Ayodhya Ram Mandir : అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట, హైదరాబాద్ లోనూ ఉత్సవాలు నిర్వహణ
21 January 2024, 19:33 IST
- Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా హైదరాబాద్ లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
అయోధ్య రామమందిరం
Ayodhya Ram Mandir : దేశం మొత్తం అయోధ్య వైపు చూస్తుంది. రేపు ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య రామాలయంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు అయోధ్య చేరుకుంటున్నారు. రేపటి ఘట్టానికి అయోధ్య నగరాన్ని ఎంతో సుందరంగా ముస్తాబు చేశారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా దేశ వ్యాప్తంగా రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చాలా రాష్ట్రాలు విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పూట సెలవు కూడా ప్రకటించారు. అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట సందర్భంగా హిందూ ధార్మిక సంఘాలు దేశ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా హైదరాబాద్ లో వేడుకలు నిర్వహించనున్నారు. కృష్ణ ధర్మపరిషత్ రాముడిపై భక్తిని చాటేలా హైదరాబాద్ లో ఘనంగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ విషయాన్ని కృష్ణ ధర్మ పరిషత్ అధ్యక్షుడు అభిషేక్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని భాగ్యనగరం నడిబొడ్డన చరిత్రలో నిలిచిపోయేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
హైదరాబాద్ నక్లెస్ రోడ్డులో భారీ కార్యక్రమం
ఈ నెల 22న కృష్ణ ధర్మపరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో అంబేడ్కర్ విగ్రహం వద్ద, ప్రసాద్ మల్టీప్లెక్స్ సమీపంలో భారీ కార్యక్రమానికి నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు, ఎంపీ కె.లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సోమవారం మధ్నాహ్నం 4 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని నిర్వాహకులు తెలిపారు. శ్రీరామ్ పూజతో కార్యక్రమానికి అంకురార్పణ చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పాల్గొనే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. భక్తులను పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో నిలిచిపోయేలా గణేష్, శ్రీరామ్, హనుమాన్ కీర్తనలు, పాటలతో భక్తిలహరి ఏర్పాటు చేశామన్నారు. దీంతో పాటు డాన్స్ ఆర్టిస్ట్ తో శ్రీరామచరిత్ర ప్రదర్శనకు నిర్ణయించామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా అయోధ్య ప్రత్యేకత, విశిష్ఠత వివరిస్తూ ఆకట్టుకొనే డాక్యుమెంటరీ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదే విధంగా మహాభారతం, పూరీ జగన్నాధ్ శాండ్ ఆర్టిస్ట్ షో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో హాజరయ్యే భక్తులను ఉద్దేశించి ఆల్ ఇండియా కృష్ణ ధర్మపరిషత్ నిర్వాహకుల ప్రసంగాలతో పాటుగా ఎంపీ కె. లక్ష్మణ్ మాట్లాడనున్నట్లు తెలిపారు.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు, అయోధ్యవాసులు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆలయం వద్ద సోమవారం ఉదయం నుంచే వివిధ కార్యక్రమాలు జరుగుతాయని తెలుస్తోంది. ఇక.. మోదీ అయోధ్యకు వెళ్లిన తర్వాత.. సోమవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట వరకు జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. వేద పండితులు, సంప్రదాయాలు, ఆచారాల మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం.. 7వేల మందితో కూడిన భారీ సభను ఉద్దేశించి ప్రసగిస్తారు ప్రధాని మోదీ.