Hyderabad Ganesh Immersion : హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం, అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్ల సేవలు పొడిగింపు
27 September 2023, 20:41 IST
- Hyderabad Ganesh Immersion : హైదరాబాద్ గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైళ్ల సేవలను పొడిగించారు. గురువారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడపనున్నారు.
హైదరాబాద్ మెట్రో రైళ్లు
Hyderabad Ganesh Immersion :హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం సందడి మొదలైంది. ఇప్పటికే నిమజ్జనానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. పోలీసులు రూట్ మ్యాప్ లు సిద్ధం చేశారు. నగరంలో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో మెట్రో రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. భక్తుల సౌకర్యార్థం గురువారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లు నడపనున్నట్లు తెలిపారు. తెల్లవారుజామున 2 గంటల వరకు మెట్రో రైళ్లు చివరి స్టేషన్లు చేరుకుంటాయని అధికారులు పేర్కొన్నారు. ఖైరతాబాద్, లక్డీకపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసు బలగాలను, సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటుచేస్తున్నట్లు మెట్రో అధికారులు చెప్పారు. ప్రయాణికుల రద్దీని బట్టి పలు మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, అదనపు రైళ్లు నడపనున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. 29వ తేదీ ఉదయం 6 గంటలకు యథాతథంగా మెట్రో రైళ్ల సేవలు కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు.
535 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
హైదరాబాద్ లో ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా భక్తుల కోసం 535 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన సమాచారం కోసం సికింద్రాబాద్ రేతిఫైల్ బస్ స్టేషన్‌లో 9959226154, కోఠి బస్ స్టేషన్‌లో 9959226160 నంబర్లను సంప్రదించగలరన్నారు.
ఎంఎంటీఎస్ రైళ్లు
హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. నగరంలో అతిపెద్ద గణపయ్య ఖైరతాబాద్ గణేష్ ను సెప్టెంబర్ 28న నిమజ్జనం చేయనున్నారు. సెప్టెంబర్ 28 రాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 4 గంటల వరకు ఎంఎంటీఎస్ స్పెషల్ సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఖైరతాబాద్ గణపతి విగ్రహం ఈ ఏడాది 63 అడుగుల్లో శ్రీ దశమహా విద్యాగణపతిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. గణేశుడి పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు భక్తులకు ఇబ్బంది కలగకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు. 11 రోజులపాటు గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. సెప్టెంబర్ 28న బడా గణేష్ నిమజ్జనం చేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల అనంతరం గణేష్ శోభాయాత్ర ప్రారంభం కానుంది. దీంతో 28వ తేదీ వరకు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.