన్వేషించాలని అధికారులను ఆదేశించారు.
మద్యం ధరలు
TS Liquor Rates : రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చే విభాగాల్లో కీలకమైన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పై ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సమీక్ష నిర్వహించారు. మద్యం ధరలను పెంచకుండానే ఆ శాఖ ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావుతో కలిసి రివ్యూ చేశారు. మద్యం ధరలను పెంచి ప్రజలపై భారం వేయాలని ఆలోచన లేదని ఎక్సెస్ అధికారులకు డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ఎలాంటి లికేజీలకు తావు లేకుండా రెవెన్యూ వసూళ్ల వ్యవస్థను పటిష్టం చేయాలన్నారు. ఎలైట్ బార్ షాపులను ఏర్పాటు చేయడానికి ఏకీకృత విధానం ఉండేలా పకడ్బందీ వ్యవస్థను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
డ్రగ్స్ మహమ్మారిని లేకుండా చేయాలి- భట్టి
మరోవైపు రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి లేకుండా చేయాలని ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తున్నందున తనిఖీలు ముమ్మరంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందుకోసం ఎక్సైజ్ శాఖతో పాటు పోలీసులు, పౌర సంబంధాల శాఖ సిబ్బందితో మల్టీ డైమెన్షనల్ టీం వ్యవస్థను నెలకొల్పాలని సూచించారు. డ్రగ్స్ రవాణా చేసేందుకు అనుసరిస్తున్న అడ్డదారులను అరికట్టడంతో పాటు పౌర సంబంధాల శాఖ ద్వారా ఆ వ్యసనంతో ఏర్పడే దుష్పరిణామాలపై వివిధ సెక్షన్ల ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించాలన్నారు. ఎందుకోసం ఉమ్మడిగా కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.ఎక్సైజ్ చెక్ పోస్టులను పటిష్టం చేసేలా, సొంత భవనాల్లోనే కార్యాలయాలు పనిచేసేలా పటిష్టమైన ప్రణాళిక రూపొందించాలని వీటికి అవసరమైన నిధులను రానున్న బడ్జెట్లో కేటాయించుకునేలా ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు.
టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలి- మంత్రి జూపల్లి
టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ......రాష్ట్రంలో అనేక ప్రాధాన్యత కలిగిన పర్యటన క్షేత్రాలు, కేంద్రాలు ఉన్నాయని కానీ ఇంతకాలం వాటిపై తగిన శ్రద్ధ పెట్టని కారణంగా ప్రపంచానికి పరిచయం చేయలేకపోయామన్నారు. నిర్దిష్టమైన మార్కెటింగ్ విధానాలను రూపొందించి, టూరిజం రంగాన్ని తీర్చిదిద్దాలని ఆ శాఖ ఆఫీసర్లకు సూచించారు. పురాతన కట్టడాలు, దేవస్థానాలు ఉన్న ప్రాంతంలో టెంపుల్ టూరిజాన్ని పెంచాలని ఆదేశించారు. ఏకో టూరిజం డెవలప్ చేయాలన్నారు. టూరిజం డిపార్ట్మెంట్ తో పాటు ఆర్టీసీ, ఫారెస్ట్, రవాణా ఇతర శాఖల సహకారాలు తీసుకోవాలన్నారు. సహజసిద్ధమైన పర్యాటక ప్రాంతాలు ఉన్న..... విస్తృత ప్రచారం కల్పించకపోవడంతో టూరిస్టులను ఆకర్షించలేకపోతున్నామని పేర్కొన్నారు. పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలను అభివృద్ధి చేసేలా సమగ్ర టూరిజం పాలసీని రూపొందించాలని అధికారులను సూచించారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేలా ఉండాలన్నారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా