Hyderabad News : కారుణ్య నియామకాల కోసం ఎనిమిదేళ్లుగా నిరీక్షణ, ప్రభుత్వం కనికరించాలని అభ్యర్థులు వేడుకోలు!
13 February 2024, 22:18 IST
- Hyderabad News : రాష్ట్రంలో కారుణ్య నియామకాల కోసం జిల్లా షరిషత్ అభ్యర్థులు ఎదురుచూస్తు్న్నారు. ఎనిమిది జిల్లాల్లో నియామకాలు ఇచ్చి మిగతా జిల్లాల్లో ఇవ్వకపోవడం... జిల్లాల నుంచి అభ్యర్థులు హైదరాబాద్ వచ్చి సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.
కారుణ్య నియామకాల కోసం అభ్యర్థుల నిరీక్షణ
Hyderabad News : తెలంగాణలో జిల్లాకో న్యాయం ఉంటుందా? అని కారుణ్య నియామక అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా అర్హతకు తగ్గ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నా ప్రభుత్వాలు తమ గోడు వినిపించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో జిల్లా పరిషత్ అభ్యర్థులకు కారుణ్య నియామకాలు ఇచ్చి మిగతా జిల్లాల్లోని అభ్యర్థులకు అన్యాయం చేశారని, దాదాపు 650 మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారని వాపోయారు. ప్రతి రోజూ హైదరాబాద్ లోని అధికారులు, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ తమ బాధను పట్టించుకోవట్లేదంటున్నారు. మంగళవారం ఉదయం 25 జిల్లాల నుంచి దాదాపు 60 మంది అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆయన రాక కోసం నిరీక్షించారు. ఆయన వద్దకు అధికారులు వెళ్లనివ్వకపోవడంతో సీఎం వ్యక్తిగత సహాయకుడికి వినతి పత్రం ఇచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అనంతరం ప్రజా దర్బార్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
ప్రత్యేక జీవోపై కసరత్తు ప్రారంభించండి
ఈ సందర్భంగా అభ్యర్థులు మట్లాడుతూ.. జిల్లా పరిషత్తులకు చెందిన కారుణ్య నియామక అభ్యర్థులకు తెలంగాణలో గత ఎనిమిదేళ్లుగా అర్హతకు తగ్గ ఉద్యోగాలివ్వలేదన్నారు. ఖాళీలు లేవనే సాకుతో డిగ్రీ ఆపై విద్యార్హత ఉన్నప్పటికీ.. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు తీసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. గత ప్రభుత్వం 79 జీవో ద్వారా.. 1266 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్ గ్రేడ్ చేసి రాష్ట్రంలోని వివిధ శాఖలకు చెందిన కారుణ్య నియామక అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చిందన్నారు. కానీ స్థానిక సంస్థలకు చెందిన అభ్యర్థులనే నెపంతో మమ్మల్ని మాత్రం పక్కన పెట్టిందని వాపోయారు. అయితే ఎనిమిది జిల్లాల్లో మాత్రం జిల్లా పరిషత్తు అభ్యర్థులకు సైతం ఉద్యోగాలిచ్చారన్నారు. మేము అధికారుల చుట్టూ తిరగడంతో మాకు సంబంధించి ప్రత్యేక జీవో తెచ్చేందుకు గత ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందన్నారు. అయితే మధ్యలో ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ అసంపూర్తిగా మిగిలిపోయిందని తెలిపారు. కొత్త ప్రభుత్వం వచ్చాక మంత్రి సీతక్క సహా పలువురు మంత్రులకు వినతి పత్రాలిచ్చామని, పీఆర్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సహా అధికారులందరికీ మా విషయంపై విన్నవించామన్నారు.
మాకు న్యాయం చేయండి
ముఖ్యమంత్రిని కలిసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి రెండు సార్లు ఆయన ఇంటి ముందు ఉదయం ఆరుగంటల నుంచే నిరీక్షించామని అభ్యర్థులు వాపోయారు. ప్రతి ప్రజావాణిలో మా బాధలపై వివరించామన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నామన్నారు. భర్తలను కోల్పోయిన భార్యలు, కుటుంబ పెద్దలను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన వారసులు, పెన్షన్ సైతం రాని వాళ్లం చాలా మంది ఉన్నామన్నారు. ఒకప్పుడు ఉన్నతంగా బతికి నేడు.. హీనమైన బతుకులను అనుభవిస్తున్నామని ఆవేదన చెందారు. ప్రభుత్వం మా జీవితాల్లో వెలుగులు నింపాలని, సీఎం రేవంత్ రెడ్డి మా భాధలు విని ఉద్యోగాలివ్వాలని వేడుకున్నారు. గత ప్రభుత్వం మధ్యలో వదిలేసిన జీవో కసరత్తును కొనసాగించి మాకంటూ ప్రత్యేక జీవో తేవాలని కోరారు. రాష్ర్టంలోని అన్ని శాఖల అభ్యర్థులకు న్యాయం చేసినట్లే, ఎనిమిది జిల్లాల్లోని జిల్లా పరిషత్ అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చినట్టే.. మాకు సైతం వెంటనే అర్హతకు తగిన ఉద్యోగాలివ్వాలని జిల్లా పరిషత్ అభ్యర్థులు వేడుకుంటున్నారు