TS BJP : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడుతానని అనలేదు, ట్విస్ట్ ఇచ్చిన రాజాసింగ్
14 December 2023, 20:45 IST
- TS BJP : కాంగ్రెస్ ప్రభుత్వంపై మా యుద్ధం మొదలైందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు నిధులు ఎలా తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడుతానని అనలేదని అలాంటి వార్తలు నమ్మొద్దన్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్
TS BJP : తెలంగాణ అసెంబ్లీలో ఎట్టకేలకు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. నిర్మల్ ఎమ్మెల్యే యేలేటి మహేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.
అక్బరుద్దీన్ నాయకత్వంలో ప్రమాణ స్వీకారం ఇష్టం లేకే
అయితే డిసెంబర్ 9న ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో పలువురు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయగా బీజేపీ ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఓవైసీని ప్రోటెం స్పికర్ గా అంగీకరించకుండా ప్రమాణ స్వీకారానికి నిరాకరించి సమావేశాన్ని బహిష్కరించారు. 15 నిమిషాలు సమయం ఇస్తే హిందువులను
చంపేస్తాం అంటూ చెప్పిన వ్యక్తి నాయకత్వంలో తమకు ప్రమాణ స్వీకారం చేయడం ఇష్టం లేదని రాజా సింగ్ తేల్చి చెప్పారు. పూర్తి స్థాయి నియామకం తరువాతే తాము చేస్తామని వెల్లడించారు. కాగా బీజేపీ ఎల్పీ నేతను నియమించకుండానే ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరయ్యారు.
6 గ్యారంటీలకు నిధులు ఇటలీ నుంచి తెస్తారా - రాజా సింగ్
ప్రమాణ స్వీకారం అనంతరం ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని రాజా సింగ్ గుర్తు చేశారు. రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేసి వెళ్లిపోయారని రాజాసింగ్ మండిపడ్డారు. ఇచ్చిన గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అమలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా? లేక ఇటలీ నుంచి తెస్తారా? అని రాజాసింగ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మా యుద్ధం మొదలైందని రాజాసింగ్ పేర్కొన్నారు.
పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తా
పార్టీ ఆదేశిస్తే తాను ఎంపీగా పోటీ చేస్తానని తన మనసులో మాటను రాజా సింగ్ బయటపెట్టారు. ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫ్లోర్ లీడర్ అనేది తమ పార్టీ నిర్ణయిస్తుందని, అన్ని చూసే అర్హత కలిగిన వ్యక్తికి ఫ్లోర్ లీడర్ బాధ్యతలు అప్పగిస్తుందని రాజా సింగ్ వెల్లడించారు. ఫ్లోర్ లీడర్ ఎవరైనా 8 మంది ఒక్కటై పని చేస్తామన్నారు. తాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడుతానని అనలేదని అలాంటి వార్తలు నమ్మొద్దని అన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు ఒకటేనని కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే రాజా సింగ్.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్