Congress Mlcs : కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే, అద్దంకి దయాకర్ కు నో ఛాన్స్!
17 January 2024, 17:53 IST
- Congress Mlcs : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది.
మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్
Congress Mlcs : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థులను ప్రకటించింది. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఖరారు చేసింది. రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. రేపు ఉదయం 11 గంటలకు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ కు సంఖ్యాబలం ఉంది కాబట్టి రెండు ఎమ్మెల్సీలను గెలిచే అవకాశం ఉంది. అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తారని ప్రచారం జరగగా, చివరకు మహేష్ కుమార్ గౌడ్ వైపు కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గుచూపింది.
ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ విడుదల చేశారు. నామినేషన్ల గడువు రేపటితో ముగియనున్నాయి. ఈ నెల 29న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు.
అద్దంకి దయాకర్‌కి నో ఛాన్స్
అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం బిగ్ షాక్ ఇచ్చింది. ఎమ్మెల్సీ రేసులో అద్దంకి పేరు వినిపించినా... జాబితాలో మాత్రం మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు చేసింది. మంగళవారం పార్టీ పెద్దలు అద్దంకి దయాకర్‌కు ఫోన్ చేసి నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని సమాచారం ఇచ్చారట. కానీ ఇంత సీన్ రివర్స్ అయ్యింది. కాంగ్రెస్ తాజాగా ప్రకటించిన లిస్ట్‌లో అద్దంకి దయాకర్ పేరు లేదు. అకస్మాత్తుగా మహేష్ కుమార్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది.
చివరి నిమిషంలో
మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. నిజామాబాద్ కు చెందిన ఆయన పార్టీ వ్యవహారాల్లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా టికెట్ దక్కలేదు. దీంతో ఆయన ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడన్న పేరు ఉంది. అయితే ముందు అద్దంకి దయాకర్, బలమూరి వెంకట్ ఖరారు కాగా, చివరి నిమిషంలో మహేష్ కుమార్ గౌడ్ పేరు వచ్చి చేరిందన్న ప్రచారం జరుగుతోంది.
ఎంబీబీఎస్ టు రాజకీయాలు
ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఎంబీబీఎస్ నుంచి రాజకీయాల వైపు వచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఆశించినా దక్కలేదు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలతో పార్టీలో బల్మూరి గుర్తింపు పొందారు. సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడిగా పేరుంది.