Raja Singh : రావణ రాజ్యం అంతమైంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదే- రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
06 December 2023, 16:55 IST
- Raja Singh : కాంగ్రెస్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి మించి ఉండదని, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం వస్తుందన్నారు.
రాజాసింగ్
Raja Singh : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇంకా ప్రభుత్వమే ఏర్పడక ముందే విమర్శలు స్టార్ట్ చేశారు కమలనాథులు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాదికి మించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని, తెలంగాణ బీజేపీ ప్రభుత్వం రాబోతుందని జోస్యం చెప్పారు. బుధవారం అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో... అంబేడ్కర్ చిత్రపటానికి నేతలు నివాళులర్పించారు. అనంతరం రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్, కాంగ్రెస్ పై విమర్శలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదే?
రాజ్యాంగాన్ని మార్చేస్తానన్న కేసీఆర్ ను ప్రజలు మార్చేశారని రాజాసింగ్ విమర్శించారు. ప్రజల్ని మోసం చేసిన కేసీఆర్‌ను ప్రజలు ఫామ్ హౌస్ కు పంపించేశారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదన్నారు. ఏడాదికి మించి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని, అనంతరం బీజేపీ ప్రభుత్వం వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మరిన్ని అప్పులు చేయాలని రాజాసింగ్ అన్నారు. కేసీఆర్ దిగిపోతూ రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశారని ఆరోపించారు. ఆ అప్పులు తీర్చలేక కాంగ్రెస్ నేతల్లో గందరగోళం మొదలవుతుందన్నారు.
రావణ రాజ్యం అంతమైంది
తెలంగాణలో రావణ రాజ్యం అంతమైందని రాజాసింగ్ విమర్శించారు. కేసీఆర్ దళితులను మోసం చేశారన్నారు. బీజేపీ ఒత్తిడితోనే అంబేడ్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. కేసీఆర్ పథకాలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, దళితులను మోసం చేస్తే బీజేపీ వదిలిపెట్టదన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల పేరుతో మోసపూరిత హామీలను ఇచ్చిందని రాజాసింగ్ విమర్శించారు.