Mynampally Hanumanth Rao : బీఆర్ఎస్ లో అణచివేతకు గురయ్యా, భవిష్యత్ కార్యాచరణపై వారం రోజుల్లో నిర్ణయం - మైనంపల్లి
26 August 2023, 16:04 IST
- Mynampally Hanumanth Rao : తన అనుచరులు, ప్రజలతో చర్చించి వారం రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు.
మైనంపల్లి హనుమంతరావు
Mynampally Hanumanth Rao : వారం రోజుల్లో రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. మల్కాజ్ గిరి, మెదక్ సీట్లకు అడిగిన మైనంపల్లికి బీఆర్ఎస్ అధిష్టానం షాకిచ్చింది. మల్కాజ్ గిరి స్థానాన్ని మాత్రమే మైనంపల్లికి కేటాయించింది. దీంతో హర్ట్ అయిన మైనంపల్లి... బీఆర్ఎస్ టికెట్లు ఇవ్వకపోతే స్వతంత్రులుగా రెండు స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అంతకు ముందు మెదక్ లో కల్పించుకున్నందుకు మంత్రి హరీశ్ రావుపై విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మైనంపల్లి భవిష్యత్ కార్యాచరణపై తన అనుచరులతో చర్చిస్తున్నారు.
వారం రోజుల్లో చెబుతా
బీఆర్ఎస్‌లో అణచివేతకు గురి అయ్యామని తన అనుచరులతో మైనంపల్లి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. తాను రాజకీయాల కోసం మారే వ్యక్తిని కాదన్నారు. తన కొడుకు కోవిడ్ సమయంలో రూ.8 కోట్లు పెట్టి ప్రజలకు సాయం చేశారన్నారు. తను కుమారుడు మెదక్ నుంచి పోటీచేయాలని నిర్ణయించుకున్నారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తాను ఓడిపోయానని, ఓటమితో వెనుకాడే వ్యక్తిని కాదన్నారు. తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానన్నారు. మెదక్ తనకు రాజకీయ భిక్ష పెట్టిందన్నారు. తనను ఎవరు ఇబ్బంది పెడితే వారినే తిడతానన్నారు. వ్యక్తిగతంగా తాను ఎవరిని తిట్టనన్నారు. వారం రోజులు పాటు మల్కాజ్ గిరి నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. వారం తర్వాత మీడియాతో మాట్లాడతానని స్పష్టంచేశారు. తొందరపడి మాట్లాడవద్దని కొందరు సూచించారని, అందుకే వారం రోజులు ప్రజల అభిప్రాయం తీసుకుంటామన్నారు. తనను తిట్టేవాళ్లు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. తాను పార్టీని ఏమనలేదన్నారు. సొంత పార్టీ నేతల మీదే కేసులు పెట్టారంటూ మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యానించారు.
అనుచరులతో సమావేశాలు
మల్కాజ్‌గిరి, మెదక్ నియోజకవర్గాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని, వారం తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతురావు తెలిపారు. తన కుమారుడు రోహిత్ కు మెదక్ టికెట్ ఇవ్వలేదని మైనంపల్లి ఫైర్ అవుతున్నారు. రోహిత్‌కు టికెట్ రాకుండా మంత్రి హరీశ్ రావు అడ్డుపడ్డారని ఇటీవల మంత్రిపై మైనంపల్లి హాట్ కామెంట్స్ చేశారు. దీంతో హనుమంతురావు పార్టీ మారతారా? ఇండిపెండెంట్ గా పోటీచేస్తారా? తెలియాల్సి ఉంది. తిరుమల నుంచి హైదరాబాద్ చేరుకున్న మైనంపల్లి తన అనుచరులతో సమావేశమవుతున్నారు.
కాంగ్రెస్ ఆఫర్
మైనంపల్లికి కాంగ్రెస్ పార్టీ ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మైనంపల్లి కోరినట్లు రెండు టిక్కెట్లు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. కాంగ్రెస్ నేతలతో మైనంపల్లి చర్చలు జరిపారని టాక్ నడుస్తోది. మైనంపల్లికి మల్కాజ్ గిరి, రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చినట్లు సమచారం. మెదక్ టికెట్ ఆశిస్తున్న తిరుపతిరెడ్డి, శశిధర్‌రెడ్డిలను కూడా ఒప్పించి, మైనంపల్లి కుమారుడుకి సహకరిస్తామని వారితో ఒప్పించినట్లుగా తెలుస్తోంది. మైనంపల్లి ఆర్థికంగా బలవంతుడు కావడంతో కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయనను కాంగ్రెస్ లోకి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.