తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Borlaug Dialogue Ktr : మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ స్థాయి ఆహ్వానం, తెలంగాణ వ్యవసాయ ప్రగతిపై ప్రసంగం

Borlaug Dialogue KTR : మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ స్థాయి ఆహ్వానం, తెలంగాణ వ్యవసాయ ప్రగతిపై ప్రసంగం

HT Telugu Desk HT Telugu

24 September 2023, 21:16 IST

google News
    • Borlaug Dialogue KTR : మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ స్థాయి ఆహ్వానం అందింది. బోర్లాగ్ ఇంటర్నేషన్ డైలాగ్ సమావేశంలో పాల్గొనాలని మంత్రి కేటీఆర్ ను ఆహ్వానించారు.
మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్

Borlaug Dialogue KTR : గడిచిన పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన అద్భుతమైన వ్యవసాయ ప్రగతి ప్రస్థానాన్ని వివరించాలని మంత్రి కేటీఆర్ కు అంతర్జాతీయ స్థాయి ఆహ్వానం అందింది. వ్యవసాయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శాస్త్రవేత్త, ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ ఈ బోర్లాగ్ పేరిట ఏర్పాటు చేసిన బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్ సమావేశంలో మంత్రి కేటీఆర్ ను ప్రసంగించాలని నిర్వాహకులు ఆహ్వానం పంపారు. అక్టోబర్ 24 నుంచి 26వ తేదీ వరకు అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలోని డేస్మోయిన్ లో ఈ సమావేశం జరుగనుంది. ఈ ఏడాది జరుగనున్న బోర్లాగ్ డైలాగ్ సమావేశంలో " స్థిరమైన, సమానమైన, పోషకమైన ఆహార వ్యవస్థను సాధించడానికి పరివర్తన పరిష్కారాలు " అనే ప్రధాన అంశం ఆధారంగా చర్చలు కొనసాగనున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన 1200 మంది అతిథులు ఈ సమావేశానికి నేరుగా హాజరవుతారు. దీంతో పాటు వేలాది మంది సామాజిక మాధ్యమాల ద్వారా ఈ సమావేశాల్లో పాల్గొంటారు. వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన విస్తృతస్థాయి చర్చలను ప్రతి ఏటా ఈ సమావేశాల్లో చర్చిస్తారు.

వ్యవసాయ ప్రగతిపై చర్చ

తెలంగాణ రాష్ట్ర అనుభవాలను ఈ సమావేశంలో చర్చించడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఈ సమావేశాలకు హాజరవుతున్న అనేక మందికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని మంత్రి కేటీఆర్ కు పంపిన ఆహ్వానంలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ అధ్యక్షుడు టెర్రి ఈ బ్రాడ్ స్టాడ్ తెలిపారు. తెలంగాణ సాధించిన వ్యవసాయ ప్రగతి కోసం రాష్ట్రం అనుసరించిన విధానాలు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించడంతో ప్రపంచ ఆహార భద్రతను, సరఫరాను పెంచడం, ప్రపంచ ఆహార కొరతను ఎదుర్కోవడం వంటి కీలకమైన అంశాల పట్ల ఒక విస్తృతమైన అవగాహన ఏర్పడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని వివరించాలని మంత్రి కేటీఆర్ కు పంపుతున్న ఆహ్వానం... ఈ సమావేశానికి గౌరవాన్ని అందిస్తుందని టెర్రీ తెలిపారు.

తెలంగాణ విధానాలకు దక్కిన గౌరవం

తెలంగాణ రాష్ట్ర ప్రగతిని ముఖ్యంగా వ్యవసాయ రంగ ప్రగతిని గుర్తించి ఈ అంశం పైన ప్రసంగించాల్సిందిగా వరల్డ్ ఫుడ్ ప్రైస్ ఫౌండేషన్ పంపిన ఆహ్వానం పట్ల మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలలో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ఎన్నో వినూత్నమైన, విప్లవాత్మకమైన కార్యక్రమాలను అనుసరించిందని వాటి ప్రతిఫలాలను ఈరోజు తెలంగాణ రైతాంగం అందుకుంటుందని, ఆహార భద్రత అంశంలో దేశానికి కూడా తెలంగాణ భరోసాగా నిలుస్తుందన్నారు. ఇంతటి విజయవంతమైన తెలంగాణ వ్యవసాయ నమూనాను అంతర్జాతీయ వేదిక పైన వివరించాలని వచ్చిన ఆహ్వానం తెలంగాణ విధానాలకు దక్కిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. మంత్రి కేటీఆర్ తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి కూడా ఈ సంస్థ ఆహ్వానం అందించింది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్ , హైదరాబాద్

తదుపరి వ్యాసం