Minister KTR : ఎన్నికల్లోపు లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ, లబ్దిదారుల్లో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు- కేటీఆర్
21 September 2023, 20:06 IST
- Minister KTR : ఎన్నికల్లోపు హైదరాబాద్ పరిధిలో లక్ష ఇండ్లు పంపిణీ చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. లబ్దిదారుల జాబితాలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా ఉన్నారన్నారు.
మంత్రి కేటీఆర్
Minister KTR : హైదరాబాద్ శివారులోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ఇళ్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు అన్నారని, కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఇళ్లు నేనే కట్టిస్తా పెళ్లి నేనే చేయిస్తా అంటున్నారని అన్నారు. గ్రేటర్ పరిధిలో 50 వేల కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రభుత్వం పేదలకు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒక్కరోజే నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో దాదాపు 13 వేల ఇండ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ఎంతో పారదర్శకంగా జరుగుతుందోన్నారు. ప్రతిపక్షాల కార్యకర్తలకు కూడా డబుల్ బెడ్రూం ఇండ్లు అందుతున్నాయని కేటీఆర్ వెల్లడించారు.
ఎన్నికల్లోపు లక్ష ఇండ్లు పంపిణీ
హైదరాబాద్ నగరంలో కట్టిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విలువ రూ.9700 కోట్ల పైనే ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మార్కెట్ విలువ 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు పలుకుతుందన్నారు. ఎన్నికల్లోపు లక్ష ఇండ్లు పంపిణీ చేస్తామని, ఇప్పటికే 30 వేల ఇండ్లను లబ్దిదారులకు పంపిణీ చేశామన్నారు. మిగిలిన 70 వేల ఇండ్లు త్వరలో ప్రారంభిస్తామని కేటీఆర్ వెల్లడించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారుల ఎంపికను అత్యంత పారదర్శకంగా కంప్యూటర్ ప్రోగ్రామ్ ఆధారంగా చేస్తున్నామన్నారు.లబ్దిదారుల జాబితాలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా ఉన్నారని ఒక్క లబ్దిదారుడైన ఒక్క రూపాయి లంచం ఇచ్చే పరిస్థితి ఉంటే నేరుగా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఫిర్యాదు చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ ప్రభుత్వం సాహసం చేయని డబుల్ బెడ్రూం కార్యక్రమానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని కేటీఆర్ కొనియాడారు.
బూటకపు హామీలు
కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే పేదలకు న్యాయం జరుగుతోందని, వారి జీవన ప్రమాణాలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. కానీ కొందరు వీరిని చూసి ఓర్వలేక పోతున్నారని అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించలేని కొన్ని పార్టీలు ఈరోజు అడ్డగోలు వాగ్దానాలు చేస్తున్నాయన్నారు. దిల్లీ నుంచి, బెంగళూరు నుంచి వచ్చి అడ్డగోలు వాగ్దానాలు చేస్తున్న వారి మాటలు నమ్మాల్సిన అవసరం లేదని సంక్రాంతికి ముందు గంగిరెద్దులు వచ్చినట్లు ఎన్నికల ముందు వచ్చి బూటకపు హామీలు ఇచ్చే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు.